తణుకు అర్బన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి, మాతా శిశు సంరక్షణకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రూపొందిం చింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి గర్భం దాల్చిన మొదటి కాన్పు గర్భిణులకు మూడు దఫాలుగా రూ.5 వేలు, జననీ సురక్ష యోజన కార్యక్రమంలో భాగంగా రూ.1,000 అందిస్తుంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జిల్లావ్యాప్తంగా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పటికే గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తెలుపుతున్న ఈ పథకం ఇప్పుడు పట్టణాల్లో కూడా ఊపందుకుంది. అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారానికి తోడు గర్భిణి తనకు కావాల్సిన పోషకాలను కొనుగోలు చేసుకునే వీలుగా ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
పథకంలో నగదు పంపిణీ ఇలా..
గర్భిణిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రూ. 1,000 గర్భిణి సొంత బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఆరో నెలలో వైద్యాధికారిచే వైద్య పరీక్షలు చేయించుకున్న పిదప బ్యాంకు ఖాతాలో రూ.2 వేలు జమ వేస్తారు.
బిడ్డ పుట్టిన తర్వాత మూడో డోసు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకున్న తర్వాత రూ.2 వేలు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
అర్హతలివే..
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత గర్భం దాల్చి ఉండి 12 వారాల్లోపు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి.మాతా శిశు ఆరోగ్య రక్షణ వివరాల కార్డు గర్భిణి ఆధార్ కార్డు గర్భిణి పేరుతో ఉండి ఆధార్ అనుసంధానం అయిన బ్యాంకు, పోస్టాఫీసు అకౌంట్ బుక్ గర్భిణి మొబైల్ నంబర్ భర్త వివరాలు, ఆధార్ నంబర్ పూర్తి చిరునామా బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం 3 నెలల్లో రూ.3.42 కోట్లు పంపిణీఇప్పటివరకు జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లోను, గ్రామాల్లోను 18,761 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రూ.3.42 కోట్లు ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాలకు జమచేసినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. గర్భిణులకు ఈ పథకంలో ఏమైనా సందేహాలు ఉంటే ఆ ఏరియా ఆరోగ్య కార్యకర్తను, సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని చెబుతున్నారు.
గర్భిణులకు భరోసా..
ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం పేద గర్భిణులకు భరోసాగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా గర్భిణికి దఫదఫాలుగా రూ.5 వేలు అందిస్తుండగా, జననీ శిశు సురక్ష ద్వారా మరో రూ.1,000 అందిస్తున్నాం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ తర్వాత గర్భం దాల్చి ఉండి మొదటి కాన్పు గర్భిణి ఈ పథకం వర్తిస్తుంది. – డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌వో, ఏలూరు
వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం..
పేద గర్భిణులు అంతా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఇంటింటికి వెళ్లి గర్భిణులను నమోదు చేయడంతోపాటు వారితో దరఖాస్తు చేయిస్తున్నాం. – డాక్టర్ బి.దుర్గామహేశ్వరరావు, తణుకు పీపీ యూనిట్ వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment