బంజారాహిల్స్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పైనే బస
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకులక్ష జనాభాకో షెల్టర్ తప్పనిసరి ఆ లెక్కన గ్రేటర్ జనాభా మేరకు 200 షెల్టర్లు అవసరం ప్రస్తుతం ఉన్నవి: 12, ఆశ్రయం పొందుతున్నవారు 200 మంది నీడలేని వారిని గుర్తించే
ప్రక్రియలో నిర్లక్ష్యం తూతూ మంత్రపు సర్వేలను తిరస్కరించిన కేంద్రం.
పొట్టకూటి కోసం వలస వచ్చి..ఏ ఆధారమూ లేక జీవన పోరాటం చేస్తున్న అభాగ్యులు నగరంలో ఎందరో..ఇక కుటుంబ సభ్యుల ఆదరణ లేక... సంతానం లేక..ఏ తోడూ నీడా లేని వారు మరెందరో. వివిధ జిల్లాల నుంచి నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారూ వేలల్లోనే ఉంటారు. వారి సహాయకులకూ సిటీలో నీడ దొరకడం కష్టమే. ఇలాంటి వారికి కనీస ఆశ్రయం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 12 నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశారు.
కానీ ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. మూడేళ్ల క్రితమే కొత్తగా మరికొన్ని షెల్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదు లక్షల మందికో నైట్ షెల్టర్ ఉండాలి. ఆ లెక్కన కోటి జనాభా దాటిన నగరంలో 200 నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం పది శాతం కూడా లేవు. దీంతో చలిలో వణుకుతూ వేలాది మంది నిరాశ్రయులు రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైన అవస్థలు పడుతున్నారు. నిరాశ్రయులను గుర్తించడంలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ఇక ఉన్న షెల్టర్లలోనూ కొన్నిచోట్ల వసతుల కొరత ఉంది.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు తగ్గింది. సాయంత్రం నుంచే మొదలవుతున్న చలిగాలులతో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఇక ఎలాంటి ఆశ్రయమూ లేని వారు చలి రాత్రుల్లోనే జాగారం చేయాల్సి వస్తోంది. చలిని తట్టుకోలేని వారు కడుపులోకి కాళ్లు ముడుచుకొని పడరాని పాట్లు పడుతున్నారు. దుకాణాలు మూసివేశాక షట్టర్ల కింద కొందరు తలదాచుకుంటుండగా..ఫుట్‌పాత్‌లతో సహా ఎక్కడ ఏ మాత్రం దాపు కనిపించినా అక్కడ ముడుచుకుంటున్న వారు ఎందరో.
ప్రతి చలికాలం సీజన్‌లో నిరాశ్రయులకు తగినన్ని నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటిస్తున్న జీహెచ్‌ఎంసీ మాటలు నీటి మూటలవుతున్నాయి. గత మూడేళ్లుగా నైట్‌షెల్టర్లను పెంచుతామంటున్నప్పటికీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చేవారు..ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా ఉంటున్నవారు.. నా అన్నవారు లేని అనాథలు.. యాచకులు తదితరులు చలి తీవ్రతతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రుల వద్ద ఇలాంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదు లక్షల మందికో నైట్ షెల్టర్ ఉండాలి. ఆ లెక్కన కోటి జనాభా దాటిన నగరంలో 200 నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం పది శాతం కూడా ఏర్పాటు కాలేదు. గ్రేటర్‌లో వివిధ ప్రాంతాల్లో 14 నైట్‌షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ కనీస సదుపాయాల్లేక చాలామంది వాటిని కూడా వినియోగించుకోవడం లేరు.
తూతూమంత్రపు సర్వేలు..
ఏ గూడు లేక ఆకాశం కప్పుకిందే తలదాచుకుంటున్న వారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు గత మార్చిలో సర్వే నిర్వహించారు. అలాంటి వారు కేవలం 1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు మూడేళ్లక్రితం నిర్వహించిన సర్వేలో 3500 మంది ఉండగా, ఈ సంఖ్య సగంకంటే తగ్గింది. ఇంతపెద్ద మహానగరంలో ఇంత తక్కువమంది ఉండటాన్ని నమ్మలేక మరోమారు సర్వే నిర్వహించాల్సిందిగా కేంద్రం నుంచి వచ్చిన అధికార బృందం సూచించింది. అయినప్పటికీ ఇంతవరకు మళ్లీ సర్వే నిర్వహించలేదు. నైట్‌షెల్టర్లను పెంచలేదు. చలిరాత్రుల్లో వణకుతున్నవారిలో ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు మూడేళ్ల క్రితమే గుర్తించి, ఆయా ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్‌టీ, ఉస్మానియా, నిలోఫర్, గాంధీలతో సహా మొత్తం ఏడు ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్‌కు అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు ఒక్కచోట కూడా అందుబాటులోకి రాలేదు.
ఉండాల్సిన చోట లేక.. ఉన్నవాటి గురించి తెలియక..
