సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల నిర్వహణను హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ పేరిట టెండర్లు పొందిన ఓ కాంగ్రెస్ నాయకుడు బినామీగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు న్నాయి. సదరు నేతకు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలుస్తోంది. సమాచారం ఇచ్చే విషయంలో అన్ని స్థాయిల్లోనూ అసలు విషయాలను పక్కనబెట్టి.. దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 19న ‘సాక్షి’లో గుత్ప ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది ఇటు అధికారవర్గాలు.. అటు అధికార పార్టీ నేతల్లో కలకలం రేపింది. ఓ వైపు ఇంటెలిజెన్స్, మరోవైపు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నాయి. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ విషయమై రెండు రోజుల క్రితం నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇంజినీరింగ్ అధికారుల్లో కలకలం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో చక్రం తిప్పిన ఆర్మూర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నేత నీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రదర్శించిన చేతివాటం కొందరు ఇంజినీరింగ్ అధికారులకు సంకటంగా మారనుంది. 2011 నుంచి ఇప్పటి వరకు రెండు సాగునీటి పథకాల నిర్వహణలో జరిగిన నిధుల వినియోగంపై విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్, విజిలెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు రంగంలోకి దిగడం కలకలం రేపుతోంది.
సుమారు మూడేళ్లలో గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం విడుదలైన రూ. 55.77 కోట్ల నిధులు, ఖర్చులు తదితర వివరాలపై రెండు నిఘా సంస్థలు దృష్టి సారించడం ఇంజినీరింగ్ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పనుల్లో అనేక లోపాలు, అక్రమాలు చోటు చేసుకున్నా సదరు నాయకుడిని దృష్టిలో పెట్టుకుని అధికారులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ప్రభుత్వం ఏటా విడుదల చేసిన నిధులు.. నిర్వహణ ఖర్చులతో సమానం చేస్తూ బిల్లులు తయారు చేసి పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఇటీవల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అక్రమాల విషయంలో కొందరు సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు.
గుత్ప ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. తాజాగా ఈ ఏడాది జూన్ 25న రూ. 55.78 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను 2015 జులై 31 వరకు ఖర్చు చేయాలి. నందిపేట, బాల్కొండ, మాక్లూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన 55 గ్రామాల్లో సుమారు 38,967 ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్వహణ కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో మూడేళ్లలో ఖర్చు చేసిన నిధుల వివరాలతో పాటు రెండేళ్ల కోసం విడుదలైన రూ. 55.78 కోట్ల వినియోగంపైనా నిఘా సంస్థలు దృష్టి సారించాయి.
త్వరలోనే..
అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణలో జరిగిన నిధుల గోల్‌మాల్ వ్యవహారం త్వరలోనే బయట పడనుందన్న చర్చ సాగుతోంది. భారీగా జరిగిన అవకతవకలపై వెలువడిన కథనంపై ఇంజినీరింగ్ శాఖలోని కొందరు అధికారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్ హయాం లో 2011 నుంచి నీటిపారుదలశాఖలో అన్నీ తానై వ్యవహరించిన ఆర్మూర్‌కు చెందిన సదరు నాయకుడి గురించి కూడా చర్చించుకుంటున్నారు. అయితే గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం ఏటా పెడుతున్న ఖర్చుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగోలా సమాచారాన్ని సేకరించి వెలువరించిన ‘సాక్షి’ కథనంపై స్పందించిన నిఘా సంస్థలు ‘గుత్ప’ లెక్కలు విప్పేందుకు సిద్ధం కావడం కలకలం రేపుతోంది.
ఎత్తిపోతల పథకం నిర్వహణలో ప్రధాన అంశాలు ఏమిటి? 2011 నుంచి ఈ పథకం నిర్వహణ కోసం ఎంత వరకు ఖర్చు చేశారు? అంశాల వారీగా ఖర్చులకు సంబంధించిన వివరాలు ఏమిటి? కరెంట్ బిల్లులు, పైపులైన్ల ఏర్పాటు పోను.. ఎప్పుడెప్పుడు మోటార్లు, పైపులైన్‌ల మరమ్మతులు చేయించారు? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా ఎత్తిపోతల పథకంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, కార్మికులకు ఎందరు? క్షేత్రస్థాయిలో వాచ్‌మన్ నుంచి అపరేటర్, సూపర్‌వైజర్ తదితర కేటగిరిల్లో 80 నుంచి 120 మందిని కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాల్సి ఉండగా.. ఎందరు పనిచేస్తున్నారు? వారికి చెల్లిస్తున్న జీతభత్యాలు ఎంత? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. నిజాలు వెలుగు చూస్తాయా అన్న విషయమై వేచి చూడాలి.
రట్టుకానున్న గుత్ప గుట్టు!
Published Tue, Nov 25 2014 2:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement