సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్టోబరు నుంచి ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఒక్కో షాపునకు ఆస్తుల కల్పన, నిర్వహణకయ్యే ఖర్చు మొత్తం కలిపి గ్రామీణ ప్రాంతంలో రూ.లక్షన్నర నుంచి రూ.2.50 లక్షల వరకు, పట్టణ/నగర ప్రాంతాల్లో రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో షాపులో ఫ్యాన్లు, టేబుళ్లు, ఫ్రిజ్ (బాటిల్ కూలర్), ర్యాకులు, గ్రిల్స్, స్కానర్, సీసీ కెమెరాలతో పాటు కంప్యూటర్ బిల్లింగ్‌కు ఏర్పాట్లుచేయాలని.. ఇందుకు రూ.లక్షన్నర దాటుతుందని తేల్చారు. అద్దె, సిబ్బంది జీతభత్యాలు కలిపి నెలకు మరో రూ.లక్ష వరకు ఖర్చవుతుందని ఎక్సైజ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే షాపు 150 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని.. రాష్ట్ర, జాతీయ రహదారులకు, గుడి, బడికి దూరంగా ఉండాలని నిర్దేశించారు.
కాంట్రాక్టు పద్ధతిలో సిబ్బంది భర్తీ
కాగా, ఒక్కో మద్యం షాపులో సూపర్‌వైజరు, ఇద్దరు సేల్స్‌మెన్‌లు, ఓ సెక్యూరిటీ గార్డును నియమించనున్నారు. కాంట్రాక్టు పద్ధతిన ఈ పోస్టులకు సిబ్బందిని ఎంపికచేస్తారు. ఈ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలుచేయడంతోపాటు స్థానికులకు 75 శాతం ఉద్యోగాల నిబంధన అమలుచేయనున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల నివేదికను త్వరలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందించనున్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఆగస్టు నుంచి ప్రతి జిల్లాలో పది ప్రభుత్వ మద్యం షాపుల్ని ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది.
జేసీ ఆధ్వర్యంలో కమిటీకి బాధ్యతలు
ప్రభుత్వ మద్యం దుకాణాల్లోకి సిబ్బందిని ఎంపికచేసే బాధ్యతల్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిపో మేనేజరులతో కూడిన కమిటీకి అప్పగించనున్నారు. నోటిఫికేషన్ జారీచేసి సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన ఎంపిక చేస్తారు. అలాగే, మద్యం డిపో నుంచి షాపునకు సరుకు చేరవేసేందుకు సరఫరాదారుల్ని (ట్రాన్స్‌పోర్టర్లు) కూడా టెండర్ల ద్వారా ఈ కమిటీయే ఎంపిక చేస్తుంది. మద్యం డిపో నుంచి షాపునకు సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ బాధ్యతలు మొత్తం సరఫరాదారే చూసుకోవాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుత విధానం ప్రకారం మద్యం షాపులు నిర్వహించే ప్రైవేటు వ్యక్తులు ముందుగానే ఆయా డిపోలకు డీడీలు చెల్లించి సరుకు పొందుతున్నారు. కానీ, కొత్త విధానం ద్వారా ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో షాపులు నిర్వహిస్తున్నందున డిపో నుంచి అప్పు (క్రెడిట్) విధానంలోనే సరుకు తెచ్చి అమ్మకాల తర్వాత డిపోకు డబ్బు చెల్లిస్తారు. అయితే ఏ రోజుకా రోజు బ్యాంకులో డబ్బు జమచేయాలా? లేదా బ్యాంకు సిబ్బంది క్యాష్ పికప్ చేసుకోవాలా? అన్న విధానంపై ఇంకా స్పష్టతలేదు. బ్యాంకు సేవలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలనే అంశంపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్‌వైజర్‌కు నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు, సేల్స్‌మెన్‌లకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారు. అకౌంట్స్ చూడాల్సి ఉన్నందున సూపర్‌వైజర్‌కు డిగ్రీ విద్యార్హతగా, సేల్స్‌మెన్‌కు ఇంటర్/పది విద్యార్హతగా నిర్ణయించారు. లాభాపేక్ష లేకుండా సర్కారు ఈ షాపులను నిర్వహిస్తుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం నుంచి సిబ్బందికి జీతాలు చెల్లిస్తారు.
ప్రభుత్వ ఉద్దేశమిదే..
ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు మద్యం షాపులు దక్కించుకుని మాఫియాగా ఏర్పడి విచ్చలవిడిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా బెల్టు షాపుల్ని ఏర్పాటుచేసి ప్రజల్ని వ్యసనపరులుగా మార్చేస్తున్నారు. బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహిస్తే ఈ తరహా ఉల్లంఘనలు ఏమీ ఉండవు. అలాగే, బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఏర్పడడమేగాక సీఎం హామీ మేరకు దశల వారీగా మద్యపాన నిషేధానికి అవకాశం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment