బెల్టు షాపుల తొలగింపుతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. 2018 – 2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయం జరిగితే.. బెల్టు షాపుల తొలగింపు తర్వాత ఈ ఏడాది జూలై వరకు 12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గింది. అలాగే 4,380 మద్యం దుకాణాలను 3,500కు తగ్గిస్తున్నాం.
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మద్యం స్మగ్లింగ్ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం వల్ల వచ్చే అనర్థాల గురించి పాఠ్య ప్రణాళికల్లోనూ పొందుపరచాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలన్నారు. మద్య నిషేధం అమలుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను వినియోగించు కోవాలన్నారు. దశల వారీ మద్య నిషేధానికి అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని, దీనిపై అధ్యయనం చేసి ఒక విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ఒక మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలన్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా 503 మద్యం దుకాణాలు
వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం 503 మద్యం దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే పని చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా 16 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. దశల వారీగా మద్య నిషేధం, నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం వినియోగం గణనీయంగా తగ్గిపోతోందని, ఇందుకు ప్రధాన కారణం బెల్టు షాపుల తొలగింపేనని పేర్కొన్నారు. 2018 – 2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయం జరిగిందని, బెల్టు షాపుల తొలగింపు తర్వాత ఈ ఏడాది జూలై వరకు 12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గిందన్నారు. ప్రైవేట్ దుకాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నామని, 4,380 మద్యం దుకాణాలను 3,500కు తగ్గిస్తున్నామని చెప్పారు. మొత్తం 20 శాతం దుకాణాలు తగ్గిపోనున్నాయని అధికారులు వివరించారు. మద్య నియంత్రణ, నిషేధానికి, డీ ఎడిక్షన్ కేంద్రాలకు నిధులు రూ.500 కోట్లకు పెంచుతున్నామన్నారు.
జీఎస్టీ, వాహన రంగం ఆదాయంలో తగ్గుదల
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల ఉన్నతాధికారులు శాఖల వారీగా ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని, గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత మేర వృద్ధి లేదన్నారు. స్టీల్ రేట్లు తగ్గడం వల్ల కూడా ఆదాయంపై ప్రభావం చూపుతోందని చెప్పారు. సిమెంట్ ధర తగ్గడం వల్ల, దాని మీద వచ్చే పన్నులు తగ్గుతున్నాయని వివరించారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయం మెరుగు పడుతుందని ఆశాభావంతో ఉన్నామని, జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల మొదటి వారంలో రూ.597 కోట్లు వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment