
మెదక్‌రూరల్: సంతోషంగా బంధువుల పెళ్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరిన తండ్రి, కొడుకులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. ఆటో భైక్‌ను ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ మండలం పాతూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మానగర్ గ్రామానికి చెందిన చింతకింది సిద్దిరాములు(60) ఆయన కొడుకు అంజనేయులుతో కలిసి సమీప బంధువుల వివాహానికి వెళ్తుండగా మార్గమధ్యలో మెదక్–రామాయంపేట రహదారి వద్ద వెనకాల నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో వారి ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొంది.
ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ, కొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిద్దయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం గాంధీకి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఆంజనేయులుకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య పోచమ్మ, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment