
చార్మినార్/డబీర్‌పురా: డబీర్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోని ఫర్హత్‌నగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పౌర సరఫరాల విభాగం సర్కిల్–2 ఎసీఎస్‌ఓ పరిధిలో ట్రాన్స్‌పోర్టు వ్యాపారిగా కొనసాగుతున్న వృద్ధుడు (58) ఒకరు కరోనా వైరస్ పాజిటివ్‌తో శనివారం రాత్రి మృతి చెందాడు. అతని అంత్య క్రియలు కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఆదివారం ముగిశాయి. అంత్యక్రియలు ఇక్కడ చేయరాదంటూ ఈ శ్మశాన వాటికకు దగ్గర్లోని రాజనర్సింహ్మ నగర్ బస్తీ ప్రజలు వ్యతిరేకించారు. శవాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు. అన్ని రకాల శానిటైజేషన్ చర్యలు తీసుకుని ఖననం చేస్తామని డబీర్‌పురా పోలీసులు స్థానికులకు నచ్చచెప్పడంతో బస్తీవాసులు శాంతించారు. కేవలం ఐదుగురు కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. వృద్ధుని మృతితో అధికారులు ఫర్హత్‌నగర్‌ను కంటైన్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించారు. రాత్రికి రాత్రే పర్హత్‌నగర్ బస్తీ ప్రధాన రోడ్డును మూసి వేశారు. పోలీసులు, నోడల్ అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగుతోంది.
20 మంది తరలింపు..
మృతి చెందిన వ్యక్తి రెండతస్తుల భవనంలో ఉండేవాడు. అతనికి ఐదుగురు కుమారులు. ఇద్దరు దుబాయ్‌లో ఉంటారు. మిగిలిన ముగ్గురు కుమారులు, కోడల్లు, మనువలు, మనుమరాళ్లు ఈ భవనంలోనే ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఇదే భవంతిలో కిరాయిదారులు కూడానివసిస్తున్నారు. వృద్ధునికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న వారితో పాటు ఇదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మొత్తం 20 మందిని యునానీ ఆసుపత్రికి క్వారంటైన్‌కు తరలించారు.
కాంపౌండర్ సేవలతో బెంబేలు
డబీర్‌పురాలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ క్లినిక్‌లో పని చేసే కాంపౌండర్ ఒకరు రోగుల కోరిక మేరకు ఇంటింటికి వెళ్లి ఇంజెక్షన్స్, మందులు ఇస్తుంటాడు. కరోనాతో చనిపోయిన వ్యక్తికి గతంలో ఈయన వైద్య సేవలు అందించారు. ఇంజెక్షన్‌లు ఇవ్వడం,సెలైన్ పెట్టడం తదితర వైద్య సేవలను నిర్వహించారు. చుట్టుపక్కల ఇళ్లల్లో సైతం అతను రోగులకు వైద్య సేవలందించారు. ఫర్హత్‌నగర్‌లోని కరోనా పాజిటివ్ వ్యక్తి మృతి చెందడంతో అందరి దృష్టి ఈ యువకుడిపై పడింది. విషయం తెలిసిన వైద్య సిబ్బంది ఆ యువకుడిని క్వారంటైన్ కోసం తరలించారు. అతని రక్త నమూనాలు సేకరించి రిపోర్టుల కోసం వేచి ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా స్థానికంగా ఉన్న చిన్నచిన్న క్లినిక్‌లు మూత పడడడంతో చుట్టు పక్కన బస్తీల్లోని రోగులు ఈ కాంపౌండర్ అందజేసే వైద్య సేవలపై ఆధారపడ్డారు. ఫర్హత్‌నగర్‌లోని చనిపోయిన వ్యక్తికి వైద్యం అందజేసిన కాంపౌండర్‌తోనే ఆ తర్వాత చాలా మంది వైద్యసేవలు పొందారు. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment