అనంతగిరి కొండల్లో పారాగ్లైడింగ్ ట్రయల్ రన్
సాక్షి, అనంతగిరి: అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం టూరిజం ఎండీకి అందజేస్తామని చెప్పారు. వివరాలు ఇలాఉన్నాయి.. వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్టను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలు అందుకున్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి గత నెల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న సిక్కిం రాష్ట్రానికి చెందిన అడ్వెంచర్ జోన్ ప్రతినిధులు పారాగ్లైడింగ్ ఏర్పాటుపై ట్రయల్ రన్ నిర్వహించారు.
అనంతగిరిలో పారాగ్లైడింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. వీరు ప్రతిరోజు అనంతగిరి చుట్టూ ఉన్న కొండప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి నుంచి విహారం ఎలా ఉంటుందో చూస్తున్నారు. గాలి ఎలా సహకరిస్తుంది..? గ్లైడింగ్‌లో పారాషూట్లు దిగడానికి అనుకూలమైన స్థలాలను అన్వేషిస్తున్నారు. సిక్కిం నుంచి వచ్చిన వీరు ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వీరికి అన్ని వసతులు కల్పించారు. వీరి వెంట వెళ్లి కొండల్లో గ్‌లైడింగ్ కోసం ప్రయత్నాలు చేశారు. కెరెళ్లి– జైదుపల్లి మధ్యలోని పాముల గుట్ట నుంచి నిర్వహించిన ట్రయల్‌రన్‌ను గురువారం ఆయన గుట్ట ఎక్కి స్వయంగా వీక్షించారు. అనంతరం పారాగ్లైడింగ్ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్ అనుకూలంగా ఉన్నాయని వారు ఎమ్మెల్యేకు చెప్పారు. ఈ ప్రాంతం శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కూడా అనుకూలంగా ఉందన్నారు. పారాగ్లైడింగ్‌తో పాటు జీప్‌లైన్, మౌంటేన్ బైకింగ్ తదితర వాటిని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం రాష్ట్ర టూరిజం ఎండీకి అందజేస్తామని స్పష్టంచేశారు. టూరిజం సీనియర్ సిబ్బంది మనోహర్, వికారాబాద్‌కు చెందిన ప్రదీప్ వీరికి సహాయంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ నేతలు ప్రభాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, రాజమల్లయ్య, నవీన్, అనంత్‌రెడ్డి, రాంరెడ్డి, రంగరాజు, గోపి, షఫీ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment