జూడాల చర్చలు మళ్లీ విఫలం | Once again, the talks broke down between the junior doctors | Sakshi
Sakshi News home page

జూడాల చర్చలు మళ్లీ విఫలం

Published Mon, Oct 20 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

జూడాల చర్చలు మళ్లీ విఫలం

జూడాల చర్చలు మళ్లీ విఫలం

చర్చల కోసం సచివాలయానికి వెళ్లిన జూడా ప్రతినిధులు
నలుగురే రావాలని అధికారుల సూచన
అందరికీ అవకాశమివ్వాలంటూ వెనుదిరిగిన జూనియర్ వైద్యులు
సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని స్పష్టీకరణ
రెండు గంటలు ఎదురుచూసినా జూడాలు రాలేదు: రాజయ్య

 
హైదరాబాద్: ప్రభుత్వం, జూనియర్ వైద్యుల మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని జూడాల సంఘం తేల్చిచెప్పింది. జీవో 107 ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల పరిధిలోని 1,700 మంది జూనియర్ వైద్యులు అత్యవసర విధులు సైతం బహిష్కరించి గత 21 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన ను విరమింపజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య ఆదివారం చర్చలకు ఆహ్వానించారు. గాంధీ, ఉస్మానియాకు చెందిన 14 మంది జూడాల ప్రతినిధులు సచివాలయానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కేవలం నలుగురు మాత్రమే చర్చలకు రావాలని అధికారులు సూచించడంతో సెక్యురిటీ సిబ్బంది వారిని గేటు ముందే నిలిపివేశారు. ప్రతినిధులందరినీ చర్చల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. చర్చల పేరుతో తమను సచివాలయానికి పిలిచి అవమానపరిచారంటూ జూడాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని జూడాల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, క్రాంతి, అభిలాష్, రాఘవేంద్ర, చైతన్య స్పష్టం చేశారు. సోమవారం నుంచి తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి జూడాలు వ్యతిరేకం కాదని, అయితే తాత్కాలిక ప్రతిపాదికన కాకుండా శాశ్వత ప్రతిపాదికన పంపిస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కేవలం తాము వైద్య విద్యార్థులమని, శస్త్రచికిత్సలు చేసే సీనియర్ వైద్యులం కాదన్నారు. జూడాల సమ్మెతోనే ఆస్పత్రుల్లో రోగులు మృత్యువాత పడుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
 
కొందరినే రమ్మన్నారు: జూడాలు

జూడాల తరఫున కొందరు ప్రతినిధులే రావాలని మంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో.. దాన్ని వ్యతిరేకిస్తూ చర్చల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయామని జూడాలు తెలిపారు. చర్చల కోసం వచ్చిన 14 మందిని సచివాలయం లోపలికి అనుమతించాలని కోరినా.. కేవలం ఇద్దరినే అనుమతించాలని అధికారులు భద్రతా సిబ్బందికి సూచించారన్నారు.
 
సమ్మె వెనుక అదృశ్య శక్తుల ప్రోద్బలం: మంత్రి రాజయ్య


జూనియర్ డాక్టర్ల సమ్మె వెనుక రాజకీయ శక్తుల ప్రమేయముందని మంత్రి టి.రాజయ్య పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అన్ని డిమాండ్లను నెరవేర్చినా జూడాలు ఇంకా మొండికేయడం, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడం వెనక అదృశ్య శక్తుల ప్రోద్బలం ఉందన్నారు. ఇలాగైతే జూడాల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ఆదివారం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జూడాల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని  వెల్లడించారు. జూడాలతో గతంలో నిర్వహించిన చర్చలో బయటి వ్యక్తులు పాల్గొని అమర్యాదకరంగా ప్రవర్తించినందు వల్లే  ఈసారి 14 మంది జూడాలను చర్చలకు ఆహ్వానించామన్నారు. చర్చల కోసం వచ్చిన జూడాలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల కోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో తాను, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా జూడాలు రాలేదన్నారు. చర్చలకు ఆహ్వానిస్తూ ప్రభుత్వం లేఖ ఇస్తేనే వస్తామని జూడాలు పేర్కొనడం ప్రభుత్వాన్ని అవమానపరచడమేనని పేర్కొన్నారు.

ఏడాది పాటు గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో పనిచేయాలనే నిబంధనపై మాట్లాడుతూ... దీనిపై జూడాలు హైకోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. కమల్‌నాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ మధ్య ఉద్యోగుల విభజన పూర్తయ్యే వరకు రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగుల నియామకం చేపట్టలేమన్నారు. జూడాల గౌరవ వేతనాన్ని అసిస్టెంట్ సివిల్ సర్జన్ జీతాలకు సమానంగా రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచడంతో పాటు ఇతర అలవెన్స్‌లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఎంత వ్యయమైనా సరే ఇతర బోధనాసుపత్రుల్లో భద్రతా సిబ్బందిని నియమిస్తామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement