నిమ్స్ ఓపీలో రద్దీ (ఫైల్)
ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో అవుట్ పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్లు లేకపోవడంతో ఒక్కో రోగి సుమారు గంటన్నర పాటు క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఎక్కువ సేపు క్యూలో ఉండి నీరసించిపోతున్నారు. నిమ్స్‌కు రోజుకు సగటున 1500 మంది రోగులు వస్తుంటారు. ఇన్ పేషెంట్ వార్డుల్లో నిత్యం 1300 మంది చికిత్స పొందుతుంటారు. ప్రస్తుతం ఆస్పత్రి పాతబిల్డింగ్‌లో ఆరు, మిలీనియం బ్లాక్‌లో మూడు, సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఆరు కౌంటర్లు ఉన్నాయి. రోగికి ఓపీకార్డు జారీ చేయాలంటే ముందు ఆ రోగికి సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటర్‌లోపొందుపర్చాల్సి ఉంటుంది. ఒక్కో కార్డు జారీకి కనీసం పదిహేను నిమిషాల సమయం పడుతోంది.దీంతో ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వస్తోంది. కౌంటర్లు పెంచితేనే సమస్య పరిష్కారమవుతుంది.
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో అవుట్ పేషంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్లు లేకపోవడంతో ఒక్కోరోగి సుమారు గంటన్నర పాటు క్యూలో నిరీక్షించాల్సి వస్తుంది. నిజానికి నగదు చెల్లింపు రోగులకు, రీయింబర్స్‌మెంట్(ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్, ఆర్టీసీ, ఈఎస్‌ఐ సహా ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రోగులు)రోగులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అందరికీ ఒకే కౌంటర్ ద్వారా ఓపీ, ఐపీ, మెడికల్ టెస్టుకు సంబంధించిన కార్డులు, బిల్లులు జారీ చేస్తున్నారు. నగదు చెల్లింపు రోగుల్లో చాలా మందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత ఉన్నా..కేవలం నిమ్స్ వైద్యులపై ఉన్న నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు.
ఇలాంటి రోగులకు ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ యాజమాన్యం ఆరోగ్యశ్రీ రోగులతో సమానంగా నగదు చెల్లింపు రోగులను పరిగణిస్తుంది. ఆస్పత్రికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వీరిని గంటల తరబడి క్యూలైన్‌లో నిలబెడుతుండటం వల్ల అయిష్టంగానే నిమ్స్‌ను వీడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. రోగులకు సత్వర సేవలు అందాలన్నా..నిమ్స్ ఖజానా గలగలలాడాలన్నా..నగదు చెల్లింపు రోగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ యాజమాన్యం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అంతేకాదు రోగుల, పడకల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న సెమిస్కిల్డ్ వర్కర్లు విపరీతమైన పనిభారాన్ని మోయాల్సి వస్తోంది.
కొనుగోళ్లలో లోపించిన పారదర్శకత...
స్వయం ప్రతిపత్తి కలిగిన నిమ్స్ ఆస్పత్రికి ప్రభుత్వం ఏటా తన వాటాగా సుమారు రూ.200 కోట్ల వరకు మంజూరు చేస్తుంది. ఏ విభాగంలో ఎవరెవరూ పని చేస్తున్నారు. ఎన్ని పడకలు ఉన్నాయి. ఎంత మంది చికిత్స పొందుతున్నారు. ఎంత మంది డిశ్చార్జ్ అయ్యాయి. వైద్య సేవల ద్వారా ఆస్పత్రికి ఎంత ఆదాయం వచ్చింది. మందులు, సర్జికల్ కిట్స్, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాల కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారు? వగైరా వివరాల నమోదుకు పటిష్టమైన వ్యవస్థ లేక పోవడంతో రోగుల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. అంతే కాదు అవినీతి ఆరోపణల వల్ల ఒక్కోసారి నిజాయితీతో పని చేస్తున్న వైద్యులు సైతం మనస్తాపానికి గురికావాల్సి వస్తోంది. ఆస్పత్రి అభివృద్ధికి అవరోధంగా మారిన ఈ ఆరోపణలకు ‘హాస్పిటల్ ఇన్పర్మేషన్ సిష్టమ్’ ద్వారా చెక్ పెట్టవచ్చని భావించారు. ఆ మేరకు సి–డాక్ సహకారంతో రూ.17 కోట్లు ఖర్చు చేసి ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు, సిబ్బంది లేక పోవడంతో ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లకే పరిమితయమ్యారు. వైద్యపరికరాలు, మందుల కొనుగోలు, స్టోర్ రూమ్‌లో రోజూ వారీ నిల్వలను మాత్రం ఇప్పటికీ నమోదు చేయకపోవడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment