
సర్వేకు పవన్ కళ్యాణ్, విజయశాంతి నిరాకరణ
సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్, విజయశాంతి నిరాకరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు ఇచ్చేందుకు సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిరాకరించారు. ఆయనతోపాటు.. విజయశాంతి కూడా సర్వే వివరాలు ఇవ్వడానికి తిరస్కరించారు. వారి నుంచి మరోసారి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ఆ ప్రాంతానికి వెళ్లిన ఎన్యుమరేటర్లు తెలిపారు.
కాగా, హైదరాబాద్ నగరంలో 30 శాతం వరకు సర్వే పూర్తయిందని, మొత్తం సర్వేను మంగళవారమే పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ తెలిపారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉందని, సర్వేపై పూర్తి వివరాలను గవర్నర్‌కు అందజేశానని ఆయన అన్నారు. సమగ్ర సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఉదయం 7 గంటల నుంచి అన్ని డివిజన్లలో సర్వే ప్రారంభమైందని తెలిపారు. సర్వేతో ఇబ్బందిపడుతున్న ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నామని, 24 గంటలు పనిచేసే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌తోపాటు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎస్కేఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డివిజన్ నంబర్ టైప్‌చేసి స్పేస్ ఇచ్చి సమస్యను టైప్ చేసి 9177999876 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలని ఆయన సూచించారు.