
పల్లాను పుష్పగుచ్ఛంతో అభినందిస్తున్న మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని శుక్రవారం రైతు సమన్వయ సమితి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆయనను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తాను సమర్ధవంతంగా పనిచేస్తాననే నమ్మకంతో కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు.
రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యమన్నారు. త్వరలో రాష్ట్రంలోని సమన్వయ సభ్యులందరితో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతు సమన్వయ సమితి సభ్యుల విధులు, బాధ్యతలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తామన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా విజయం సాధిస్తారని చెప్పారు.
తెలంగాణ రైతులు అదృష్టవంతులని హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సమితి చైర్మన్‌గా రాజేశ్వర్‌రెడ్డి రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకముందన్నారు. పల్లా బాధ్యతల స్వీకారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు సమస్వయ సభ్యు లు అభినందనలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు పాల్గొన్నారు.