
అల్గునూర్(మానకొండూర్): సాధికారతతోనే అతివలకు సముచిత గౌరవం దక్కుతుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని రాంలీలా మైదానంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మహిళల ఆత్మగౌరవ సదస్సుకు ఆమె హాజరయ్యారు.
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి ఎదుగుదలకు తల్లిదండ్రులు, సమాజం సహకరించాలని కోరారు.
ఆడపిల్లలపై వివక్ష పోవాలని అన్నారు. మహిళలకు ఇప్పటికీ పురుషులతో సమానంగా హక్కులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.