
‘శాతకర్ణి’కి పన్ను మినహాయింపా?
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపు పన్ను చేయడాన్ని వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి తప్పుబట్టారు. ఈ సినిమాకు వినోదపు పన్ను రద్దు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు. ఫక్తు లాభాపేక్షతో తీసిన సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇవ్వడం సరికాదని అన్నారు. పన్ను రద్దు జీవోను ఉపసంహరించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.
ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బుధవారం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారంటూ ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. బాలకృష్ణ బంధువు అయినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వెలుసుబాటు కల్పించారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సెలవుల నేపథ్యంలో రెగ్యులర్ బెంచ్‌కు వెళ్లాలని పిటిషనర్ కు ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నెల 12న విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.