నా తప్పేంటి? | what's mistake | Sakshi
Sakshi News home page

నా తప్పేంటి?

Published Thu, Sep 24 2015 2:03 AM | Last Updated on Tue, Aug 21 2018 3:45 PM

నా తప్పేంటి? - Sakshi

నా తప్పేంటి?

అమ్మ... కడుపు చించుకుంటే పుట్టాన్నేను!
అమ్మకు... కడుపుకోత మిగిల్చి వెళ్లాన్నేను!
అమ్మకింత పెద్ద శిక్షేంటి?
నాన్నకింత తీరని శోకమేంటి?
చెత్తకుండీలో పడేసినా బతికి ఉండేవాడినేమో!
ఐసీయూలో పెట్టి చంపేశారు!!
అమ్మ ఇచ్చే స్తన్యం
అమ్మ చేయించే స్నానం
అమ్మ పొత్తిళ్లు
అమ్మ లాలిపాట... ఏవీ నాకు దక్కకుండానే
ఐసీయూ నన్ను కొరికేసింది!
నాన్న పెట్టే ముద్దులు
నాన్న పట్టే రథాలు
నాన్న పుణికే బుగ్గలు
నాన్న పడే సంబరాలు... ఏవీ నాకు లేకుండానే
ఐసీయూ నన్ను కాటికి పంపింది!
గర్భంలా కాపాడుతుందనుకుంటే...
ఐసీయూ నాకు ఆగర్భశత్రువైంది!
ఇలా పుట్టాను. అలా చనిపోయాను.
నాదొకటే ప్రశ్న! నేను చేసిన తప్పేంటి?
మా అమ్మానాన్నలు చేసిన పాపమేంటి?
నాదే ఇంకొక ప్రశ్న!
నన్ను చంపింది ఆకలిగొన్న ఎలుకలా?
అలక్ష్యాల పందికొక్కులా?

 
బ్రహ్మ కడిగిన పాదమూ...!
బ్రహ్మ సృష్టికర్త
అతని సృష్టే ఈ చిన్నారి పాదాలు
కడుపులో తన్నినప్పుడు తల్లి పులకిస్తుంది.
గుండెల మీద తన్నినప్పుడు
తండ్రి పరవశిస్తాడు.
బుడిబుడి అడుగులు వేసినప్పుడు
కృష్ణపాదాలను తలచుకుంటాం.
ముద్దాడాల్సిన ఈ పాదాలు
రక్తపు ముద్దలుగా మారాయి.
మనకు రక్తం ఉడకదా?
ప్రతి తల్లికీ... నెత్తుటి కన్నీరు కారదా?

 
మురికిని పెంచారు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 1170 పడకలు ఉన్నాయి. వీళ్లకు కనీసం వేయి మంది అటెండర్స్ ఉంటారు. వీళ్లు గాక రోజూ 2500 మంది ఔట్ పేషెంట్స్ వస్తుంటారు. వీరందరూ తెచ్చే ఆహార పదార్థాలు వాటి వ్యర్థాలు రోజూ గుట్టలుగా పోగవుతుంటాయి. దీని కోసం 300 మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేయాలి. కానీ సగం మంది కూడా పని చేయడం లేదు. అందువల్ల ఎలుకలు పెరిగాయి. అవి వేల సంఖ్యలో ఉన్నాయి.
   
వైద్యులు తక్కువయ్యారు:
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి సిబ్బందిని మంజూరు చేయడం లేదు. 15 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 అసోసియేట్ ప్రొఫెసర్లు, 22 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి. వాటినీ నింపలేదు. 400 మంది నర్సులు ఉండాలి. కానీ 200 మంది కూడా లేరు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు వరకూ ఓపి. కానీ డాకర్లు ఒకటి రెండు గంటలు కూడా చూడరు. క్లాసులు చెప్పుకుంటూ ప్రయివేటు ప్రాక్టీసు చేసుకుంటూ ఉంటారు. నర్సులు కంటికి కనిపించరు. ఈ దేశంలో ప్రాణం ఖరీదు చాలా తక్కువ. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో డెడ్ చీప్. ఈ లోపాలన్నింటికీ రోగులు ప్రాణాలను ఫీజుల కింద చెల్లిస్తుంటారు.
 
జవాబుదారీ లేదు: కొంతకాలంగా జీజీహెచ్‌కు రెగ్యులర్ సూపరింటెండెంట్ ఉండడం లేదు. అధికార పార్టీ నాయకులు నియమించిన  వారే ఇన్‌చార్జి సూపరింటెండెంట్లుగా చలామణి అవుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే అనేక వైద్యుల కంటే వీరు జూనియర్లు కావడంతో వీరి మాటను ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీనికితోడు సమస్యలపై వీరికి సరైన అవగాహన ఉండటం లేదు. చిత్తశుద్ధితో బాధ్యతలనూ నిర్వర్తించడం లేదు.
 
పాత కట్టడాల పాపం:
జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం మొదటినుంచీ అధ్వాన్నమే.  బ్రిటిష్ కాలంలో నిర్మించిన కట్టడాలు బాగానే ఉన్నప్పటికీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటంతో ఎలుకలు, పాములుకు నిలయంగా మారిపోయింది ఆసుపత్రి.
 
లంచాల పీడ: ఆస్పత్రిలో రోజూ వారి చెత్తతో పాటు ప్రతిరోజూ ప్రసవాల వల్ల, శస్త్ర చికిత్సల వల్ల కనీసం 300 కిలోల జీవ వ్యర్థాలు పోగవుతాయి. వీటిని శుభ్రపరచడానికి కాంట్రాక్టర్‌కు నెలకు 21 లక్షల రూపాయలను కేటాయించారు. కాంట్రాక్ట్ ప్రకారం సరిగ్గా వ్యర్థాలను తీస్తున్నాడా, లేదా గమనించి అధికారులు బిల్లులు శాంక్షన్ చేయాలి. కాని లంచాల కారణంగా పని సరిగ్గా జరగకపోయినా బిల్లులు శాంక్షన్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనుక చెత్త పెరిగిపోయింది.
 
పాలకులు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను పదవి చేపట్టాక దాదాపు 20 సార్లు గుంటూరుకు వచ్చి వెళ్లారు. కాని ఒక్కసారి కూడా జి.జి.హెచ్‌ను సందర్శించలేదు. సందర్శించి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. పసిపిల్లాడిని ఎలుకలు కొరికి చంపిన ఘటన తర్వాత కూడా ఆయన రాలేదు. వచ్చిన నాయకులు కంటితుడుపు మాటలే మాట్లాడారు. ఉత్తుత్తి సస్పెన్షన్లు చేశారు. సిబ్బందిలో తాము తప్పు చేస్తే శిక్ష ఉంటుందనే భయం రాలేదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన గొడవ వల్లే ఈ మాత్రమైనా స్పందన వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
 
వైద్యం చేయించుకుంటారా? గుంటూరు జిల్లాలో ప్రముఖులైన నేతలు ఎందరో ఉన్నారు. వారి వైద్యం అంతా కుటుంబ సభ్యుల వైద్యం అంతా ప్రయివేటు ఆస్పత్రుల్లో, లేదంటే హైదరాబాదులోని ఖరీదైన ఆస్పత్రుల్లో జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు కూడా వైద్యం కోసం ఈ వైపు రారు. వస్తే వారికి పేదల బాధలు తెలిసేవి. వచ్చే పేదల గోడు అర్థమయ్యేది. ‘ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే చదివించాలి’ అంటూ అలహాబాద్ హైకోర్ట్ పేర్కొన్న మాటలు (దిగువన ఉన్న ‘మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌కు పంపండి’ బాక్స్ చూడండి) అమలైతే ప్రభుత్వ బడుల్లో ఎంతో మార్పు వస్తుంది. అలాగే, ప్రభుత్వ సిబ్బంది అంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలి అనే నిబంధన పెడితే తప్ప ఈ ఆస్పత్రుల్లో మార్పు రాదేమో.
 
ఏం శిక్ష పడింది?
ఎలుకల దాడిలో శిశువు మరణించిన సంఘటనకు బాధ్యులను చేస్తూ ప్రభుత్వం జీజీహెచ్ సూపరింటెండెంట్, పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతులపై బదిలీ వేటు, సీఎస్‌ఆర్‌ఎంఓ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెడ్‌నర్సు, స్టాఫ్‌నర్సులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రకటన చేసింది. అయితే ఇంత వరకు ఎటువంటి ఉత్తర్వులూ జారీ కాలేదు. అధికారులు, నర్సులు హాయిగా విధుల్లో కొనసాగుతున్నారు. సంఘటనకు బాధ్యులు ఎవరో ఇంత వరకు ప్రభుత్వం తేల్చలేకపోయింది.
 
రాలే పసిమొగ్గలు...
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం పల్లెల నుంచి చుట్టుపక్కల పట్టణాల నుంచి పేదలు మధ్యతరగతి వారు వస్తుంటారు. ముఖ్యంగా నవజాత శిశువులు కాని, చిన్న పిల్లలు కాని రోజుకు 30 మంది ఇన్ పేషెంట్స్‌గా చేరుతుంటారు. కాని వీరిలో ఊపిరి పోసుకుని తిరిగివెళ్లేవారి సంఖ్య ఆశాజనకంగా లేదు. ఈ జూలైలో 367 మంది నవజాత శిశులు ఇన్‌పేషెంట్స్‌గా చేరితే 117 మంది చనిపోయారు. చిన్నపిల్లల ఐసియూలో 78 మంది చేరితే 32 మంది చనిపోయారు. ఆగస్టులో 224 మంది నవజాత శిశువులకు 78 మంది చనిపోయారు. చిన్నపిల్లల్లో 58 మంది చేరితే 10 మంది చనిపోయారు. జనవరి నుంచి ఆగస్టు వరకు లెక్కలు  తీస్తే 913 మంది శిశు/చిన్నారుల మరణాలు అంటే ముప్పై శాతం మరణాలు నమోదయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో రావడం ఒక కారణమైనా పూర్తి స్థాయి వైద్యం అందించే పరికరాలు, వైద్యులు లేకపోవడం మరో ప్రధాన కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement