సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వారంలోగా బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్‌లో మంగళవారం అన్ని జిల్లాల అధికారులతో బెల్టు షాపుల నిర్మూలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల కిందట సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి ఇచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని, బెల్టు షాపులు కనిపించకుండా చేయాలని సీఎం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని, తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పెషల్ సీఎస్ సాంబశివరావు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు విద్యార్థుల్లో, యువతలో చైతన్య కార్యక్రమాలతోపాటు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.
బెల్టు షాపుల నిర్మూలన, మద్యాన్ని దూరం చేసే చైతన్య కార్యక్రమాలు బాగా నిర్వహించిన అధికారులకు రివార్డులు కూడా అందిస్తామన్నారు. గంజాయిపై సాగు దశ నుంచే నిఘా పెట్టి ధ్వంసం చేయాలని సూచించారు. తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే ఏ స్థాయి అధికారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 27 వరకు రాష్ట్రంలో 9,246 బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి 9,355 మందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే 644 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. బెల్టు షాపుల నిర్మూలనకు ప్రతి గ్రామానికి ఒక్కో కానిస్టేబుల్, ప్రతి మండలానికి ఒక్కో ఎస్సైకు బాధ్యతలు అప్పగిస్తామని ఎక్సైజ్ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా చెప్పారు. బెల్టు షాపుల నిర్మూలనపై రోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
వారంలోగా బెల్టు షాపులు నిర్మూలించాలి
Published Wed, Jun 5 2019 4:34 AM | Last Updated on Wed, Jun 5 2019 7:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment