మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే డా.టి.రాజయ్య
హైకమాండ్ సూచనతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంతనాలు
కేటీఆర్, హరీశ్‌రావులతో మాట్లాడిన తాటికొండ?
స్టేషన్ ఘన్‌పూర్ ఇన్‌చార్జ్‌తోపాటు కీలక బాధ్యతలు
పార్టీ వీడొద్దంటూ కేడర్‌కు రాజయ్య పేరిట వాట్సాప్ సందేశాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య కారెక్కెందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనంటున్నాయి ఆయన అనుచర వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌లోనే ఉన్న రాజయ్య.. ఆ ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసిన ఆయన ఇటు బీఆర్‌ఎస్‌లో కొనసాగకుండా.. అటు కాంగ్రెస్‌లో చేరకుండా స్తబ్దతగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన రాజయ్య.. తన పేరిట ‘నేను మళ్లీ వస్తున్నాను.. ఎవరూ పార్టీని వీడకండి’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతుండటంతో ఆయన చేరిక ఖాయమైందన్న చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్ పెద్దలతో పూర్తయిన చర్చలు..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌లో రాజుకున్న అసంతృప్తి ఓటమి తర్వాత.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బట్టబయలైంది. స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, రైతుబంధు సమితి మాజీ చైర్మన్ డాక్టర్ తాటికొండ రాజయ్య, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌లతో మొదలైన రాజీనామాల పరంపర ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరకు కొనసాగింది. తన చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యలు బీఆర్‌ఎస్‌ను వీడటం రాజయ్యను కాంగ్రెస్‌లో చేరడమా? బీఆర్‌ఎస్‌లో కొనసాగడమా? అన్న సందిగ్ధంలో పడేసింది.
ఇదే సమయంలో ఆయన రాజీనామా ఇంకా ఆమోదం కాకపోవడంతో బీఆర్‌ఎస్ హైకమాండ్ రాజయ్య విషయంలో పునరాలోచనలో పడింది. ఈ మేరకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగి రాజయ్యతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. వారంలో రెండు పర్యాయాలు రాజయ్యతో మంతనాలు జరిపిన పల్లా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులతో కూడా మాట్లాడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న రాజయ్య.. పార్టీ అధినేత కేసీఆర్ సమయం తీసుకుని పెద్ద సంఖ్యలో కేడర్‌తో కలిసి కారెక్కుతారన్న చర్చ ఆయన అనుచరవర్గంలో సాగుతోంది. ‘సారు నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. కారెక్కుతాం’ అంటున్నారు.
‘స్టేషన్’ ఇక డా.రాజయ్యదే...
హైకమాండ్ సూచన మేరకు బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న డా.టి.రాజయ్య.. చర్చల సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తాను తెలంగాణ రాష్ట్రసాధన కోసం పార్టీని వీడి టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)లో చేరానని, కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా.. టికెట్ రాకుండా చూడటం కోసం దుష్ప్రచారాలు చేయించినా హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి పని చేశానన్న ఆయన ఇకనుంచైనా భరోసా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో పా టు పార్టీలో కీలకంగా కొనసాగేలా అవకాశం కల్పించనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తాను మళ్లీ పార్టీలోకి వస్తున్నానని, ఎవరూ కూడా కాంగ్రెస్, బీజేపీలకు వెళ్లవద్దని కోరుతూ వాట్సాప్ గ్రూపుల ద్వారా కేడర్‌కు సందేశాలు పంపినట్లుగా చెబుతున్నారు. రెండు రోజుల్లో తేదీని ప్రకటించి కేడర్‌తో కలిసి డా.రాజయ్య బీఆర్‌ఎస్‌లో చేరుతారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment