సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: జమాత్‌కు వెళ్లి వచ్చినవారిని గుర్తించడం అధికారులకు తలకుమించిన భారంగా పరిణమించింది. హోంశాఖ ఇచ్చిన చిరునామాలతో పోలీసు, జీహెచ్‌ఎంసీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూడు రోజులుగా గల్లీలన్నీ గాలించారు. దాదాపుగా వీరిని గుర్తించినట్లు సమాచారం.మరికొందరిని గుర్తించాల్సి ఉంది. చైనా, ఇంగ్లండ్, అమెరికా, ఇటలీ, దుబాయి, ఇండోనేషియా తదితర దేశాల నుంచి వచ్చి ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన బాధితులతో పాటు వారికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబ సభ్యులు, ఇతర బంధువులను గుర్తించి క్వారంటైన్‌కు తరలింపు వ్యవహారం అధికారులకు సవాల్‌గా మారింది. వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ దగ్గర పడటం, గ్రేటర్‌లో రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు గుర్తించిన వారు కూడా అధికారులకు సహకరించడం లేదు. ఇటు పోలీసులు, అటు వైద్యారోగ్యశాఖ అధికారులుగ్రేటర్‌లోని బస్తీలన్నీ జల్లెడ పట్టగా వీరు ఇప్పటికే మరో పది వేల మందిని కలిసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడున్నారు? వీరి కుటుంబాల్లో ఎంత మంది ఉన్నారు? ఇప్పటి వరకు వీరు ఎంత మందిని కాంటాక్ట్ అయ్యారు? వంటి అంశా లను గుర్తించేందుకు పాతబస్తీ సహా ఇతర బస్తీలను జల్లెడ పడుతున్నారు. వీరిని గుర్తించడం ఒక ఎత్తయితే.. క్లోజ్ కాంటాక్ట్‌లను మరో 21 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచడం మరో ఎత్తుగా మారింది.
ఆ నలుగురు మృతుల నుంచి మరెంత మందికో..
మార్చి 13 నుంచి 17 వరకు ఢిల్లీ జమాత్‌కు వెళ్లివచ్చిన వారిలో తెలంగాణ వ్యాప్తంగా 1030 మంది ఉండగా, వీరిలో 603 మంది గ్రేటర్ వాసులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 160 మందిని గుర్తించాల్సిఉంది. గుర్తించిన వారిలో ఇప్పటికే 35 మందిలో పాజిటివ్ వచ్చింది. బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు హైదరాబాద్ వాసులు కాగా, మరో ఇద్దరు నిజామాబాద్, గద్వాల్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. కరోనా వైరస్ సోకి చనిపోయిన హైదరాబాద్‌కు చెందిన ఆ నలుగురు మృతుల నుంచి సుమారు 60 మందికిపైగా క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరిందరినీ ఇప్పటికే గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు వీరు ఎక్కడెక్కడ తిరిగారు? ఎంత మందిని కలిశారు? వంటి ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన నెలకొంది.
♦ ఖైరతాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోయిన అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడి (74)కి క్లోజ్ కాంటాక్ట్‌లో సుమారు 25 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆయన భార్య, కొడుకు, కోడలుకు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్లిన ఇందిరానగర్ బస్తీకి చెందిన మరో వ్యక్తిని గుర్తించారు. ఇప్పటికే ఆయన భార్య గాంధీలో చికిత్స పొందుతుండటం గమనార్హం.
♦ గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన చంచల్‌గూడకు చెందిన జర్నలిస్టు(58)కు ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరో 20 మంది వరకు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. ఈయన జమాత్‌కు హాజరు కాకపోయినప్పటికీ.. నూర్ఖాన్ బజార్‌లోని ఓ కుటుంబ పెద్దతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇటీవలే వేరే దేశం నుంచి వచ్చారు. ఆయన కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరి ద్వారా జర్నలిస్టుకు కూడా కరోనా వైరస్ విస్తరించి ఉంటుందని అంచనా. ఆయనకు క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ ఇప్పటికే కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
♦ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తి (55)కి ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కోడళ్లు, అల్లుళ్లు, కూతుళ్లు, మనవలు.. ఇలా మొత్తం 13 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
♦ గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన దారుషిఫాకు చెందిన వృద్ధుడి (65)కి ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సహా మొత్తం 13 మంది క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ ఇప్పటికే కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి, హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎక్కువ లక్షణాలు ఉన్న వారికి ఆయా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందిస్తున్నారు.
పాతబస్తీలో భయం.. భయం..
పాతబస్తీలో కరోనా కలవరం మొదలైంది. ఢిల్లీలోని జమాత్ ప్రార్థనకుల నగరంలోని పాతబస్తీ నుంచి 128 మంది హాజరైన విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు పొంది మూడు రోజుల క్రితం చనిపోయిన ఇద్దరుపాతబస్తీకి చెందిన వారు కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన వృద్దుడు కాగా.. మరో వ్యక్తికి ఎలాంటి ట్రావెలింగ్ హిస్టరీ లేకపోయినప్పటికీ.. కరోనా వైరస్ భారిన పడి మృతి చెందడంతో పాతబస్తీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దీంతో పలువురు అపార్ట్‌మెంట్‌వాసులు పట్టించుకోకుండా ఫ్లాట్స్ ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.
అధికార యంత్రాంగం అప్రమత్తం..
జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్య బృందాలు అప్రమత్తమయ్యాయి. పాతబస్తీలోని పరిసర ప్రాంతాలను శానిటైజేషన్ చేశారు. చనిపోయిన వారితో నేరుగా కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరించారు. అవసరమైన మేరకు అందరికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో విదేశాల నుంచి 1,166 మంది పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు వచ్చారు. ఇందులో సంబందిత అధికారులు, సిబ్బంది ఆయా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు అవసరమైన వారికి వైద్య చికిత్సలు, గృహ నిర్బంధం చేశారు. వీరికి కోవిడ్ వైరస్ ప్రభావం వీరిపై ఉందా.. లేదా అనే వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.
ముస్లిం ప్రజలు సహకరించాలి..
ఢిల్లీలోని ఉన్నతాధికారులు పూర్తిగా తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సింది. తబ్లీగ్ జమాత్ సభకు విదేశాల ముస్లిం ప్రజలు, ప్రతినిధులు కూడా వస్తున్నప్పుడు ఎందుకు కట్టడి చేయలేదు? అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? నష్టం జరిగిన తర్వాత మేల్కొంటే ఏం ప్రయోజనం? కుల, మతాలకతీతంగా కరోనా వైరస్ సోకుతోంది. ఏ ఒక్క మతాన్ని బద్నాం చేయొద్దు. ఢిల్లీ సభకు హాజరైనవారు స్వచ్ఛందంగా అధికారులకు సహకరించాలి. లాక్ డౌన్‌ను పూర్తిగా పాటించాలి.– మౌలానా ముఫ్తీ మహబూబ్ ఆలం ఆష్రఫీ,మత గురువు, దూద్‌బౌలీ
Comments
Please login to add a commentAdd a comment