మద్యం దుకాణాన్ని తొలగించాలి
ఒంగోలు టౌన్ : మహిళల పుస్తెలు తెంచుతున్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ కొత్తపట్నం మండలం గుండమాల, మోటుమాల గ్రామాలకు చెందిన మహిళలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉబ్బా ఆదిలక్ష్మి మాట్లాడుతూ నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణం (షాపునెం 42) ఏర్పాటు చేయడంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీనాలి చేసుకొని జీవిస్తున్న పేదల ఆదాయమంతా మద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించాలని గతంలో రెండు గ్రామాలకు చెందిన మహిళలు ఆందోళనలు చేసినప్పుడు వేలం పిరియడ్ పూర్తికాగానే ఆ దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మళ్లీ ఆ షాపునకు టెండర్లు ఆహ్వానించడం అన్యాయమన్నారు. కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ నివాస ప్రాంతాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించకుంటే ఈనెల 30వ తేదీ జరిగే వేలాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
లీజ్ పిరియడ్ ముగియగానే తొలగిస్తాం : కొత్తపట్నంలోని మద్యం దుకాణం (షాపు నెం 42) లీజ్ పిరియడ్ ముగిసిన వెంటనే దానిని తొలగిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. మహిళలు నిర్వహించిన ధర్నా వద్దకు ఆయన వచ్చి వారితో మాట్లాడారు. లీజ్ పిరియడ్ జూలై 1వ తేదీతో ముగుస్తుందని స్పష్టం చేశారు. ధర్నాలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి. బాలకోటయ్య, సీఐటీయూ నాయకుడు తంబి శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఎస్.స్వామిరెడ్డి, పి.ప్రకాష్ ధర్నా శిబిరాన్ని సందర్శించి మహిళలకు మద్దతు ప్రకటించారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కనిగిరిలో కూడా..: పట్టణంలో నిరుపేదలు ఉండే ప్రాంతం, హాస్టళ్ల మధ్య వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకుడు పీసీ కేశవరావు మాట్లాడుతూ కూలీనాలి చేసుకుని జీవించే వాళ్లు, విద్యార్థులు ఉన్నచోట మద్యం షాపు, గోడౌన్ ఏర్పాటుకు ఏలా అనుమతి ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే పట్టణంలో విచ్చలవిడిగా గొలుసు షాపులు పెరిగాయని, పేదల ఇళ్ల మధ్య షాపులు పెట్టి వారి జీవనాన్ని నాశనం చేయడం తగదన్నారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో మద్యం షాపు పెడితే మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో షాపును ధ్వసం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ సీఐకి అందజేశారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో షాపునకు అనుమతి ఇవ్వమని సీఐ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాము, ఆదెయ్య, రమణయ్య, రహంతుల్లా, వెంకటయ్య పాల్గొన్నారు.