జీవన్‌రెడ్డి వర్సెస్ సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ మధ్య వాడీవేడి సంవాదం జరిగింది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతిస్తూనే.. దీనిని కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణ ప్రభుత్వం ఎలా సాధించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడూల్డ్‌లో ఈ బిల్లును చేర్చి ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ నమ్మకం ప్రభుత్వానికి ఉందా? అని సీఎం కేసీఆర్‌ను అడిగారు.
దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఈ బిల్లును కేంద్రం తొమ్మిదో షెడ్యూల్డ్‌లో చేరుస్తుందన్న నమ్మకముందని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పారు. జీవన్‌రెడ్డి న్యాయవాది అయి ఉండి ఇలాంటి విషయాల్లో విమర్శలు చేయడం తగదన్నారు. దీనికి జీవన్‌రెడ్డి స్పందిస్తూ.. ఇంటింటికీ మంచినీళ్లను సరఫరా చేయకుంటే ఓట్లు అడుగబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని, అదేవిధంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించకుంటే ఓట్లు అడుగబోమని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పగలదా? అని ఆయన సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న ఆత్మవిశ్వాసం తమకుందన్నారు.
తమ బిల్లును 9వ షెడ్యూల్డ్‌లో చేర్చకపోతే.. సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించుకుంటామని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలలో పరిమితికి మించి రిజర్వేషన్ అమలులో ఉందని, కొన్ని రాష్ట్రాలలో 80శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పే అందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఈ విషయంలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నించవద్దని, కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన విమర్శలు చేయవద్దని జీవన్‌రెడ్డికి హితవు పలికారు.