సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులకు దాదాపు దశాబ్దకాలం నుంచి సేవలు అందిస్తున్న పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే రహదారి మళ్లీ కొత్తరూపు సంతరించుకోనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే మొదలైన నాడు వేసిన బీటీ రోడ్డు తొలగించి కొత్త బీటీ రోడ్డు వేయనున్నారు. అయితే ఈ పనులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం పీవీ ఎక్స్‌ప్రెస్ వే నుంచి వన్‌వేలో అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వచ్చే వారు మాత్రం ఎక్స్‌ప్రెస్ వే కింది నుం చి రావల్సి ఉంటుంది. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు.
వాహనదారుల భద్రత కోసమే...
11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్ధారిత వేగంతో వెళ్లినా రోడ్డు బాగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2009, అక్టోబర్ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్ వే రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు సోమవారం నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్‌వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్‌వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్‌వేలోనే శంషాబాద్ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా...
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది.
- చాంద్రాయణగుట్ట, జూపార్క్ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి చేరుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment