క్షణక్షణం...ప్రాణభయం
క్షణక్షణం.. ప్రాణభయం
ఇరాక్‌లో మనోళ్లు..సహాయక చర్యలు ప్రారంభం
హెల్ప్‌లైన్‌కు11 మంది కుటుంబీకుల గోడు
స్థానికులను నిర్ధారించాలనిజిల్లా యంత్రాంగానికి
సర్కారు ఆదేశం
అసలే పరాయి దేశం.. ఆపై మారణహోమం.. ప్రాణాపాయం నుంచి బయటపడాలనే తపన.. క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆశతో జిల్లాకు చెందిన వందలాది మంది ఇరాక్‌లో బిక్కుబిక్కుమంటున్నారు. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. ఇరాక్‌లో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో మన జిల్లావాసులు బాధితులుగా మారారు. - కలెక్టరేట్ -
అధికారిక వీసాలతో వెళ్లి వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారిని అక్కడి ప్రభుత్వం పనులకు వెళ్లనీయకుండా జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వాసులను రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే విజిట్ వీసాలపై వెళ్లినవారు, వీసా గడువు ముగిసినప్పటికీ ఇరాక్‌లో తలదాచుకుని ఉపాధి పొందుతున్న వారు ఇక్కడికి రాలేక.. అక్కడ ఉండలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజులుగా సెల్‌ఫోన్, ఇతర సమాచార వ్యవస్థ స్తంభించడంతో వారి సంబంధీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు జిల్లాకు చెందిన పదకొండు మంది కుటుంబసభ్యులు ఫోన్ చేసి తమ వారిని కాపాడాలని, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వీరంతా అక్కడ కల్లివెల్లి అయి (అక్రమంగా ఉంటున్నవారు) పని చేస్తున్న వారేనని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా ఆ పదకొండు మంది జిల్లాలోని స్థానికులా.. కాదా.. నిర్దారించాల్సిందిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎన్‌వీ.రమణారెడ్డి జిల్లా యంత్రాంగానికి ఫ్యాక్స్ ద్వారా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా అక్కడి ఇరాక్ ఎంబసీని సంప్రదించి సహాయక చర్యలు చేపట్టే వీలుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ సాధారణ పరిపాలనా (ఎన్‌ఆర్‌ఐ) విభాగం నుంచి ఫ్యాక్స్ ద్వారా పదకొండు మంది పేర్లు, చిరునామా, పాస్‌పోర్టు నంబర్, సంబంధీకుల ఫోన్ నంబర్లతో సహా కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చి వెంటనే స్పందించాల్సిందిగా కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సంబంధిత తహసీల్దార్లకు వివరాలను అందజేసి స్థానికులా.. కాదా నిర్ధారించాలని ఆదేశించడంతో అధికారులు రాత్రి హడావుడిగా ఆ పనిలో నిమగ్నమయ్యారు
.
జిల్లావాసులు నాలుగు వందల మంది పైనే..
ఇరాక్‌లో ఉపాధి కోసం వలస వెళ్లిన జిల్లావాసులు నాలుగు వందల మంది పైనే ఉంటారని తెలుస్తోంది. ఒక్క వేములవాడలోనే 107 మంది ఇరాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాక్ దేశంలోని సిరియా, బాస్రా, మన్సూరియా, బాగ్దాద్, ప్రాంతాల్లో ఉపాధి పొందుతుండగా వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులకు సాయమందించడంతో పాటు వారిని తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆయా మండలాల వారీగా వివరాల సేకరణలో నిమగ్నమయ్యింది.
600ల మందిమి ఉన్నం..
ఇరాక్‌లోని అలవ్ కంపెనీలో వివిధ దేశాలకు చెందిన 600ల మందిమి ఉంటున్నం. ఎప్పుడు ఏమవుతుందో తెలుత్తలేదు. ప్రస్తు తం బస్రాలోని క్యాంపులో తలదాచుకున్నం. కంపెనీ యాజమాన్యం ఇప్పటికీ ఎటూ తేల్చలేకపోతోంది.
- సల్వాజి నాగేందర్, కోనరావుపేట మండలం నిజామాబాద్