అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సర్వజనాస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజూ 1,500 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగం పనిచేస్తుంది. అయితే.. ఓపీ స్లిప్‌ల కోసం రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాల కోసం మంగళవారం విధులు బహిష్కరించడంతో రోగులు మరింత ఇబ్బంది పడ్డారు.
సుదూర ప్రాంతాల నుంచి రోగులు ఉదయం ఎనిమిది గంటలకే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఓపీ విభాగానికి తాళం వేసివుండడంతో ఆందోళన చెందారు. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేక ఓపీ సిబ్బంది రాక కోసం వేచి చూశారు. చివరకు 9.30 గంటలకు ఓపీ కౌంటర్ తెరిచారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా
అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఓపీ స్లిప్‌లను పంపిణీ చేశారు. ఓపీ కౌంటర్ ఆలస్యంగా తెరవడం, అప్పటికే రోగులు కిక్కిరిసి ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
బోరున విలపించిన తల్లులు
ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎక్కువమంది చంటి బిడ్డలను తీసుకొచ్చారు. వీరు ఓపీ స్లిప్‌లను తీసుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ఓపీ విభాగం ముందు జనసంద్రాన్ని తలపించింది. ఊపిరాడని విధంగా పరిస్థితి తయారైంది. ఓపీ స్లిప్ తీసుకునే ముందు ఓ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఊపిరాడక కొడుకు ఎక్కడ చనిపోతాడోనని బిగ్గరగా కేకలు వేసింది. చివరకు చేసేది లేక కొడుకును వేరే వారి వద్ద వదలి, అతికష్టమ్మీద ఓపీ స్లిప్ తీసుకుంది. ఇలా పదుల సంఖ్యలో తల్లులు చంటి బిడ్డలకు వైద్యం అందించేందుకు అవస్థ పడ్డారు. కొంత మంది చిన్నారులు ‘అక్కా...అన్నా టోకెన్ ఇవ్వండం’టూ సిబ్బందిని వేడుకోవడం కన్పించింది. గేట్లకు అతుక్కుని మరీ బతిమాలారు. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి యాజమాన్యం అటువైపు తొంగి చూడలేదు.
సొమ్మసిల్లిన మహిళ
ఓపీ స్లిప్ కోసం రోగులు కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో రోగులు తామంటే తాము ముందొచ్చామంటూ గొడవ పడ్డారు. ఇదే సందర్భంలో స్లిప్ కోసం వచ్చిన ఓ మహిళ అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. పక్కనే ఉన్న వారు ఆమెను బయటకు పంపారు. కాసేపటి తర్వాత ృ్పహలోకి వచ్చిన ఆ మహిళ కుమారుణ్ని పక్కన కూర్చోబెట్టి మళ్లీ వెళ్లి ఓపీ స్లిప్ తీసుకుంది.
ైవె ద్య సేవలు బంద్
కాంట్రాక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో పలు విభాగాల్లో వైద్య సేవలు బంద్ అయ్యాయి. ఉదయం నుంచి రక్త పరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, అడ్మిషన్ తదితర విభాగాలలో సేవలు నిలిచిపోయాయి. డాక్టర్లు వైద్య పరీక్షలకు సిఫారసు చేసినా ల్యాబ్‌లలో సిబ్బంది లేక రోగులు అవస్థ పడ్డారు. ఓ వృద్ధురాలు వైద్య పరీక్షల నిమిత్తం మూత్రాన్ని ఇచ్చేందుకు కంటైనర్ కోసం వెతకడం చూసిన వారిని కలచివేసింది.
విధిలేక కొంత మంది వైద్య పరీక్షలను ప్రైవేట్‌గా చేయించుకున్నారు. ఇక వార్డులలో ఉంటున్న వారికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిలిచిపోయాయి. కాగా, ఆస్పత్రి ఔట్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు రోగుల పట్ల ఔదార్యం చూపారు. ఔట్‌పోస్టు ఇన్‌చార్జ్ రాము ముందుండి సెక్యూరిటీ సిబ్బందిని ఓపీ విభాగం, అడ్మిషన్ కౌంటర్‌లో పురమాయించారు. చివరకు ఓపీ కౌంటర్‌కు పోలీసులను పంపి రోగులకు స్లిప్‌లు అందేలా చూశారు.
నరకంరా దేవుడా..
Published Wed, Jan 22 2014 2:55 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement