మెదక్: నిజాం నవాబుల ఖిల్లాగా.. కాకతీయుల దుర్గంగా.. చారిత్రక రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచిన మెతుకుసీమ.. వర్తమాన కాలంలో తన రాజసాన్ని కోల్పోతోంది. మెదక్ పేరును తనలో ఇముడ్చుకుని.. జిల్లా కేంద్రాన్ని కోల్పోయిన పట్టణానికి.. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే నయవంచనే మిగిలిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను త ప్పుతూ పాలకులు తీసుకున్న నిర్ణయంతో మెదక్ ప్రజలు భగ్గుమన్నారు. కాగా సుమారు ఆరు దశాబ్దాల పోరాటం.. లక్షలాది జనాల ఆరాటంగానే మిగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాకు నడిబొడ్డున ఉంది మెదక్ పట్టణం. మంజీరా నది ఒడ్డున..ప్రపంచ ప్రసిద్ధి పొందిన కరణామయుని కోవెలకు నిలయంగా.. శత్రుదుర్భేద్యమైన ఖిల్లాకు నిదర్శనంగా.. సుమారు 70 వేల జనాభాతో విరాజిల్లుతోంది పట్టణం. నిజాంకాలంలో నాలుగు జిల్లాలకు సుభాగా ఉండేది. ప్రస్తుతం మెదక్ పేరుతో జిల్లా ఉన్నప్పటికీ సంగారెడ్డి కేంద్రం గా పాలన కొనసాగుతోంది. కేవలం పాలకుల సౌకర్యం కోసమే ఈ మార్పు జరిగిందన్న ఆరోపణలున్నాయి. సుమారు ఆరు దశాబ్దాలుగా జిల్లా కేంద్రం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. అప్పట్లో సామాజిక ఉద్యమకారుడు రాందాస్ మెదక్ జిల్లా కేంద్రం కోసం 40 రోజుల ఆమరణ దీక్ష చేశారు. మెదక్ జిల్లా కేంద్ర సాధన సమితి, రిటైర్డు ఉద్యోగులు, యువకులు, న్యాయవాదులు ఉద్యమానికి ఊపిరి పోస్తూనే ఉన్నారు.
జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం..
గత ఏప్రిల్ 24 న మెదక్ పట్టణానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూటికి నూరు పాళ్లు మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నవ తెలంగాణలో తమకు భవిష్యత్తు ఉందని పట్టణ ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ మేరకు గతంలో కూడా మెదక్ కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి తదితర ప్రాంతాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి.
సిద్దిపేటలోకి రామాయంపేట, చిన్నశంకరంపేట!
కాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రస్తుతమున్న 10 జిల్లాలకు తోడు మరో 7 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సీఎం కేసీఆర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ఆదేశించారు. ఇందులో మెదక్ జిల్లా నుంచి సిద్దిపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు కోసం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా మెదక్ సమీపంలో ఉన్న రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలను సైతం సిద్దిపేట జిల్లాలోకే వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భగ్గుమన్న మెదక్
ఎన్నోయేళ్లుగా తాము కన్న కలలను కల్లలు చేస్తూ సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై శుక్రవారం సర్వత్రా నిరసనలు పెల్లుబికాయి. ఈ క్రమంలో మెదక్ పట్టణ బంద్‌తోపాటు నిరసన ర్యాలీలు, న్యాయవాదుల విధుల బహిష్కరణ, చిన్నశంకరంపేటలో నల్లగుడ్డలు కట్టుకుని నిరసనలు తెలిపారు. మెదక్‌ను ప్రత్యేక జిల్లాగా, లేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుంటే నిరవధిక ఆందోళనలు చేపడతామని జిల్లా కేంద్ర సాధన సమితి హెచ్చరించింది.
నవ తెలంగాణలోనూ.. నయవంచనేనా!
Published Sat, Sep 13 2014 1:15 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement