మహబూబ్‌నగర్ రూరల్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తినాలి. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు. కానీ పనిచేస్తేనే పూట గడిచే నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో పౌష్టికాహారం తినలేరు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలద్వారా పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం పెట్టడానికి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆలోచన మంచిదే అయినా సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యంతో అన్నం వండటంతో అది జీర్ణంకాక చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు.
నెరవేరని ముఖ్యమంత్రి ఆశయం
అంగన్‌వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని గత ఏడాది జన వరి 31న ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రక టన ప్రకటనగానే ఉండిపోయింది. ఏడాది దాడినా దాని ఊసే లేదు. దీంతో అంగన్‌వాడీలకు వచ్చే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అంగన్‌వాడీ భోజనం అంటేనే వద్దులే.. అన్నట్లు ఆసక్తి కనబరచడంలేదు. రేషన్ బియ్యం కంటే నాసిరకంగా ఉండటంతో తినడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. రోజు గుడ్డుతో పాటు రోజొక కూరగాయ, సాంబారుతో రుచికరమైన భోజనం పెట్టేలా ఆహార పట్టికను తయారుచేసింది. పప్పులు, కోడిగుడ్లు ఏజెన్సీల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇవన్నీ బాగానే ఉన్నా సన్నబియ్యానికి బదులు దొడ్డుబియ్యం సరఫరా చేయడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.
చిన్నారులకు ముద్ద దిగితే ఒట్టు..
ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండడంతో చిన్నారులకు ముద్ద దిగడం లేదు. కాస్త తిని వదిలేస్తున్నారు. తిన్నది కూడా జీర్ణం కాక అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు కేంద్రాలకు పంపించడానికి వెనకాడుతున్నారు. ఉన్నతాధికారులనుంచి సన్నబియ్యం సరఫరా కాకపోవడంతో కార్యకర్తలు దొడ్డు రకం బియ్యాన్నే వండి పెడుతున్నారు. అన్నం ముద్దలు ముద్దలుగా ఉండడంతో తినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనూ సన్నబియ్యం అందిస్తుండగా అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం దొడ్డు రకం బియ్యం పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల పాఠశాలల ఆవరణలోనే అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అరగంట తేడాతో మధ్యాహ్న భోజనాన్ని అందరికీ వడ్డిస్తారు. పక్కనే ఉన్న పాఠశాలల విద్యార్థులు సన్నరకం బియ్యంతో తృప్తిగా భోజనం చేస్తుంటే చిన్నారులు మాత్రం దొడ్డు బియ్యంతో అన్నం తినలేక వదిలేస్తున్నారు. అంగవాడీ కేంద్రాల నిర్వాహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా భోజనం విషయంలో శ్రద్ధ పెట్టడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇంకా ఆదేశాలు రాలేదు
అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు దొడ్డుబియ్యం సరఫరా చేసినప్పటికీ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాం. – జి.శంకరాచారి, మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment