out patients
-
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4.83 కోట్ల ఓపీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022 తెలిపింది. 2021లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ 4.23 కోట్లుగా నమోదవగా 2022లో అది 4.83 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అలాగే 2021లో ఇన్–పేషెంట్ (ఐపీ) సేవలు 14.16 లక్షలుగా ఉండగా 2022లో అవి 16.97 లక్షలకు పెరిగాయని పేర్కొంది. 2021లో 2.57 లక్షలు జరగ్గా 2022 నాటికి సర్జరీల సంఖ్య 3.04 లక్షలకు పెరిగిందని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు... ►2022లో ఒకేసారి 8 వైద్య కాలేజీల ప్రారంభం. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభించే పనులు. గతేడాది అదనంగా 200 పీజీ సీట్లు. ►ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలో మొదటి స్థానం... లక్ష జనాభాకు ఏడు పీజీ మెడికల్ సీట్లతో దేశంలో రెండో స్థానం. ►మాతృత్వ మరణాల రేటు 56 నుంచి 43కు (జాతీయ సగటు 97) తగ్గుదల. ►శిశుమరణాల రేటు జాతీయ స్థాయిలో 28 ఉండగా రాష్ట్రంలో 21. ►సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 8,200 పడకలు అందుబాటులోకి తెచ్చేలా పనులు ప్రారంభం. ►గతేడాది 515 డయాలసిస్ పరికరాలతో 61 కొత్త డయాలసిస్ కేంద్రాలు మంజూరు. గతేడాది 50 లక్షలు దాటిన డయాలసిస్ సెషన్స్ సంఖ్య. ►కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ మొదటి దశలో భాగంగా 9 జిల్లాల్లో పంపిణీ ప్రారంభం. ►కంటివెలుగు రెండో దశ ప్రారంభం. ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 శాతంగా ఉన్న ప్రసవాల రేటు ఇప్పుడు 61 శాతానికి పెరుగుదల. ►గతేడాది జరిగిన 5.40 లక్షల ప్రసవాల్లో 61 శాతం అంటే 3.27 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహణ. ►ఇన్ఫెక్షన్ల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు. ►రోగాలను ముందే గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహణ. బీపీ, షుగర్ రోగులకు కిట్లు అందజేత. ►కరోనా బూస్టర్ డోసు పంపిణీ 47 శాతం (జాతీయ సగటు 23 శాతం) పూర్తి. ►ఇప్పటివరకు 11 వేల కొత్త పడకలు అందుబాటులోకి వచ్చాయి. 27,500 పడకలకు ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాటు. ►డైట్ చార్జీలు రూ. 40 నుంచి రూ. 80కి పెంపు. ►రోగి సహాయకుల కోసం 18 పెద్దాసుపత్రుల్లో రూ. 5కే భోజన పథకం ప్రారంభం. -
Gandhi Hospital: ఓపీకి వస్తే బీపీ తప్పదు
సాక్షి, హైదరాబాద్: గాంధీఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి రోగులు పోటెత్తారు. నగర నలుమూలలతోపాటు పలు జిల్లాలకు చెందిన బాధితులు వైద్యసేవల కోసం సోమవారం పెద్దసంఖ్యలో తరలిరావడంతో కంప్యూటర్ చిట్టీలు మొదలుకొని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు, రక్తపరీక్షలు, చివరకు మందుల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఓపికి వస్తే బీపీ తప్పలేదని, ఉన్న రోగం వదిలించుకునేందుకు వస్తే కొత్తరోగాలు అంటుకుంటున్నాయని పలువురు బాధితులు వాపోతున్నారు. ఓపీ చిట్టీ కౌంటర్ల సంఖ్య పెంచాలనే నిర్ణయం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈవినింగ్ ఓపీ సేవలు ప్రారంభమైనప్పటికీ ఉదయం పూట వచ్చేందుకే రోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మార్నింగ్ ఓపీకి రద్దీ పెరిగిందని ఆస్పత్రి అధికారి వ్యాఖ్యానించారు. గాంధీ ఓపీ విభాగంలో సోమవారం సుమారు మూడున్నర వేల మందికి వైద్యసేవలు అందించారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు, వసతి సౌకర్యాలు కల్పించి మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. చదవండి: నగరాన్ని ముంచెత్తిన జోరు వాన.. వరద నీటిలో చిన్నారుల ఈత -
కరోనా తర్వాతా రోగులకు కొన్ని దుష్ప్రభావాలు..అందుకోసం ప్రత్యేక ఓపీ!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 తీవ్రత నుంచి బయటపడి రకరకాల దుష్ప్రభావాలకు గురవుతున్న వారిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వారికి బోధన, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసి వైద్యమందించాలని నిర్ణయించింది. కోలుకున్నవారికి బ్లాక్, ఎల్లో ఫంగస్ల ప్రమాదం పొంచి ఉండగా, మరోవైపు ఇతర దుష్ప్రభావాలు కూడా వెలుగు చూస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. ముఖ్యంగా మధుమేహం, ఊపిరితిత్తులు, నరాలు, గుండె సంబంధిత సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత తదితర సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సైతం ఈ లక్షణాలను గుర్తించి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా, కోలుకున్నవారిలో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంపై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక ఔట్‌పేషంట్ విభాగాలు... కోవిడ్ తర్వాత ఇతర ఇబ్బందులతో వచ్చేవారి కోసం బోధనాసుపత్రుల్లో దాదాపు ఆర్నెళ్ల వరకు ప్రత్యేక ఓపీ విభాగాలను వైద్య విద్యా శాఖ నిర్వహించనుంది. కోలుకున్న నెల తర్వాత ఈ దుష్ప్రభావాలు బయటపడుతున్నట్లు నిపుణులు గుర్తించిన నేపథ్యంలో ఎక్కువకాలం వీటిని నిర్వహిస్తే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని వైద్యశాఖ భావిస్తోంది. ఓపీ రోగులకు ఉచితంగా మాత్రల పంపిణీ చేయనున్నారు. దీర్ఘకాలిక సమస్యలతోపాటు పోస్టుకోవిడ్ దుష్ప్రభావాలకు గురైనవారికి పూర్తిచికిత్సను బోధనాసుపత్రుల్లోనే అందించనున్నారు. ముందస్తుగా ఈ దుష్ప్రభావాలను గుర్తిస్తే వేగంగా నయం చేసే అవకాశం ఉంటుందని, ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ ఓపీ యూనిట్లను తెరుస్తామని వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. అలాంటివారంతా అప్రమత్తం కొందరికి మాత్రమే పోస్ట్ కోవిడ్ దుష్ప్రభావాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నవారికి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇలాంటివారు తిరిగి సాధారణస్థితికి చేరుకునేందుకు మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. స్టెరాయిడ్స్ తీసుకున్నవారికి మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులుండి కోవిడ్ చికిత్స తీసుకున్నవారు జాగ్రత్తగా ఉండకపోతే హార్మోన్ల అసమతుల్యత తలెత్తే ప్రమాదముంది. ఎక్కువ రోజులు ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్‌పై ఉండి కోలుకున్నవారిలో కూడా సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తన్నారు. అలాంటి వారికి రెగ్యులర్ చెకప్ చేయిస్తే ప్రమాదం తప్పుతుందని వైద్యులు అంటున్నారు. -
రూ.10కే అత్యాధునిక వైద్యం
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ ఎయిమ్స్‌లో గురువారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయని, రూ.10కే అత్యాధునిక వైద్యం అందజేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. దేశంలోని టాప్–10 ఎయిమ్స్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ.. 2024 నాటికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రజలకు ఇక్కడ వైద్యం అందనుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఎయిమ్స్ కోసం సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందన్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, గైనిక్, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్ సేవలు అందించనున్నట్లు వివరించారు. ఇందుకోసం డాక్టర్ల నియామకం, వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ చివరి వారంలో 100 పడకల ఇన్‌పేషెంట్ విభాగాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో 40 పడకలకే పరిమితం చేస్తున్నామని, ఇందులో పాజిటివ్ కేసుల కోసం 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన సేవల కోసం రాజీపడం మెరుగైన సేవల కోసం ఎక్కడా రాజీపడేది లేదని వికాస్ భాటియా స్పష్టం చేశారు. తెలంగాణ ఎయిమ్స్‌లో పనిచేయడానికి దేశంలోని ప్రముఖ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున పోటీ పడుతున్నారని తెలిపారు. 483 మంది ప్రొఫెసర్ల ఉద్యోగాల కోసం 2 వేల మంది దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22 మంది డాక్టర్ల నియామకం పూర్తయిందని, మరికొంత మంది డాక్టర్ల నియామకం త్వరలో పూర్తవుతుందని ఆయన వివరించారు. 2024 నాటికి 750 పడకలతో పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ అప్రూవ్ అయ్యింది ఎయిమ్స్ ప్రధాన భవన సముదాయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయ్యిందని భాటియా తెలిపారు. 201 ఎకరాల్లో విశాలమైన పార్కులు, క్రీడా మైదానాలు, ఆస్పత్రి భవనాలు, విద్యార్థుల వసతి గృహాల 28 అంతస్తుల 3 టవర్లు బాలురు, బాలికలు, స్టాఫ్ కోసం వేర్వేరుగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్స్, గార్డెనింగ్, గెస్ట్‌హౌజ్, మెడికల్ కళాశాల, ఆయుష్ బిల్డింగ్, ఆడిటోరియం వెనక స్టాఫ్ రెసిడెన్షియల్ భవనాలు, పార్కులు ఇలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. నిమ్స్ భవన సముదాయాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అధికారికంగా అప్పగించలేదన్నారు. ఎయిమ్స్‌కు అనుబంధంగా 40 నుంచి 60 కిలో మీటర్ల లోపు రూరల్ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. -
ఓపీ..బీపీ!
ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో అవుట్ పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్లు లేకపోవడంతో ఒక్కో రోగి సుమారు గంటన్నర పాటు క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఎక్కువ సేపు క్యూలో ఉండి నీరసించిపోతున్నారు. నిమ్స్‌కు రోజుకు సగటున 1500 మంది రోగులు వస్తుంటారు. ఇన్ పేషెంట్ వార్డుల్లో నిత్యం 1300 మంది చికిత్స పొందుతుంటారు. ప్రస్తుతం ఆస్పత్రి పాతబిల్డింగ్‌లో ఆరు, మిలీనియం బ్లాక్‌లో మూడు, సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఆరు కౌంటర్లు ఉన్నాయి. రోగికి ఓపీకార్డు జారీ చేయాలంటే ముందు ఆ రోగికి సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటర్లోపొందుపర్చాల్సి ఉంటుంది. ఒక్కో కార్డు జారీకి కనీసం పదిహేను నిమిషాల సమయం పడుతోంది.దీంతో ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వస్తోంది. కౌంటర్లు పెంచితేనే సమస్య పరిష్కారమవుతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో అవుట్ పేషంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్ కౌంటర్లు లేకపోవడంతో ఒక్కోరోగి సుమారు గంటన్నర పాటు క్యూలో నిరీక్షించాల్సి వస్తుంది. నిజానికి నగదు చెల్లింపు రోగులకు, రీయింబర్స్మెంట్(ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఆర్టీసీ, ఈఎస్ఐ సహా ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రోగులు)రోగులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అందరికీ ఒకే కౌంటర్ ద్వారా ఓపీ, ఐపీ, మెడికల్ టెస్టుకు సంబంధించిన కార్డులు, బిల్లులు జారీ చేస్తున్నారు. నగదు చెల్లింపు రోగుల్లో చాలా మందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత ఉన్నా..కేవలం నిమ్స్ వైద్యులపై ఉన్న నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి రోగులకు ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ యాజమాన్యం ఆరోగ్యశ్రీ రోగులతో సమానంగా నగదు చెల్లింపు రోగులను పరిగణిస్తుంది. ఆస్పత్రికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వీరిని గంటల తరబడి క్యూలైన్లో నిలబెడుతుండటం వల్ల అయిష్టంగానే నిమ్స్‌ను వీడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. రోగులకు సత్వర సేవలు అందాలన్నా..నిమ్స్ ఖజానా గలగలలాడాలన్నా..నగదు చెల్లింపు రోగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ యాజమాన్యం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అంతేకాదు రోగుల, పడకల నిష్పత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న సెమిస్కిల్డ్ వర్కర్లు విపరీతమైన పనిభారాన్ని మోయాల్సి వస్తోంది. కొనుగోళ్లలో లోపించిన పారదర్శకత... స్వయం ప్రతిపత్తి కలిగిన నిమ్స్ ఆస్పత్రికి ప్రభుత్వం ఏటా తన వాటాగా సుమారు రూ.200 కోట్ల వరకు మంజూరు చేస్తుంది. ఏ విభాగంలో ఎవరెవరూ పని చేస్తున్నారు. ఎన్ని పడకలు ఉన్నాయి. ఎంత మంది చికిత్స పొందుతున్నారు. ఎంత మంది డిశ్చార్జ్ అయ్యాయి. వైద్య సేవల ద్వారా ఆస్పత్రికి ఎంత ఆదాయం వచ్చింది. మందులు, సర్జికల్ కిట్స్, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాల కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారు? వగైరా వివరాల నమోదుకు పటిష్టమైన వ్యవస్థ లేక పోవడంతో రోగుల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. అంతే కాదు అవినీతి ఆరోపణల వల్ల ఒక్కోసారి నిజాయితీతో పని చేస్తున్న వైద్యులు సైతం మనస్తాపానికి గురికావాల్సి వస్తోంది. ఆస్పత్రి అభివృద్ధికి అవరోధంగా మారిన ఈ ఆరోపణలకు ‘హాస్పిటల్ ఇన్పర్మేషన్ సిష్టమ్’ ద్వారా చెక్ పెట్టవచ్చని భావించారు. ఆ మేరకు సి–డాక్ సహకారంతో రూ.17 కోట్లు ఖర్చు చేసి ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు, సిబ్బంది లేక పోవడంతో ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లకే పరిమితయమ్యారు. వైద్యపరికరాలు, మందుల కొనుగోలు, స్టోర్ రూమ్‌లో రోజూ వారీ నిల్వలను మాత్రం ఇప్పటికీ నమోదు చేయకపోవడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆ హాస్పటల్లో రోగి తన మతం చెప్పాల్సిందే...
జైపూర్ : సాధారణంగా ఆస్పత్రికి వచ్చిన రోగిని (ఓపీ) పేరు, వయసు, ఏం వ్యాధి అడుగుతుంటారు. కానీ ఈ హాస్పటల్ తీరే వేరు. ఇక్కడికి వైద్యం కోసం వచ్చే వారి మతం ఏంటో పక్కాగా చెప్పాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. స్థానిక సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రికిలో ఎదురైన ఈ ఘటనతో రోగులు షాక్‌కు గురయ్యారు. తాజాగా ఈ ఆస్పత్రి ప్రవేశపెట్టిన మొబైల్ సేవలలో సంక్షిప్త సందేశం ద్వారా ఓపీ తీసుకోవచ్చు. కానీ ఇందులో తప్పనిసరిగా మతం నమోదు చేయాలని సూచించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైద్యులను సంప్రదించగా కొంత మందికి వారి మతంను బట్టి రోగాలు సంక్రమిస్తాయని అందుకే ఈ విధంగా అడుగుతున్నామని తెలిపారు. వారి మతం తెలిస్తే వారికి వచ్చిన రోగాలకు సులువుగా వైద్యం చేయచ్చనే ఉద్దేశంతోనే ఇలా అడుగుతున్నామే తప్పా ఎలాంటి దురుద్ధేశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో రాజస్థాన్ ప్రభుత్వమే తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నా తప్పేంటి?
అమ్మ... కడుపు చించుకుంటే పుట్టాన్నేను! అమ్మకు... కడుపుకోత మిగిల్చి వెళ్లాన్నేను! అమ్మకింత పెద్ద శిక్షేంటి? నాన్నకింత తీరని శోకమేంటి? చెత్తకుండీలో పడేసినా బతికి ఉండేవాడినేమో! ఐసీయూలో పెట్టి చంపేశారు!! అమ్మ ఇచ్చే స్తన్యం అమ్మ చేయించే స్నానం అమ్మ పొత్తిళ్లు అమ్మ లాలిపాట... ఏవీ నాకు దక్కకుండానే ఐసీయూ నన్ను కొరికేసింది! నాన్న పెట్టే ముద్దులు నాన్న పట్టే రథాలు నాన్న పుణికే బుగ్గలు నాన్న పడే సంబరాలు... ఏవీ నాకు లేకుండానే ఐసీయూ నన్ను కాటికి పంపింది! గర్భంలా కాపాడుతుందనుకుంటే... ఐసీయూ నాకు ఆగర్భశత్రువైంది! ఇలా పుట్టాను. అలా చనిపోయాను. నాదొకటే ప్రశ్న! నేను చేసిన తప్పేంటి? మా అమ్మానాన్నలు చేసిన పాపమేంటి? నాదే ఇంకొక ప్రశ్న! నన్ను చంపింది ఆకలిగొన్న ఎలుకలా? అలక్ష్యాల పందికొక్కులా? బ్రహ్మ కడిగిన పాదమూ...! బ్రహ్మ సృష్టికర్త అతని సృష్టే ఈ చిన్నారి పాదాలు కడుపులో తన్నినప్పుడు తల్లి పులకిస్తుంది. గుండెల మీద తన్నినప్పుడు తండ్రి పరవశిస్తాడు. బుడిబుడి అడుగులు వేసినప్పుడు కృష్ణపాదాలను తలచుకుంటాం. ముద్దాడాల్సిన ఈ పాదాలు రక్తపు ముద్దలుగా మారాయి. మనకు రక్తం ఉడకదా? ప్రతి తల్లికీ... నెత్తుటి కన్నీరు కారదా? మురికిని పెంచారు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 1170 పడకలు ఉన్నాయి. వీళ్లకు కనీసం వేయి మంది అటెండర్స్ ఉంటారు. వీళ్లు గాక రోజూ 2500 మంది ఔట్ పేషెంట్స్ వస్తుంటారు. వీరందరూ తెచ్చే ఆహార పదార్థాలు వాటి వ్యర్థాలు రోజూ గుట్టలుగా పోగవుతుంటాయి. దీని కోసం 300 మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేయాలి. కానీ సగం మంది కూడా పని చేయడం లేదు. అందువల్ల ఎలుకలు పెరిగాయి. అవి వేల సంఖ్యలో ఉన్నాయి. వైద్యులు తక్కువయ్యారు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి సిబ్బందిని మంజూరు చేయడం లేదు. 15 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 అసోసియేట్ ప్రొఫెసర్లు, 22 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి. వాటినీ నింపలేదు. 400 మంది నర్సులు ఉండాలి. కానీ 200 మంది కూడా లేరు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు వరకూ ఓపి. కానీ డాకర్లు ఒకటి రెండు గంటలు కూడా చూడరు. క్లాసులు చెప్పుకుంటూ ప్రయివేటు ప్రాక్టీసు చేసుకుంటూ ఉంటారు. నర్సులు కంటికి కనిపించరు. ఈ దేశంలో ప్రాణం ఖరీదు చాలా తక్కువ. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో డెడ్ చీప్. ఈ లోపాలన్నింటికీ రోగులు ప్రాణాలను ఫీజుల కింద చెల్లిస్తుంటారు. జవాబుదారీ లేదు: కొంతకాలంగా జీజీహెచ్‌కు రెగ్యులర్ సూపరింటెండెంట్ ఉండడం లేదు. అధికార పార్టీ నాయకులు నియమించిన వారే ఇన్చార్జి సూపరింటెండెంట్లుగా చలామణి అవుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే అనేక వైద్యుల కంటే వీరు జూనియర్లు కావడంతో వీరి మాటను ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీనికితోడు సమస్యలపై వీరికి సరైన అవగాహన ఉండటం లేదు. చిత్తశుద్ధితో బాధ్యతలనూ నిర్వర్తించడం లేదు. పాత కట్టడాల పాపం: జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం మొదటినుంచీ అధ్వాన్నమే. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కట్టడాలు బాగానే ఉన్నప్పటికీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటంతో ఎలుకలు, పాములుకు నిలయంగా మారిపోయింది ఆసుపత్రి. లంచాల పీడ: ఆస్పత్రిలో రోజూ వారి చెత్తతో పాటు ప్రతిరోజూ ప్రసవాల వల్ల, శస్త్ర చికిత్సల వల్ల కనీసం 300 కిలోల జీవ వ్యర్థాలు పోగవుతాయి. వీటిని శుభ్రపరచడానికి కాంట్రాక్టర్‌కు నెలకు 21 లక్షల రూపాయలను కేటాయించారు. కాంట్రాక్ట్ ప్రకారం సరిగ్గా వ్యర్థాలను తీస్తున్నాడా, లేదా గమనించి అధికారులు బిల్లులు శాంక్షన్ చేయాలి. కాని లంచాల కారణంగా పని సరిగ్గా జరగకపోయినా బిల్లులు శాంక్షన్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనుక చెత్త పెరిగిపోయింది. పాలకులు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను పదవి చేపట్టాక దాదాపు 20 సార్లు గుంటూరుకు వచ్చి వెళ్లారు. కాని ఒక్కసారి కూడా జి.జి.హెచ్‌ను సందర్శించలేదు. సందర్శించి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. పసిపిల్లాడిని ఎలుకలు కొరికి చంపిన ఘటన తర్వాత కూడా ఆయన రాలేదు. వచ్చిన నాయకులు కంటితుడుపు మాటలే మాట్లాడారు. ఉత్తుత్తి సస్పెన్షన్లు చేశారు. సిబ్బందిలో తాము తప్పు చేస్తే శిక్ష ఉంటుందనే భయం రాలేదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన గొడవ వల్లే ఈ మాత్రమైనా స్పందన వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైద్యం చేయించుకుంటారా? గుంటూరు జిల్లాలో ప్రముఖులైన నేతలు ఎందరో ఉన్నారు. వారి వైద్యం అంతా కుటుంబ సభ్యుల వైద్యం అంతా ప్రయివేటు ఆస్పత్రుల్లో, లేదంటే హైదరాబాదులోని ఖరీదైన ఆస్పత్రుల్లో జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు కూడా వైద్యం కోసం ఈ వైపు రారు. వస్తే వారికి పేదల బాధలు తెలిసేవి. వచ్చే పేదల గోడు అర్థమయ్యేది. ‘ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే చదివించాలి’ అంటూ అలహాబాద్ హైకోర్ట్ పేర్కొన్న మాటలు (దిగువన ఉన్న ‘మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌కు పంపండి’ బాక్స్ చూడండి) అమలైతే ప్రభుత్వ బడుల్లో ఎంతో మార్పు వస్తుంది. అలాగే, ప్రభుత్వ సిబ్బంది అంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలి అనే నిబంధన పెడితే తప్ప ఈ ఆస్పత్రుల్లో మార్పు రాదేమో. ఏం శిక్ష పడింది? ఎలుకల దాడిలో శిశువు మరణించిన సంఘటనకు బాధ్యులను చేస్తూ ప్రభుత్వం జీజీహెచ్ సూపరింటెండెంట్, పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతులపై బదిలీ వేటు, సీఎస్ఆర్ఎంఓ, శానిటరీ ఇన్స్పెక్టర్, హెడ్‌నర్సు, స్టాఫ్‌నర్సులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రకటన చేసింది. అయితే ఇంత వరకు ఎటువంటి ఉత్తర్వులూ జారీ కాలేదు. అధికారులు, నర్సులు హాయిగా విధుల్లో కొనసాగుతున్నారు. సంఘటనకు బాధ్యులు ఎవరో ఇంత వరకు ప్రభుత్వం తేల్చలేకపోయింది. రాలే పసిమొగ్గలు... గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం పల్లెల నుంచి చుట్టుపక్కల పట్టణాల నుంచి పేదలు మధ్యతరగతి వారు వస్తుంటారు. ముఖ్యంగా నవజాత శిశువులు కాని, చిన్న పిల్లలు కాని రోజుకు 30 మంది ఇన్ పేషెంట్స్‌గా చేరుతుంటారు. కాని వీరిలో ఊపిరి పోసుకుని తిరిగివెళ్లేవారి సంఖ్య ఆశాజనకంగా లేదు. ఈ జూలైలో 367 మంది నవజాత శిశులు ఇన్‌పేషెంట్స్‌గా చేరితే 117 మంది చనిపోయారు. చిన్నపిల్లల ఐసియూలో 78 మంది చేరితే 32 మంది చనిపోయారు. ఆగస్టులో 224 మంది నవజాత శిశువులకు 78 మంది చనిపోయారు. చిన్నపిల్లల్లో 58 మంది చేరితే 10 మంది చనిపోయారు. జనవరి నుంచి ఆగస్టు వరకు లెక్కలు తీస్తే 913 మంది శిశు/చిన్నారుల మరణాలు అంటే ముప్పై శాతం మరణాలు నమోదయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో రావడం ఒక కారణమైనా పూర్తి స్థాయి వైద్యం అందించే పరికరాలు, వైద్యులు లేకపోవడం మరో ప్రధాన కారణం. -
చెత్త కుండిలా..
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఎనిమిదంతస్తుల అద్దాల మేడ.. విశాలమైన గదులు.. వివిధ వైద్య విభాగాలతో మెడికల్ కళాశా ల ఆస్పత్రి భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. అయితే నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా ఆస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయింది. వరండాల్లో, వార్డుల్లో, రోగులు శయనించే మంచాల కింద చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. మొత్తంగా ఆస్పత్రిలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందంటే అంటే అతిశయోక్తి కాదేమో! ఈ ఆస్పత్రికి ప్రతి రోజు ఇన్‌పేషెంట్లు, అవుట్పెషెంట్లు సుమారు 900 మంది, వారి కి సహాయకులుగా మరో 300 మంది వస్తుంటారు. ఇంతమందికి ఆస్పత్రిలో పారిశుధ్య సమస్యగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఆస్పత్రిలో 72 మంది పారిశు ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 32 మందికి రెండు నెలల వేతనాలు, మరో 40 మందికి నాలుగు నెలల నుంచి వేతనాలు పెండింగ్ పడిపోయాయి. ఒ క్కొక్కరికి రూ. 4,030 వేతనం ఉంటుంది. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో పారిశుధ్య లోపం ఏర్పడి రోగులు చెత్త కుప్పల మధ్యనే ఉండాల్సి వస్తోంది. అధికారులు ప్రత్యామ్నా య చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురిం చిందని వాపోతున్నారు. ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వా ర్డులో మురికి నీరు, చెత్తతో వార్డు మొత్తం మూసుకుపోయింది. రోగులు దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారు. రోగుల బంధువులు ఆస్పత్రిలో ఉండలేక బ యట ఆవరణలోకి సమయం గడుపుతున్నారు. ఇది లా ఉండగా మొత్తం కార్మికుల్లో 40 మందిని నాలుగు నెలల క్రితమే తాత్కాలిక పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. ఈ నియామకాలకు ఇంకా ఉన్నతాధికారుల అనుమతి లభించలేదని, దీంతో వీరికి వేతనాలకు సంబంధించి నిధులు విడుదల కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రెండు రోజులు సమ్మె వాయిదా.. మరో వైపు ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం, చెత్తా చెదారం పేరుకుపోవడంతో వైద్యాధికారులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఆయన చొరవతో డీసీహెచ్ఎస్ బాలకృష్ణరావు రెండు రోజుల్లో కార్మికుల జీతాలు చెల్లిస్తామని ప్రకటించారు. జిల్లాకు మెడికల్ కళాశాల అనుమతి ముఖ్యమైందని వివరించడంతో కార్మికులు రెండు రోజుల పాటు సమ్మెను వాయిదా వేసుకున్నారు. -
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సేవలు నిల్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా ఆస్పత్రికి రోజూ 600 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. 350 వరకు ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. రోజూ అత్యవసర సేవల కోసం 25 నుంచి 30 మంది వరకు వస్తుంటారు. వీరికి సేవలందించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటున్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలలో సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు. ఆస్పత్రిలో 130 స్టాఫ్‌నర్సు పోస్టులుండగా 32 మంది మాత్రమే ఉన్నారు. 250 వరకు సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అవసరం కాగా 19 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. వీరి సేవలూ అన్ని విభాగాలకు అందుబాటులోకి రావడం లేదు. అత్యవసర సేవల కోసం వచ్చేవారికి కుట్లు, కట్లు వేయడం కోసం వైద్యసిబ్బందికీ కొరత ఉంది. ఒకేసారి అత్యవసర చికిత్స కోసం మూడు నుంచి నాలుగు కేసుల వరకు వచ్చినపుడు పరిస్థితి దారుణంగా ఉంటోంది. దీంతో రోగుల బంధువులు వైద్యులు, వైద్యసిబ్బందితో తరచూ వాగ్వాదానికి దిగుతున్నారు. అందుబాటులో ఉండని వైద్యులు ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించడానికి వైద్యులు సైతం అందుబాటులో లేరు. రోజు ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు ఓపీ సేవలకోసం వేచి చూడాల్సిందే.. వైద్యులు ఇష్టానుసారంగా ఆస్పత్రికి వస్తుండడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. జిల్లా ఆస్పత్రిలో 36 మంది వైద్యులు ఉండాలి. కానీ, 14 మందే ఉన్నారు. మెడికల్ కళాశాలకు సంబంధించి 66 మంది ప్రొఫెసర్లు ఆస్పత్రిలో సేవలందించాల్సి ఉండగా, 18 మందికి మించి విధులకు హాజరు కావడం లేదు. మిగతా ప్రొఫెసర్లు ఆస్పత్రి వైపే కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రొఫెసర్లలో మార్పు రావడం లేదు. సమస్యలపై స్పందన కరువు ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, ఆర్ఎంఓ లేకపోవడంతో స్థానిక వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలున్నాయి. ఆయా పోస్టులలో రెగ్యులర్ అధికారులను నియమిస్తే ఆస్పత్రి పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలున్నాయి. వెంటిలేటర్ సౌకర్యం లేదు ఆస్పత్రిలో వెంటలేటర్ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటు. దీంతో వెంటిలేటర్ అవసరమైన రోగిని ఇతర ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. గతంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో అప్పటి కలెక్టర్ దీనిపై దృష్టి సారించారు. వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఆస్పత్రిలో ఆ సౌకర్యం ఏర్పాటు కాలేదు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ కూడా లేదు. పోస్టుమార్టం కోసం ప్రత్యేక డాక్టర్‌ను నియమించినా, ఆయన ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రికి వచ్చే వైద్యులు, ప్రొఫెసర్లే అత్యవసర సేవలు, వైద్య సేవలు, పోస్టుమార్టం తదితర సేవలు అందించాల్సి వస్తోంది. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సరైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. -
నరకంరా దేవుడా..
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సర్వజనాస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజూ 1,500 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగం పనిచేస్తుంది. అయితే.. ఓపీ స్లిప్‌ల కోసం రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాల కోసం మంగళవారం విధులు బహిష్కరించడంతో రోగులు మరింత ఇబ్బంది పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి రోగులు ఉదయం ఎనిమిది గంటలకే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఓపీ విభాగానికి తాళం వేసివుండడంతో ఆందోళన చెందారు. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేక ఓపీ సిబ్బంది రాక కోసం వేచి చూశారు. చివరకు 9.30 గంటలకు ఓపీ కౌంటర్ తెరిచారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఓపీ స్లిప్‌లను పంపిణీ చేశారు. ఓపీ కౌంటర్ ఆలస్యంగా తెరవడం, అప్పటికే రోగులు కిక్కిరిసి ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. బోరున విలపించిన తల్లులు ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎక్కువమంది చంటి బిడ్డలను తీసుకొచ్చారు. వీరు ఓపీ స్లిప్‌లను తీసుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ఓపీ విభాగం ముందు జనసంద్రాన్ని తలపించింది. ఊపిరాడని విధంగా పరిస్థితి తయారైంది. ఓపీ స్లిప్ తీసుకునే ముందు ఓ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఊపిరాడక కొడుకు ఎక్కడ చనిపోతాడోనని బిగ్గరగా కేకలు వేసింది. చివరకు చేసేది లేక కొడుకును వేరే వారి వద్ద వదలి, అతికష్టమ్మీద ఓపీ స్లిప్ తీసుకుంది. ఇలా పదుల సంఖ్యలో తల్లులు చంటి బిడ్డలకు వైద్యం అందించేందుకు అవస్థ పడ్డారు. కొంత మంది చిన్నారులు ‘అక్కా...అన్నా టోకెన్ ఇవ్వండం’టూ సిబ్బందిని వేడుకోవడం కన్పించింది. గేట్లకు అతుక్కుని మరీ బతిమాలారు. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి యాజమాన్యం అటువైపు తొంగి చూడలేదు. సొమ్మసిల్లిన మహిళ ఓపీ స్లిప్ కోసం రోగులు కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో రోగులు తామంటే తాము ముందొచ్చామంటూ గొడవ పడ్డారు. ఇదే సందర్భంలో స్లిప్ కోసం వచ్చిన ఓ మహిళ అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. పక్కనే ఉన్న వారు ఆమెను బయటకు పంపారు. కాసేపటి తర్వాత ృ్పహలోకి వచ్చిన ఆ మహిళ కుమారుణ్ని పక్కన కూర్చోబెట్టి మళ్లీ వెళ్లి ఓపీ స్లిప్ తీసుకుంది. ైవె ద్య సేవలు బంద్ కాంట్రాక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో పలు విభాగాల్లో వైద్య సేవలు బంద్ అయ్యాయి. ఉదయం నుంచి రక్త పరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, అడ్మిషన్ తదితర విభాగాలలో సేవలు నిలిచిపోయాయి. డాక్టర్లు వైద్య పరీక్షలకు సిఫారసు చేసినా ల్యాబ్‌లలో సిబ్బంది లేక రోగులు అవస్థ పడ్డారు. ఓ వృద్ధురాలు వైద్య పరీక్షల నిమిత్తం మూత్రాన్ని ఇచ్చేందుకు కంటైనర్ కోసం వెతకడం చూసిన వారిని కలచివేసింది. విధిలేక కొంత మంది వైద్య పరీక్షలను ప్రైవేట్‌గా చేయించుకున్నారు. ఇక వార్డులలో ఉంటున్న వారికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిలిచిపోయాయి. కాగా, ఆస్పత్రి ఔట్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు రోగుల పట్ల ఔదార్యం చూపారు. ఔట్‌పోస్టు ఇన్చార్జ్ రాము ముందుండి సెక్యూరిటీ సిబ్బందిని ఓపీ విభాగం, అడ్మిషన్ కౌంటర్లో పురమాయించారు. చివరకు ఓపీ కౌంటర్‌కు పోలీసులను పంపి రోగులకు స్లిప్‌లు అందేలా చూశారు.