గులాబీ గూటికి ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు | ongress MLC hints at joining TRS | Sakshi
Sakshi News home page

గులాబీ గూటికి ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

Published Mon, Sep 1 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

గులాబీ గూటికి ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

గులాబీ గూటికి ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

నేడు సీఎం సమక్షంలో చేరిక
నిజాంసాగర్ /నిజామాబాద్ సిటీ :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ధర్పల్లి రాజేశ్వర్‌రావు గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్సీ స్థాయిగా ఆయన ఎదిగారు. 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాజేశ్వర్‌రావుకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం బలపడింది. అనంతరం రాజేశ్వర్‌ను ఎమ్మెల్సీగా నియమించారు.

నాలుగేళ్లుగా పదవీ కాలం పూర్తికాగా, అనంతరం మరొకసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవటంతో ఆయన ఆ పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల జరిగిన శాసన మండలి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇచ్చి ఆ పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు పంపారు. శాసనమండలి చైర్మన్‌గా పోటీచేసిన స్వామిగౌడ్‌కు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు.

అనంతరం నిజామాబాద్ నగర మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి తెరాస పార్టీకి మేయరు దక్కేందుకు కృషిచేసి పార్టీకి మరింత దగ్గరయ్యారు. గత నెలలో సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రాజేశ్వర్  సీఎంను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. రాజేశ్వర్ ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నించి ఆయన ఇంటికి వె ళ్లి భోజనం చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు రాజేశ్వర్ తెరాస పార్టీలో చేరలేదు. సోమవారం మధ్యాహ్నం పార్టీ కండువా వేసుకోనున్నారు. జుక్కల్, నిజామాబాద్ నియోజకవర్గాల్లోని ఆయన అనుచరులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు భారీగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement