మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
► ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్
►మైనార్టీ గురుకులాల ప్రవేశాల కార్యక్రమానికి హాజరు
► లక్కీడిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక
ఖానాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. ఏఎంకే ఫంక్షన్ హాల్లో బుధవారం మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులంలో విద్యార్థుల ప్రవేశాల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రవేశాల కోసం చేసుకున్న దరఖాస్తులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థుల ఎంపికను లక్కీడిప్ ద్వారా నిర్వహించారు.
అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పిల్లలకు ప్రభుత్వం తెలంగాణలో 71 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని కితాబిచ్చారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానిక గురుకులంలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశానికి 120 మందికి అవకాశం ఉందని తెలిపారు. ప్రవేశం లభించని విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్య పడవద్దని, ప్రభుత్వానికి సమస్యను వివరించి మరిన్ని సీట్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు.
లక్కీడిప్ ద్వారా ఎంపికైన మొదటి నలుగురు విద్యార్థులు ముషిర్, అస్లాం, షాహిద్ ఒజామా, రెహన్ . కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు నేరెళ్ల సత్యనారాయణ, సక్కారాం శ్రీనివాస్, అంకం రాజేందర్, కేహెచ్ ఖాన్, జహీరొద్దీన్, ఎంఈవో రాం చందర్, ప్రిన్సిపల్ బియాబాని తదితరులున్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం..
అనంతరం శిశు సంక్షేమ శాఖ అసెంబ్లీ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యేను ముస్లిం మహిళలు సన్మానించారు. మైనార్టీ పాఠశాల ఏర్పాటుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.