నైట్‌షెల్టర్లను ఆశ్రయించేవారికి కేవలం ఆశ్రయం మాత్రమేకాక, తగిన పడక, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు తగిన ఏర్పాట్లతోపాటు, లాకర్లు, రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ సదుపాయాలున్నాయి. 12 నైట్‌షెల్టర్లలో 380 మంది ఉండేందుకు సదుపాయాలున్నాయని జీహెచ్‌ఎంసీ చెబుతుండగా, వాటిల్లో ఉంటున్న వారు 200 మందికి మించడం లేదు. వీటి గురించి తెలియక చాలామంది షెల్టర్లను వినియోగించుకోవడం లేదు. ఉన్న నైట్‌షెల్టర్లు ప్రధాన రహదారులు, ఆస్పత్రులు, బస్టాండ్లకు దూరంగా ఉండటంతో వీటి గురించి సమాచారం తెలియడం లేదు. ఉస్మానియా, నిలోఫర్, ఆస్పత్రుల్లో వెయ్యిమందికి పైగా ఉండే ఇన్‌పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారు అంతకు ఎక్కువే ఉంటారు. ఎంఎన్‌జే క్యాన్సర్, కోఠి, పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే అటెండెంట్లు కూడా వెయ్యి మంది వరకు ఉంటారు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో హోటళ్లు, లాడ్జిల్లో ఉండలేక ఆస్పత్రుల పరిసరాల్లోనే ఎముకలు కొరికే చలి రాత్రుల్లో అల్లాడుతున్నారు.
ఉపయోగించుకుంటున్నది ఎందరు?
బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్ కాక జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో 12 నైట్‌షెల్టర్లున్నాయి. వాటిల్లో 380 మందికి వసతికి సదుపాయం ఉన్నట్లు పేర్కొంటున్నప్పటికీ 200మంది కూడా ఉండటం లేదు. జీహెచ్‌ఎంసీ లెక్కల్లో మాత్రం ఎక్కువ మంది ఉంటున్నట్లు చూపుతున్నారు. రాత్రిపూట తక్కువ ధరకు (రూ. 5 )భోజనం ఏర్పాట్లు ఏ నైట్‌షెల్టర్‌లోనూ లేవు. సరూర్‌నగర్ మహిళల నైట్‌షెల్టర్‌లో 20 మందికి వసతి ఉన్నట్లు పేర్కొనగా, 12 మంచాలున్నాయి. వండుకునే వారి కోసం గ్యాస్, స్టవ్ సదుపాయాలున్నాయి.
నిలువ నీడ లేక..వేరే దారి లేక...బంజారాహిల్స్‌లో రోడ్ల పక్కనే నిద్రిస్తున్న దృశ్యం
నామాలగుండులో వసతులు ఓకే...
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నామాలగుండులోని జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయంలో మహిళల కోసం నైట్‌షెల్టర్ కొనసాగుతుంది. ఇందులో 29 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. 15 మంది మహిళలు బయట ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ ఆశ్రయం పొందుతుండగా, మిగతా 14 మంది ఇక్కడే ఉంటూ కుట్టు పనులు చేసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌లతో ఇక్కడే శిక్షణ పొంది మహిళలు ధరించే నైటీలను కుడుతున్నారు. బయట నుంచి కొన్ని కంపెనీలు నైటీలను బల్క్‌లో కుట్టడం కోసం అవపరమైన క్లాత్, దారంను అందిస్తున్నాయి. ఒక్కో నైటీ కుట్టినందుకుగాను వీరికి రూ.40 కూలీ ఇస్తుంటారు. నైట్ షెల్టర్‌లో వసతులు బాగున్నాయని ఆశ్రయం పొందుతున్న మహిళలు చెబుతున్నారు.
పేట్లబురుజులో 20 మంది బస
దూద్‌బౌలి: పేట్లబురుజులోని వార్డు కార్యాలయంలో నైట్ షెల్టర్ కొనసాగుతుంది. ఇందులో గతంలో 30 మంది ఉండగా... ప్రస్తుతం 20 మంది బస చేస్తున్నారు. వీరికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భోజన సదుపాయంతోపాటు దుప్పటి, బకెట్, సబ్బులు, పరుపుతో కూడిన మంచం ఏర్పాటు చేశారు. నైట్ షెల్టర్ కేర్‌టేకర్ ఖాలేద్ ఖాన్ మాట్లాడుతూ... 20 మందికి సరిపడా బెడ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వారికి సమయానికి భోజన, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఒక వేళ అధిక సంఖ్యలో సభ్యులు చేరితే వారిని బేగంపేట్ కార్యాలయానికి తరలిస్తున్నామన్నారు.
బేగంపేటలో 50 మంది...
సనత్‌నగర్: బేగంపేట బ్రిడ్జి కింద ఉన్న జీహెచ్‌ఎంసీ పునరావసం కేంద్రంలో దాదాపు 50 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ఇక్కడ ఉంటూ హౌస్ కీపింగ్, ఫ్లంబర్, హోటల్స్, హెల్పర్స్, అడ్డా కూలీలు, కాల్ సెంటర్...ఇలా తమకు తోచిన పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇక ఇక్కడ వసతుల విషయానికొస్తే...నిద్రించేందుకు బెడ్స్, మ్యాట్స్, బెడ్‌షీట్స్, దిండ్లు, సామాన్లు భద్రపరచుకునేందుకు లాకర్స్, టాయిలెట్స్, కిచెన్ అండ్ ఫుడ్, టీవీ తదితర సదుపాయాలున్నాయి. షెల్టర్‌ను ఆనుకునే ఉన్న రూ.5 భోజన కౌంటర్‌లో చాలా మంది మధ్యాహ్నం భోజనాలు కానిచ్చేస్తారు. రాత్రికి ఎవరైతే షెల్టర్‌లో భోజనం చేయాలనుకుంటారో లిస్ట్ తయారుచేసి, వారికి రూ.20లకు భోజనం అందిస్తారు. నగరం వ్యాప్తంగా ఉన్న షెల్టర్లలోని వారంతా ప్రతి ఏటా అక్టోబర్ 2న కలుసుకుని పరస్పరం తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment