అయ్యో... మోత్కుపల్లి
సాక్షిప్రతినిధి, నల్లగొండ
జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. సీనియర్లు అనుకున్న నేతలే కొత్తదారులు వెదుక్కుంటున్నారు. ఆ పార్టీకి జిల్లా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది అనడానికి కొత్త పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆ పార్టీ తరఫున ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు మూడుసార్లు.. ఆపైన గెలిచిన వారే. అయినా, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పక్షాన పోటీ చేయడానికి ఒకరిద్దరు జంకి ప్రత్యామ్నాయం వెదికారని సమాచారం.
ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎవరూ పార్టీ మారలేదని ప్రచారం జరుగుతోంది. కాగా, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. రాజ్యసభ సీటు ఆశించిన ఆయనకు చంద్రబాబు షరామామూలుగానే మొండిచేయి చూపడంతో కాంగ్రెస్ గడప తొక్కుతారని వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ మారే సూచనలేవీ కనిపించకున్నా, సొంతపార్టీలోనూ సంతృప్తిగా ఏమీ లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆయన ఈసారి ఎక్కడి నుంచి బరి లోకి దిగాలనే అంశంపైనా ఓ స్పష్టత లేకుండా రకరకాల ప్రకటనలు ఇస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనలో ఆలేరు సీటు జనరల్‌గా మారడంతో ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తికి వలసపోయిన మోత్కుపల్లి, అక్కడి మాజీ ఎమ్మెల్యే సంకినేని అండతో 2009 ఎన్నికల్లో విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన పరిణమాల్లో సంకినేని టీడీపీ గుడ్‌బై చెప్పడంతో నర్సింహులుకు సహకరించే పార్టీ కేడర్ లేకుండా అయ్యింది. దీంతో ఆయన తిరిగి తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి వెనకా ముందవుతున్నారు.
ఈ కారణంగానే పూటకో ప్రకటన చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. నిన్నటికి నిన్న మోత్కుపల్లి నర్సింహులు ‘పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తా’ అని ప్రకటిం చారు. గతంలో ఆలేరు నుం చిమళ్లీ పోటీచేస్తానని కార్యకర్తల సమావేశాల్లో, విలేకరుల సమావేశాల్లో ప్రకటిం చిన ఆయన తాజాగా మల్కాజిగిరి నుంచి పోటీ అన్న అం శాన్ని తెరపైకి తెచ్చి కొత్త చర్చకు కారణమయ్యారు.
ఒక దశలో ఆయన నకిరేకల్ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి బరిలోకి ది గుతారన్న ప్రచారమూ జరగింది. గడిచిన మూ డు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ ప్రచారం తో ఆయన అనుచరవర్గం కొంత అయోమయంలోనే ఉంది. ఇప్పటి దాకా, ఆలేరు నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జ్‌ను నియమించలేదు.ఇన్‌చార్జ్ నియామకం కాకుండా అధినేత ముందరి కాళ్లకు బంధం వేసింది కూడా ఆయనేనని పార్టీ వర్గాల్లో నిరసన వ్యక్తం అ య్యింది. ఆలేరు నియోజకవర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు పార్టీ కూడా మారారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 45 రోజుల్లోనే పూర్తి కానున్న నేపథ్యంలో మోత్కుపల్లి ‘బెర్తు’ ఎక్కడ అన్న అంశంపై తమ్ముళ్లలో రక రకాల ప్రచారం జరుగుతోంది.