‘బెల్టు’ ఊడేదెలా? | Over and Sarah becomes the new alcohol policy | Sakshi
Sakshi News home page

‘బెల్టు’ ఊడేదెలా?

Published Sun, Jun 15 2014 11:39 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

‘బెల్టు’ ఊడేదెలా? - Sakshi

‘బెల్టు’ ఊడేదెలా?

మెదక్: కొత్త సీసాలో పాత సారా అన్నట్లుంది నూతన మద్యం విధానం. కొద్ది పాటి మార్పులు తప్పిస్తే మిగతా పాలసీ అంతా పాతదే. బెల్టు షాపులు అరికట్టేందుకు ఎలాంటి విరుగుడు ప్రకటించక పోవడంతో.. ఊరూర ఆరు క్వార్టర్లు.. మూడు బీర్లు అన్న చందంగా మద్యం పొంగి పొర్లే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి బాటిల్‌కు తప్పనిసరి కంప్యూటరు బిల్లు ఇవ్వాలన్న నిబంధన అక్రమ వ్యాపారులకు మింగుడు పడని నిర్ణయం. మద్యం సీసాపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్ కోడ్ ముద్రణ లిక్కర్ మాఫియా పాలిట పిడుగు పాటులా మారింది. 2014-15 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది.
 
 వచ్చే నెల నుంచి పాలసీ అమలవుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారుల్లో కదలిక మొదలైంది. జిల్లాలోని 175 మద్యం దుకాణాల కోసం సిండికేటు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మెదక్, సంగారెడ్డిలలో రెండు ఎక్సైజ్ యూనిట్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం175 మద్యం దుకాణాలు ఉండగా 2012లో 148 షాపులకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. దీంతో 27 దుకాణాలు ఖాళీగానే మిగిలి పోయాయి.అప్పట్లో గత ప్రభుత్వం 2012 జూన్‌లో మద్యం దుకాణాలకు టెండ ర్లు ఆహ్వానించింది. 2013 జూన్‌లో తిరిగి పాత దుకాణాల లెసైన్సులను యేడాది కాలం పాటు పొడిగించింది.
 
 పిడుగు పాటులా మారిన ప్రివిలేజ్ ట్యాక్స్
 2012లో రూపొందించిన ఎక్సైజ్ విధానంలో ప్రవేశ పెట్టిన ప్రివిలేజ్ ఫీజు విధానం మద్యం వ్యాపారుల పాలిట పిడుగుపాటులా మారింది. దీని ప్రకారం ఒక వైన్‌షాప్ లెసైన్స్ ఫీజుకు 6 రేట్ల కన్నా అధికంగా మద్యం విక్రయాలు జరిపితే, మిగతా మద్యం అమ్మకాలపై 15.01 శాతం మేర ప్రివిలేజ్ ట్యాక్స్‌గా వ్యాపారుల నుంచి వసూలు చేశారు. ఫలితంగా మద్యం వ్యాపారులకు ఆశించిన లాభాలు రాలేదు.
 
 దీంతో వ్యాపారుల విజ్ఞప్తి మేరకు 2013లో ప్రివిలేజ్ ట్యాక్స్ పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు లెసైన్స్ ఫీజుకు 7 రేట్ల కన్నా అధికంగా అమ్మకాలు జరిపితే ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 14.01 శాతంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి కొత్త విధానంలో ప్రివిలేజ్ టాక్స్‌ను మరింత తగ్గించి 13.06 శాతంగా నిర్ణయించారు. దీంతో వ్యాపారులు కొంత మేర ముందుకు రావచ్చునని, మిగులు షాపులకు కూడా టెండర్లు పడవచ్చునని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
 
 బెల్టు షాపుల మూసివేత ఒట్టిదేనా?
 బెల్టుషాపుల మూసివేతకు పకడ్బందీ ప్రణాళిక ప్రకటించకపోవడంతో పల్లెల్లో మద్యం పొంగిపొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బెల్టుషాపులను కానరాకుండా చేయాలంటే మద్యం విక్రయాలు ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలనే అవకాశాన్ని పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ అధ్వర్యంలో మద్యం విక్రయాలు జరిపితే బెల్టు షాపులకు విచ్చలవిడిగా మద్యం విక్రయించే అవకాశం ఉండదని భావించినట్లు సమాచారం. తద్వారా బెల్టు షాపులను పూర్తిగా మూసివేయ వచ్చని భావించారు. కాని పాత విధానం ప్రకారమే వైన్ షాపులను లాటరీ ద్వారా కేటాయించాలని నిర్ణయించడంతో మహిళలు, మద్య నిషేధ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బెల్టుషాపులన్నీ మూసివేశామని అధికారులు చెబుతున్నా.. అవి యథావిధిగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు 10 వేలలోపు జనాభా ఉంటే రూ.32.50 లక్షలు, 10వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉంటే రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల లోపు జనాభా ఉంటే రూ.42 లక్షలు,3 లక్షల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ఉంటే రూ.68 లక్షలు,  20 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.90 లక్షల ఫీజును నిర్ధారించారు. కాకుంటే ప్రతి మద్యం సీసాకు తప్పకుండా కంప్యూటర్ బిల్లు ఇవ్వాలని, అక్రమ మద్యం విక్రయించకుండా ప్రతి బాటిల్‌పై హోలోగ్రాంతో పాటు 2డీ బార్‌కోడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
 
 ఈ యేడు కోటా భర్తీ అయ్యేనా..!
 ప్రివలేజ్ ట్యాక్స్ ఫలితంగా జిల్లాకు కేటాయించిన వైన్ షాపులు పూర్తి స్థాయిలో టెండర్‌కు నోచుకోలేదు. మెదక్, సంగారెడ్డి రెండు యూనిట్లు ఉండగా 175 వైన్‌షాపులు కేటాయించారు. సంగారెడ్డి పరిధిలో 99 వైన్ షాపులుండగా 81 దుకాణాలు, మెదక్ పరిధిలో 76 షాపులకు 67కు మాత్రమే టెండర్లు దాఖల య్యాయి.
 
 మొత్తం 27 దుకాణాలు టెండర్‌కు నోచుకోలేదు. ఈసారి కూడా ప్రివిలేజ్ ట్యాక్స్ మార్పు కేవలం 0.5 శాతం మాత్రమే తగ్గించినందున పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.  గత ఏడాది జిల్లాలో లెసైన్స్ ఫీజు పరంగా రూ.79,87లక్షల 20వేల ఆదాయం వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement