సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు చెల్లించని మిల్లర్లపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద కేసులు నమోదు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. 2015–16కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇప్పటికీ వరంగల్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 21 మంది మిల్లర్ల నుంచి రూ.17 కోట్ల విలువైన 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందని పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ల (డీఎం)తో సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు.
2015–16 సీఎంఆర్ బకాయిల చెల్లింపు గడువు గతేడాది అక్టోబరు 31వ తేదీతో ముగిసిందని, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిందని, ఆ గడువు కూడా డిసెంబరు 30వ తేదీతో ముగిసిందని వివరించారు. గతేడాదికి రాష్ట్రంలో రూ.482 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉండగా, రూ.465 కోట్లు (99 శాతం) రాబట్టామని, ఇంకా రూ.17 కోట్ల వసూలుకు చర్యలు తీసుకోవాలని డీఎంలను ఆదేశించారు.