సాక్షి, ఖమ్మం: జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత చేసిన నిర్మాణ పనుల్లో నాణ్యతపై అధికారులు పట్టించుకోలేదు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంలో కాంట్రాక్టర్లు అడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ప్రశ్నించే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఇసుక, సిమెంట్, కంకర తగిన పాళ్లలో వాడకపోవడంతో ఈ నిర్మాణాలు అప్పుడే మరమ్మతులకు గురవుతున్నాయి. నిర్మించిన తర్వాత 20 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాల్సిన సీసీరోడ్లు, డ్రెయిన్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతూ శిథిలావస్థకు చేరుతున్నాయి. 12, 13 ఆర్థిక సంఘాలు, బీఆర్‌జీఎఫ్ పథకాల కింద ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీలకు 187 పనులు, పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3.73 కోట్లతో 66 పనులు, ఇల్లెందు మున్సిపాలిటీకి రూ. కోటితో 65 పనులు మంజూరయ్యాయి.
ఈ పనుల్లో గత ఏడాది, ఈ ఏడాది మంజూరైన వాటిలో చాలా వరకు ఇంకా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇక పూర్తయిన పనులు నాసిరకంగా ఉండడంతో ఈ వర్షాలకు సీసీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. డ్రైనేజీలు అప్పుడే కూలిపోతున్నాయి. ఇదేంటని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తే.. మళ్లీ కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయిస్తామంటూ దాటవేస్తున్నారే తప్ప పనులు చేయించడం లేదని ఆయా మున్సిపాలిటీల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో బీఆర్‌జీఎఫ్, 12, 13 ఆర్థిక సంఘం నిధులు, బీపీఎస్‌ఎల్‌ఆర్‌ఎస్ నిధులు రూ.23.14 కోట్లతో 121 పనులు చేపట్టారు. ఈపనుల్లో కొన్ని పూర్తి కాగా మరికొన్ని ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. అయితే పూర్తయిన పనుల్లోనూ చాలా వరకు నాసిరకంగానే ఉన్నాయి.
పనిచేయని క్వాలిటీ విభాగాలు..
పురపాలకాల్లో ఏ నిర్మాణం జరిగినా ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం నాణ్యతను పరిశీలించాలి. అయితే సిబ్బంది లేరన్న కారణంతో వీటిని మూసేశారు. ఖమ్మం నగర పాలక సంస్థలో గతంలో నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్ ఉండేది. అధికారులు, సిబ్బంది లేక ప్రస్తుతం ఈ విభాగం మూత పడింది. కార్పొరేషన్ హోదా పెరిగినా ల్యాబ్ మాత్రం తెరుచుకోలేదు.
ప్రతి సీసీ రోడ్డు, డ్రైన్ల నిర్మాణం తొలి దశలోనే క్వాలిటీ విభాగం సిబ్బంది శాంపిల్స్ తీసుకొని ఇసుక, సిమెంట్, కంకర కాంట్రాక్టు నిబంధనల ప్రకారం కలిపారా..? లేదా..? అని దశల వారీగా పరిశీలించాలి. ఏఈ పర్యవేక్షణలో కొనసాగాల్సిన ఈ విభాగం అడ్రస్ లేకపోవడంతో కార్పొరేషన్ పరిధిలో చేస్తున్న నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు అధికారుల చేయి తడిపి తమ ఇష్టానుసారంగా రోడ్లు వేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేకంగా ఈ విభాగాలు లేకపోవడంతో నిర్మించిన రోడ్లు కనీసం ఏడాది కూడా సరిగా ఉండడం లేదు. అధికారులు మాత్రం ఈ విభాగాలు లేకున్నా తామే నాణ్యతను పరిశీలిస్తున్నామని చెబుతున్నా.. మరి నాణ్యత ఎందుకు కొరవడుతోందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు.
నిధులన్నీ దుర్వినియోగం..
ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్ కావడంతో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు నాణ్యత లేకుండా సాగుతున్నాయి. ఇటీవల వేసిన కొన్ని సీసీ రోడ్లను పరిశీలిస్తే..
ఖమ్మం ముస్తఫానగర్‌లో రూ.10 లక్షలతో ఓ కాంట్రాక్టర్ సీసీ రోడ్డు వేయించాడు. నిర్మాణ సమయంలోనే ఇసుక దుబ్బ ఉందని, సిమెంట్ సరిగా వేయడం లేదని కాలనీ వాసులు గగ్గోలు పెట్టినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ఆర్నెళ్లకే ఈ రోడ్డు కంకర తేలింది. అంతేకాకుండా చిన్నపాటి వర్షానికే గుంతలు పడుతున్నాయి.
కొత్తగూడెంలోని 15వ వార్డులో సెయింట్ మేరీస్ పాఠశాల ఎదురుగా ఝాన్సీ హాస్పిటల్ నుంచి బర్లిఫిట్‌లో రామాటాకీస్ రోడ్ వరకు 2011లో బీఆర్‌జీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. మూడేళ్ల కాలంలో రోడ్డు మొత్తం అధ్వానంగా మారింది. కంకర రాళ్లు పైకితేలి పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
గత ఏడాది పాల్వంచలో కేఎల్‌ఆర్ ఫార్మసీ కళాశాల నుంచి భద్రాచలం రోడ్డు వరకు నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యత లోపంతో కంకర తేలి గుంతలమయం అయింది.
కంట్రోల్ లేకపాయె
Published Wed, Aug 27 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement