
సోమవారం నాగార్జున సాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- టీఆర్‌ఎస్ చివరిరోజు శిక్షణలో సీఎం కేసీఆర్
- వచ్చిన అవకాశాన్ని గొప్పగా వినియోగించుకోవాలి
- పదవులు రావడం తేలికే, నిలబెట్టుకోవడమే ముఖ్యం
- డబ్బు సంపాదించాలనుకుంటే పెండ వ్యాపారమైనా చేయొచ్చు
- మళ్లీ మనదే అధికారం.. చరిత్రాత్మక పాత్ర పోషించండి
- పార్టీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి హితబోధ
- నాగార్జునసాగర్‌లో ముగిసిన కార్యక్రమం
నల్లగొండ: ‘చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ వచ్చిన తర్వాత తొలితరం ప్రజా ప్రతినిధులెవరంటే మన పేర్లు చెప్పుకుంటరు. మనం గొప్పవాళ్లం.. ధన్యులం. చరిత్రలో ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మన పేర్లుం టయ్. అసలు తెలంగాణే రాదనుకున్నరు.. మొదట్లో అంత అపనమ్మకం ఉండె. ఎక్కడి నుంచి ఎట్టెట్ట పోయినమో.. ఆచరణలో తెలంగాణ సాధించుకున్నం. ఇప్పుడు తెలంగాణ తనను తాను చూసుకుంటున్నది. తన ఆత్మను ఆవిష్కరించుకుంటున్నది. మనకు వచ్చిన అవకాశాన్ని గొప్పగా వినియోగించుకోవాలి. చరిత్రాత్మక పాత్ర పోషించాలి’ అని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించారు. మూడు రోజులుగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు సోమవారం పార్టీ శ్రేణులకు కేసీఆర్ కర్తవ్య బోధ చేశారు. ప్రజాప్రతినిధి అంటే సమాజంలో గౌరవం పెరిగేలా పనిచేయాలని, ఇష్టపడి పనిచేయాలనే తపన ఉండాలని పేర్కొన్నారు.
ఆగమాగమైన తెలంగాణలో ఇప్పుడు అధికారం తెలంగాణ వారి చేతుల్లోనే ఉన్నందున అన్నీ సాధించుకుంటున్నామన్నారు. కృష్ణా నీళ్లు, కరెంటు తెచ్చుకున్నామన్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రెండు పంటలు పండించి చాలా కాలమైందని, ఈ ఏడాది నీళ్లు తెచ్చుకుని రబీలో 3 లక్షల ఎకరాల్లో వరి పండించామని సీఎం చెప్పారు. కరెంటు లేక ఒక్క గుంట పొలం కూడా ఎండిపోలేదన్నారు. ఏ ముఖ్యమంత్రి వెళ్లని దేవాలయాలకు తాను వెళ్లానని, కొమరవెల్లి దేవస్థానానికి వెళ్లిన మొదటి ముఖ్యమంత్రిని తానేనని కేసీఆర్ తెలిపారు. గతంలో పరిపాలించిన వారికి కాళోజీ పేరిట క ళాక్షేత్రం ఏర్పాటు చేయాలని కానీ, దాశరథి పేరిట అవార్డు ఇవ్వాలనే ఆలోచన రాలేదని ఆయన ఎద్దేవా చేశారు.
రాజకీయాల్లోకి రావాలనుకోలేదు
తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని, అనుకోకుండా వచ్చానని కేసీఆర్ చెప్పారు. పదవులను చేరుకోవడం తేలికేనని, వాటిని నిలబెట్టుకోవడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఉన్న జీవితంలో ఎంత గొప్పగా పనిచేశామన్నదే ముఖ్యమని, డబ్బు సంపాదించుకోవడమే పరమావధి అనుకుంటే పెండ వ్యాపారం చేసినా బోలెడు డబ్బులొస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు తమ స్థాయిని దిగజార్చుకోవద్దని, ప్రజా సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని హితవు పలికారు. ‘వచ్చేసారీ మనమే గెలుస్తం. ఒక పార్టీ, ఒక నాయకుడు గెలిచిన తర్వాత మళ్లీ ఓడిపోకూడదనుకుంటే ఎవరూ ఓడించలేరు. గెలవాలనే తపన ఉంటేనే పని దృక్పథం వస్తుంది. ఆ సోయి ఉన్నప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేస్తం. మనకు శక్తి ఉంటే మళ్లీ అధికారాన్ని తెచ్చుకోగలుగుతం. శక్తి లేకుంటే మనం పోతం. చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చి పోయినయ్.. మనం కూడా పోయినమనుకుంటరు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందరి ఆమోదంతో ఆరు నెలలకోసారి ఇలాంటి తరగతులు ఏర్పాటు చేసుకుందామని కేసీఆర్ చెప్పినప్పుడు సభ్యులంతా కరతాళధ్వనులతో ఆమోదం తెలిపారు.
ప్రాజెక్టులను రీ-ఇంజనీరింగ్ చేస్తాం
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులను రీఇంజినీరింగ్ చేయాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. శిక్షణ తరగతుల చివరి సెషన్‌లో ఆయన పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలను ఉద్దేశించి మాట్లాడారు. వివాదాలు, పెద్దగా ముంపు లేకుండా నీటిని నదుల నుంచి తరలించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టులకు రీఇంజనీరింగ్ చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ర్ట వాటా మేరకు నీటిని వాడుకునేందుకు అవసరమైన ప్రాజెక్టులను నిర్మించాలన్నారు. ప్రాజెక్టులు, నీటి లభ్యత, ఎత్తిపోతలు, గ్రావిటీ ద్వారా నీటి తరలింపు తదితర అంశాలను ఆయన గూగుల్ మ్యాప్ ద్వారా పార్టీ నేతలకు వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జులు కూడా కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల ఇన్‌చార్జులను మంత్రులు కడుపులో పెట్టుకుని చూసుకోవాలన్నారు. అంతకుముందు బుద్ధపూర్ణిమ సందర్భంగా సాగర్‌లోని బుద్ధవనానికి వెళ్లిన కేసీఆర్ అక్కడి బుద్ధుడి విగ్రహానికి నివాళులర్పించారు. బుద్ధవనం ఆవరణలో ఓ మొక్క నాటారు. అనంతరం మంత్రులు జగదీష్‌రెడ్డి, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావుతో కలిసి నక్కలగండి, ఎస్సెల్బీసీ ప్రాజెక్టులను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఉత్తమ అసెంబ్లీయన్ అవార్డు...
మూడోరోజు శిక్షణలో భాగంగా టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులకు పారిశ్రామిక రంగంపై ఆస్కి మాజీ సలహాదారు జి.సురేందర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు-ప్రజా సంబంధాలు అనే అంశంపై ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలోనే ఉత్తమ అసెంబ్లీయన్ అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. నీళ్లలో చేపల్లాగా.. ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసిపోవాలన్న లె నిన్ వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ప్రజాప్రతినిధికి చెవులు పెద్దవిగా ఉండాలని, నాలుక చిన్నదిగా ఉండాలన్నారు. రాజకీయమంటే ప్రజాసమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే ప్రక్రియ అని, దాన్ని విరుద్ధ అర్థంలో వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సాయంత్రానికి శిక్షణ కార్యక్రమం పూర్తికావడంతో కేసీఆర్‌తో పాటు ప్రజాప్రతినిధులంతా సాగర్ నుంచి వెళ్లిపోయారు.
జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు
హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం టీఎస్‌ఐఐసీకి 2.50 లక్షల ఎకరాల భూమిని ఇచ్చామని ఐటీ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. టీఆర్‌ఎస్ శిక్షణలో భాగంగా పారిశ్రామిక రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశమై ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించే విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో హైద రాబాద్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లో, మిగిలిన వాటికి 30 రోజుల్లో అనుమతులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. టీఎస్ ప్రైడ్ ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.200 కోట్లను కేటాయించామని, వారి మార్జిన్ మనీని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి చెప్పారు.
ప్రపంచస్థాయి బౌద్ధక్షేత్రంగా శ్రీపర్వతారామం
నాగార్జునసాగర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతి బౌద్ధుడు ఒక్కసారైనా సాగర్ వచ్చి వెళ్లాలనుకునే విధంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు. యాదగిరిగుట్ట తరహాలోనే స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి శ్రీపర్వతారామం ప్రాజెక్టును అన్ని విధాలుగా అభివృద్ధిపరిచి ప్రపంచస్థాయి బౌద్ధక్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 274 ఎకరాల విస్తీర్ణంలోని బుద్ధవనంలో వివిధ దేశాల బౌద్ధస్థూపాల నమూనాలు, ధ్యానకేంద్రం నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు కృష్ణా నది తీరం వరకు మరికొంత స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. సాగర్ అభివృద్ధి విషయమై త్వరలోనే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.