ఆపరేషన్ మోత్కుపల్లి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా తెలుగుదేశం పార్టీలో కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటివరకు సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు అండగా ఉండి ఆయన గ్రూపులో పనిచేసిన నాయకులు కూడా ఇప్పుడు జిల్లా పార్టీలో ఆయన జోక్యం వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తన గెలుపుకోసం జిల్లాను వీడివెళ్లి, ఇక్కడి నేతల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన మోత్కుపల్లిని జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించాలని పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసినట్టు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం దృష్ట్యా గ్రూపులకతీతంగా జిల్లా నేతలమంతా ఐక్యంగా పనిచేస్తామని, అయితే మోత్కుపల్లిని మాత్రం పార్టీ వ్యవహారాల్లో వేలుపెట్టనీయమని వారంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా తనకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఉన్నా, తను కావాలన్న స్థానాన్ని ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నా, కేవలం గెలుపే ధ్యేయం గా ఖమ్మం జిల్లాలో పోటీ చేసిన మోత్కుపల్లి వైఖరే గత ఎన్నికల్లో తమ ఓటమికి ప్రధాన కారణమైందనే వాదన జిల్లా పార్టీ నేతల్లో వినిపిస్తోంది.
తెలంగాణవాదం జిల్లాలో బలంగా ఉందని, ఈ పరిస్థితుల్లో తన గెలుపు అసాధ్యమనే భావనతోనే ఆయన ఆంధ్రప్రాంతానికి సమీపంలోని మధిర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని, టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా గట్టిగా పనిచేసిన మోత్కుపల్లే జిల్లాను వీడివెళ్లడంతో ఇక్కడ పోటీచేసిన నేతలు కూడా గెలవలేరనే భావనకు ప్రజలు వచ్చినందునే తమను ఆదరించలేదని, తమ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇదొకటని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు మధిరకు వెళ్లిన మోత్కుపల్లికి ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి ఇచ్చి, ఆ జిల్లా పార్టీలోనే పనిచేయించాలని చంద్రబాబును కోరినట్టు తెలిసింది. మోత్కుపల్లిని తప్పిస్తే జిల్లాలో మిగిలిన పార్టీ నేతలమంతా కలిసి పనిచేసుకుంటామని, గ్రూపులు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారని సమాచారం. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్’ ఏం నిర్ణయం తీసుకుం టారు? మోత్కుపల్లిని జిల్లా పార్టీ వ్యవహారాలకు దూరంగా పెడతారా?యథావిధిగా కొనసాగుతారా అన్నది ఇప్పుడు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
సభ్యత్వ నమోదుపై సమీక్ష
జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుపై గురువారం నేరేడుచర్లలో జిల్లా నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న ల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి పి.రాములు కూడా హాజరయ్యారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమామాధవరెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు వంగాల స్వామిగౌడ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిలువేరు కాశీనాథ్, పాల్వాయి రజనీకుమారి, బంటు వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా మోత్కుపల్లి వ్యవహారంపై చర్చ జరిగినట్టు సమాచారం.