
పోలీసు పహారాలో బస్సు సర్వీసులు
జనగామ: బస్సు బస్సుకూ పోలీస్ సెక్యూరిటీతో అధికారులు ఆర్టీసీ బస్సులను నడిపారు. రెవెన్యూ, పోలీసు, మోటారు రవాణాశాఖలు సమ్మెతో ప్రయాణికులకు అంతరాయం కలగకుండా బస్సులను నడిపించారు. ఆర్టీసీ సమ్మె మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. సమ్మెతో జిల్లా కేంద్రంలో శనివారం పోలీసులు హై అలర్టు ప్రకటించారు.జిల్లాలో ఆర్టీసీ సమ్మె మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. తెల్లవారు జామున నాలుగు గంటలకే కార్మికులు డిపో వద్దకు చేరుకోగా అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన తెలుపగా 144 సెక్షన్ అమలులో ఉండడంతో వారిని ప్రెస్టన్ మైదానానికి పంపించారు. తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్ల కోసం వచ్చిన యువతీ, యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించారు. డిపో పరిధిలో ఆర్టీసీకి సంబంధించిన వాటితో పాటు అద్దె బస్సులు అన్నీ కలిపి 125 ఉన్నాయి. ఇందులో 55 ఆర్టీసీ, 12 అద్దె బస్సులు సూర్యాపేట, సిద్దిపేట, పాలకుర్తి, హుస్నాబాద్, ఉప్పల్, హన్మకొండ, జగద్గిరిగుట్ట వైపు నడవగా మారుమూల గ్రామాలకు ఒక్క బస్సు సర్వీసు కూడా వెళ్లలేదు. తాత్కాలిక పద్ధతిలో 64 మంది కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పల్లెలకు నిలిపి వేసిన బస్సులతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ప్రైవేట్ వాహనాల కోసం ఎదురు చూశారు. ఆర్టీసీ సమ్మెతో బట్టల, కిరాణ ఇతర దుకాణ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది.
రెవెన్యూకు కంట్రోల్ బాధ్యతలు
ఆర్టీసీ బస్టాండులో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కంట్రోలర్ బాధ్యతలను అప్పగించారు. తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో వీఆర్వోలు పెండెల శ్రీనివాస్, సంధ్య, క్రాంతి, ఉప్పలయ్య, రాజయ్య, మమత, శ్రీనివాస్ బస్సు సమయ వేళలను చెబుతూ సేవలు అందించారు.
బస్టాండ్‌లోనే కలెక్టర్
డీసీపీ శ్రీనివాసరెడ్డి, డీటీఓ రమేష్‌రాథోడ్, డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్, ఏసీపీ వినోద్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఉదయం ఆరు గంటల నుంచే జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ బస్టాండ్‌లోనే మకాం వేసి బస్సు సర్వీసుల రవాణాను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్న కలెక్టర్, డీసీపీ మధ్యాహ్న సమయంలో కలెక్టరేట్‌కు వెళ్లి మళ్లీ వచ్చారు. అమ్మా ఎక్కడికి వెళ్లాలి.. అంటూ అడుగుతూ బస్సు ఎక్కించారు. జనగామ, బచ్చన్నపేట, సిద్దిపేట జిల్లా చేర్యాల లిమిట్స్‌తో పాటు స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజక వర్గాల శివారు వరకు పోలీసులు బస్సులను సెక్యూరిటీతో నడిపించారు.
పళ్లెటూళ్ల సంగతేంటి...
ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు బస్సు సర్వీసులు ఎక్కడిక్కడే నిలిచి పోయాయి. హైదరాబాద్, పట్టణాలు, ఆయా నియోజక వర్గ కేంద్రాలతో పాటు పక్క జిల్లాలకు బస్సు సర్వీసులను నడిపించగా పల్లెటూళ్ల సంగతి మరిచిపోయారు. మోత్కూరు, సాల్వాపూర్, నర్మెట, తరిగొప్పుల, కొడకండ్ల, నీర్మాల, పెద్దమడూరు, చిన్నమడూరు, కుందారం, గానుగుపహాడ్, కొడవటూరు, కేశిరెడ్డిపల్లి తదితర గ్రామాలు, శివారు పల్లెకు చెందిన వారు స్వగ్రామానికి చేరుకునేందుకు నానాతంటాలు పడ్డారు. ఒక్కో ప్రైవేట్ వాహనంలో పది నుంచి ఇరవై మంది వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
కార్మికులకు రాజకీయ పార్టీల మద్దతు
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్, సీపీఎం, టీడీపీ, బీజేపీతో పాటు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, నాయకులు మోకు కనాకరెడ్డి, నాగారపు వెంకట్, పిట్టల సత్యం, కొంతం శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్రగుప్త, ఉడుగుల రమేష్, వారనాసి పవన్‌శర్మ, ఎలికట్టె మహేందర్‌గౌడ్, బెడిదె మైసయ్య, సురుగు సతీష్‌గౌడ్, జేరిపోతుల కుమార్, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు లింగాజీ, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, శివరాజ్, మోర్తాల ప్రభాకర్, ఆకుల వేణుగోపాల్‌రావు, రంగరాజు ప్రవీణ్ కుమార్ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
వేతనాలు రాలేదు..
ఆర్టీసీ కార్మికులకు సంస్థ ప్రతీ నెల ఐదో తేదీన వేతనాలు అందిస్తుంది. శనివారం వేతనాలు బ్యాంకులో డిపాజిట్ కాకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. పండుగ సమయంలో వేతనాలను కట్టిపడేయంతో పస్తుంటుండాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు గిరిమల్లరాజు, బాలరాజు, ఎల్‌ఎల్‌పతి, ఎ.శ్రీనివాస్, సతీష్, శ్రీకాంత్ తదితరులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment