ఖరీఫ్ కాలం తిరగబడింది | paddy cultivation rate has been dropped to 57 percent in current kharif season | Sakshi
Sakshi News home page

ఖరీఫ్ కాలం తిరగబడింది

Published Thu, Oct 1 2015 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

paddy cultivation rate has been dropped to 57 percent in current kharif season

- 57 శాతానికి పడిన వరి సాగు
- ఆహార ధాన్యాల సాగు 69 శాతానికి పరిమితం
- సగానికి పైగా ఎండిన పత్తి
- ఆరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం
- నేటి నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్
 
సాక్షి, హైదరాబాద్:
ఖరీఫ్ సీజన్ బుధవారంతో ముగిసింది. నేటి నుంచి రబీ మొదలుకానుంది. 2015-16 ఖరీఫ్ రైతును అధోగతిపాలు చేసింది. సీజన్ ప్రారంభంలో ఊరించిన వర్షాలు ఆ తరువాత మొఖం చాటేయడంతో రైతులు రెండు విధాలుగా నష్టపోయారు. ఈ ఏడాది జూన్‌లో రుతుపవనాలు సకాలంలో వచ్చి భారీ వర్షాలు కురవడంతో ఆశపడిన అన్నదాతలు పెద్దఎత్తున విత్తనాలు చల్లారు. పత్తి, మొక్కజొన్న, సోయా సహా ఇతర విత్తనాలను సాధారణానికి మించి చల్లారు.

జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురియకపోవడంతో వేసిన పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఎండిపోయాయి. సెప్టెం బర్‌లో వర్షాలు కురిసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పత్తి, సోయా పంటలు సగానికిపైగా ఎండిపోయాయి. ప్రాజెక్టుల్లోకి నీరు చేరకపోవడంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాల్లో నూటికి నూరు శాతం పంటలు చేతికి రాకుండాపోయాయి. రెండు మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ కరువు తాండవిస్తోంది. దీంతో ఈసారి ఆహారధాన్యాల కొరత రాష్ట్రాన్ని వెంటాడే అవకాశాలున్నాయి.

69 శాతానికి పడిపోయిన ఆహారధాన్యాల సాగు
ఈ ఖరీఫ్‌లో 1.03 కోట్ల ఎకరాల్లో సాధారణ పంటల సాగు జరగాల్సి ఉండగా 88.90 లక్షల ఎకరాల్లో (86%) సాగు జరిగింది. అందులో ఆహారధాన్యాలు 51.62 లక్షల ఎకరాలకు గాను... 35.77 లక్షల ఎకరాల్లోనే (69%) సాగయ్యాయి.  ఆహారధాన్యాల సాగులో కీలకమైన వరి సాగు 26.47 లక్షల ఎకరాలకు గాను... 15.17 లక్షల ఎకరాల్లో (57%) మాత్రమే సాగు జరిగింది. కరువు కారణంగా వేసిన పంటలు కూడా దిగుబడి రాకుండా పోయాయి. లక్షలాది ఎకరాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు ఎండిపోయాయి. ఈసారి ఖరీఫ్‌లో ఆహారధాన్యాల దిగుబడి 22 శాతానికే పరిమితమవుతుందని ఆర్థికగణాంకశాఖ అంచనా వేసింది. దీనిని బట్టి ఈసారి రాష్ట్రాన్ని ఆహారధాన్యాల కొరత పీడించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పత్తి 103%, సోయాబీన్ 142% సాగు జరిగినా అవి చేతికి వచ్చే పరిస్థితి అంతంతే.

ఆరు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు
జూన్ నెలలో సాధారణంగా 127  మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 220.3 మిల్లీమీటర్లు (మి.మీ.) కురిసింది. ఏకంగా 73% అదనపు వర్షపాతం ఆ నెలలో నమోదైంది. జూలైలో సాధారణంగా 238 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 80.2 మి.మీ.లే కురిసింది. 66 శాతం లోటు నమోదైంది. ఆగస్టు నెలలో 218.7 మి.మీ.లకు గాను... 151మి.మీలు (-31%), జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 655.8 మి.మీలకు గాను 552  మి.మీ. (-14%) నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగిలిన 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా 459 మండలాలకు గాను... 226 మండలాల్లో వర్షాభావం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement