కల.. నెరవేరే వేళ.. | Palakurthy Reservoir Works Start | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన పాలకుర్తి రిజర్వాయర్‌ పనులు 

Published Tue, Mar 20 2018 8:05 AM | Last Updated on Mon, Aug 27 2018 8:19 PM

Palakurthy Reservoir Works Start - Sakshi

పాలకుర్తి ఊరచెరువు

పాలకుర్తి: సాగునీటి కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాతల కల త్వరలో నెరవేరబోతోంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను ముందుకు కదిలించారు. నిత్యం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో విడతలో భాగంగా 2009 సంవత్సరంలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన పాలకుర్తి ప్రాజెక్టు పనులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయించాలనే లక్ష్యంతో ముందుకుసాగారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని విజప్తి చేశారు.

రిజర్వాయర్‌కు రూ. 11 కోట్లు మంజూరు..
పాలకుర్తి రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సుమారు 700 ఎకరాల భూమిని సేకరించారు. గతంలో 250 ఎకరాలు ఉన్న పాలకుర్తి ఊరచెరువు కొత్తగా సేకరించిన 700 ఎకరాలతో 950 ఎకరాల విస్తీర్ణానికి చేరింది. కాగా, 2009లో శంకుస్థాపన జరిగిన పనులు ఎట్టకేలకు ఈనెల 15న ప్రారంభమయ్యాయి.

0.25 టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు పనులను క్రాంతి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడు నెలల్లో రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి పాలకుర్తి మండలంలోని తీగారం, లక్ష్మీనారాయణపురం, విస్నూరు, వల్మిడి, ముత్తారం, మంచుప్పుల శిరసన్నగూడెం తదితర గ్రామాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement