ఆన్‌లైన్‌లో ‘మిషన్’
- మిషన్ కాకతీయపై ‘సాక్షి’ టీవీ ముఖాముఖిలో హరీశ్
- నాణ్యతకు పెద్దపీట.. పర్యవేక్షణకు పది బృందాలు
- సమస్త సమాచారంతో త్వరలో వెబ్‌సైట్
- ఫిర్యాదుల సేకరణకు కాల్ సెంటర్
- చెరువుల కోసం అవసరమైతే పట్టా భూముల సేకరణ
- హైదరాబాద్‌లో ఈ ఏడాది 26 చెరువుల పునరుద్ధరణ
- చెరువులపై ‘సాక్షి’ లేఖలకు స్పందించాల్సిందిగాఅధికారులను ఆదేశించామన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తామని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. పనుల నాణ్యతను పరీక్షించేందుకు ‘ఇంజనీర్ ఇన్ చీఫ్’ నేతృత్వంలో నాణ్యత విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పారదర్శకత కోసం ‘మిషన్ కాకతీయ’కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందురుస్తామన్నారు. ‘‘చెరువు అంచనా వ్యయం, కాంట్రాక్టరు, పూర్తయిన పని, చెల్లించిన బిల్లులు, పెండింగ్ పని తదితర సమాచారాన్ని క్రోడికరించి వెబ్‌సైట్‌ను రూపొందిస్తాం. ఈ వెబ్‌సైట్ ఆధారంగా మిషన్ పనులను పర్యవేక్షిస్తాం’’ అని తెలిపారు. మిషన్ కాకతీయపై శుక్రవారం రాత్రి సాక్షి టీవీ నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రజల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి కూడా పాల్గొన్నారు. దేవులపల్లి అమర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈఎన్‌సీ నేతృత్వంలో తనిఖీ బృందాలు
నాణ్యత విభాగంలో పది బృందాలుంటాయని, చెరువుల పనులను అకస్మికంగా తనిఖీ చేసి నివేదికలిస్తాయని హరీశ్ చెప్పారు. తనిఖీ చేయాల్సిన చెరువు వివరాలను కేవలం ఒక రోజు ముందు మాత్రమే ఈ బృందాలకు ఈఎన్‌సీ తెలుపుతారన్నారు. ‘‘నాణ్యతపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. రైతులు, బెస్త, రజకులతో చెరువుల కమిటీలు ఏర్పాటు చేస్తాం. నాణ్యత పరిరక్షణలో వీటిని భాగస్వాముల్ని చేస్తాం. పునరుద్ధరణ పనులు దక్కించుకోవడానికి 10 శాతం, అంతకు మించి తక్కువకు టెండర్ దాఖలు చేస్తే అంత మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద అదనంగా వసూలు చేస్తాం.
పనులను మధ్యలో వదిలివెళ్లినా..నాణ్యత పాటించకపోయినా డిపాజిట్‌ను జప్తు చేసుకుంటాం. కాంట్రాక్టర్ స్థాయిని, సామర్థ్యాన్ని బట్టి చెరువుల పనులను అప్పగిస్తాం’’ అని వివరించారు. ‘చెరువులపై చర్చ’ శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తున్న ప్రజల లేఖలకు స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. చెరువుల నుంచి తొలగించే పూడిక మట్టికి వ్యవసాయ శాఖ ద్వారా నాణ్యత పరీక్షలు జరిపించిన తర్వాతే రైతుల పొలాలకు తరలిస్తామని హరీశ్ తెలిపారు.
మట్టిని రైతులే సొంతంగా తరలించుకోవాల్సి ఉంటుందన్నారు. పూడిక మట్టిని పంట భూమిలో పరచడం ద్వారా ఎరువులు, పురుగుల మందు అవసరాలు తగ్గి పంట ఖర్చులు తగ్గుతాయన్నారు. నాణ్యత కోల్పోయిన మట్టిని ప్రభుత్వ ఖర్చుతోనే ఇతర అవసరాలకు తరలిస్తామన్నారు. ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
మినీ ట్యాంక్‌బండ్‌లుగా పట్టణ చెరువులు
చెరువుల సామర్థ్యం పెంచేందుకు అవసరమైతే మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించి పట్టా భూములను సేకరిస్తామని హరీశ్ తెలిపారు. ‘‘కబ్జాకు గురైన శిఖం భూములను స్వాధీనం చేసుకుంటాం. వాటికి పరిహారం వర్తించదు. పట్టణ ప్రాంత చెరువు శిఖం భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు మాత్రం మరో చోట ఇంటిని నిర్మించి ఇస్తాం. పట్టణ, నగర ప్రాంత చెరువులను పునరుద్ధరించి మినీ ట్యాంక్‌బండ్‌లుగా తీర్చిదిద్దుతాం. వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్కుల నిర్మాణంతో పాటు బోటింగ్ వసతి కల్పిస్తాం. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది 26 చెరువులను పునరుద్ధరణకు నిర్ణయించాం. కబ్జాకు గురైన చెరువులను కాపాడటమే గాక మళ్లీ కబ్జాకు గురికాకుండా చూస్తాం. కొన్ని చెరువుల తాలూకు ధ్వంసమయ్యాయి, తారుమారు చేసిన పాత రికార్డులను సరిచేస్తాం. వీఆర్‌ఓ, తహశీల్దార్, వ్యవసాయ అధికారి కలిసి చెరువుల సరిహద్దులు నిర్ణయిస్తారు’’ అని చెప్పారు.
అంతా ముందుకొస్తున్నారు
చెరువుల మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ పథకం కింద రెండేళ్లలో రూ.2,500 కోట్లిచ్చేం దుకు కేంద్రం అంగీకరించిందని హరీశ్ చెప్పారు. ‘‘రూ.1,000 కోట్ల రుణానికి నాబార్డు సానుకూలత వ్యక్తం చేసింది. జైకా, ప్రపంచ బ్యాంకుల నుంచి మరో రూ.3,000 కోట్లు సమీకరిస్తాం. ఇలా రూ.10 వేల కోట్లు సమీకరించడంతో పాటు మరో రూ.10 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. రూ.20 వేల కోట్లతో నాలుగైదు ఏళ్లలో చెరువుల పునరుద్ధరణ పూర్తి చేస్తాం’‘ అన్నారు. చెరువులకు తమ కుటుంబసభ్యుల పేర్లు పెట్టి పునరుద్ధరణ పనులు జరిపేందుకు 35 మంది ముందుకొచ్చారని హరీశ్ చెప్పారు. క్రెడాయ్, ఫార్మా కంపెనీలతో పాటు దాదాపు 15 కార్పొరేట్ సంస్థలు చెరువులను సొంత నిధులతో అ భివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయన్నారు.
విశేష స్పందన
మిషన్ కాకతీయపై హరీశ్‌తో సాక్షి టీవీ నిర్వహించిన ముఖాముఖికి విశేష స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, ప్రముఖులు స్పందించా రు. మంత్రికి సలహాలు, సూచనలివ్వడంతో పాటు అభినందనలు తెలిపారు. హరీశ్ తండ్రి సత్యనారాయణరావు, కవు లు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, జయరాజ్‌తో పాటు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ తదితరులు ఫోన్ చేశారు. ప్రాణహిత-చెవెళ్లను పూర్తి చేసి భువనగిరి ప్రాంతానికి సాగునీరు ఇస్తామని కోమటిరెడ్డి ప్రశ్నకు బదులుగా హరీశ్ చెప్పారు.