నారాయణపేట: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటం తో ఎవరైనా మామూలుగా చనిపోయినా మృతదేహాలను సొంత ఊర్లకు తీసుకువెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇలాంటి దయనీయ పరిస్థితినే ఎదుర్కొంది. కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో వీడియోకాల్ చూపిస్తూ అంత్యక్రియలు కానివ్వడంతో ఓ తల్లి తల్లడిల్లగా.. బంధువులు బోరుమన్నారు. ధన్వాడకు చెందిన రాములమ్మ, మాకం సాంబశివుడు దంపతులకు ఆరుగురు కుమారులు ఉన్నారు. వారిలో నాలుగో కుమారుడు మహేశ్‌కుమార్ (41) మహారాష్ట్రలోని సోలాపూర్‌లో కూలి పనిచేస్తున్నాడు. భార్య సువర్ణ, కూతుళ్లు దివ్య, శృతి, శ్రావణితో కలసి అక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల మహేశ్‌కు షుగర్, బీపీ పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా నెల రోజుల నుంచి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు మృతి చెందాడు. శనివారం ఉదయం వైద్యులు శవ పరీక్షలు నిర్వహించి కరోనా లేదని నిర్ధారించారు. అయితే తమ తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళతామని అక్కడి పోలీసులను పిల్లలు వేడుకున్నా ఫలితం దక్కలేదు. ఈ విషయాన్ని ధన్వాడలో ఉంటున్న మహేశ్ తల్లి రాములమ్మ, అన్నదమ్ములకు తెలియజేశారు. అక్కడికి వెళ్లేందుకు అధికారులు అనుమతించకపోవడంతో సోలాపూర్ నుంచే వాట్సాప్‌లో వీడియోకాల్ చూపిస్తూ అంత్యక్రియలు కానిచ్చారు. చివరి చూపునకు నోచుకోకలేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment