బెల్ట్‌ జోరు.. పల్లె బేజారు | Growing liquor sales In Villages In medak | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం

Published Fri, Jul 5 2019 12:27 PM | Last Updated on Fri, Jul 5 2019 12:27 PM

Growing liquor sales In Villages In medak - Sakshi

సాక్షి, వట్‌పల్లి(మెదక్‌) : పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్టుషాపులతో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్నా అవి లెక్కల వరకే పరిమితమవుతున్నాయి. నూతన ఎక్సైజ్‌ మద్యం పాలసీని తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుంది. దీంతో వారి వ్యాపారం మూడు క్వాటర్లు, ఆరు బీర్లుగా కొనసాగుతోంది. మండంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ఒకటి నుంచి రెండు బెల్టు షాపులు నిర్వహణ కొనసాగుతుందంటే ఎక్సైజ్‌ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఎనీటైం మద్యం. 
గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపుల సమయపాలన లేకుండా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. 
గ్రామాల్లోని కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు. వట్‌పల్లి, జోగిపేట ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకువెళ్లి ఒక మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ రేటు కంటే రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. 

పట్టించుకోని అధికారులు.. 
గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు, కిరాణషాపులు బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెళ్లడించినప్పటికి గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నా సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. 

నిషేధం బుట్టదాఖలు.. 
గ్రామాల్లో మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడంతో పాటు కుటుంబాలు అప్పుల కొరల్లో చిక్కుకోవడం,గొడవలు వంటి సంఘటనలు చోటు,చేసుకోవడంతో మండలంలోని నాగులపల్లి, ఖాదిరాబాద్‌లో, మర్వెళ్లీ గ్రామాల్లో మద్యం నిషేధిస్తూ గ్రామస్తులంతా తీర్మానించారు. సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఎక్సైజ్‌ అధికారులు నిషేధిత గ్రామాల వైపు చూసిచూడనట్లు వ్యవహరించడంతో మూడు నెలల్లోనే మద్యం అమ్మకాలు పునఃప్రారంభమవడంతో నిషేద తీర్మానాలు బుట్టదాఖలయ్యాయి. 

కేసులు నమోదు చేస్తాం 
గ్రామాల్లో బెల్టుషాపులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం.గ్రామాల్లో మద్యం విక్రయాలను నివారించేందుకు నిరంతర తనిఖీలు చేస్తూనే ఉన్నాం.గ్రామాల్లో ఎవరైన మద్యం విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.  
– సుబ్రహ్మణ్యం, ఎక్సైజ్‌ సీఐ, జోగిపేట 

నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి 
గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే దారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజల మధ్య అల్లర్లు, గొడవలు జరుగడానికి మద్యం కారణమవుతోంది. బెల్టుషాపుల నిర్వాహకులపై వారిపై ఎక్సైజ్‌ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. 
– ఈశ్వరయ్య,కేరూర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement