సాక్షి, హైదరాబాద్: రహదారిపై దూసుకుపోతూ ఉల్లంఘనలకు పాల్పడదాం.. పోలీసులు పట్టుకుంటే జరిమానా చెల్లించేద్దాం.. నగరంలోని ఉల్లంఘనుల్లో ఉన్న ఈ ధోరణిలో మార్పు వస్తోంది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఆగస్టు నుంచి విధిస్తున్న పెనాల్టీ పాయింట్సే దీనికి కారణం. పెనాల్టీ పాయింట్స్ విధానం ప్రారంభానికి ముందు రెండు నెలలైన జూన్–జూలైల్లో వీరి సంఖ్య 2.6 లక్షలుగా ఉండగా.. ఆగస్టు–సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 1.2 లక్షలకు తగ్గింది. సిటీ ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
విధించేప్పుడే పాయింట్లు తెలుస్తాయి..
మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ పెనాల్టీ పాయింట్స్ విధింపు విధానాన్ని ఆగస్టు 1 నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం స్పాట్ చలాన్‌కు మాత్రమే పరిమితమైన ఈ పెనాల్టీ పాయింట్స్ విధానం పూర్తిగా కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, సర్వర్ ఆధారంగా సాంకేతికంగా అమలవుతోంది. ఈ వ్యవహారం మొత్తం వాహనచోదకుడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా జరుగుతుంది. పోలీసులు ఓ ఉల్లంఘనుడిని రహదారిలో పట్టుకున్నప్పుడు అతడి లైసెన్స్ నంబర్‌ను ట్యాబ్/పీడీఏ మిషన్‌లో ఎంటర్ చేస్తారు. దాని ద్వారా అతడి లైసెన్స్‌పై పెనాల్టీ పాయింట్స్ నమోదయ్యేలా చూస్తున్నారు. ఇలా ఓ వాహనచోదకుడికి పాయింట్ నమోదు చేస్తున్నప్పుడు అప్పటికే ఆ లైసెన్స్‌పై ఎన్ని పాయింట్లు ఉన్నాయో సిబ్బంది తెలుసుకునే ఆస్కారం ఉంది.
మొదట ‘33’.. ఆపై ‘6’ మాత్రమే..
జూన్–జూలైలో ఆరుగురు ఉల్లంఘనులు 27 నుంచి 33 సార్లు ఉల్లంఘనలకు పాల్పడి రికార్డుల్లోకి ఎక్కారు. పెనాల్టీ పాయింట్ల విధింపు ప్రారంభమైన తొలి రెండు నెలల్లో గరిష్టంగా ముగ్గురిపైన మాత్రమే పదేపదే ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీరు కూడా ఆరుసార్లే ఉల్లంఘనలను పునరావృతం చేశారు. మరో 13 మంది ఐదుసార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. గడిచిన రెండు నెలల్లో గరిష్టంగా పడిన పెనాల్టీ పాయింట్ల సంఖ్య ఏడు మాత్రమే. మొత్తం 1.2 లక్షల మందికి పాయింట్లు విధించగా.. ముగ్గురు వాహనచోదకులకు ఇప్పటివరకు ఏడు పాయింట్లు పడ్డాయి. మరో 12 మందికి ఆరు పాయింట్లు, 238 మందికి ఐదు పాయింట్లు పడ్డాయి. ఇప్పటి వరకు ఎవరికీ 12 పాయింట్లు పూర్తి కాలేదని, ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేసే వరకు పరిస్థితులు వెళ్లలేదని అధికారులు చెబుతున్నారు. గత రెండు నెలల్లో అత్యధిక పెనాల్టీ పాయింట్లు ద్విచక్ర వాహనచోదకులకే. అదీ హెల్మెట్ లేని ఉల్లంఘనకే పడ్డాయి. ఈ సంఖ్య 1.05 లక్షలుగా నమోదైంది.
వాహనచోదకుల్లో ‘12’ పాయింట్ల భయం..
ఓ వాహనచోదకుడికి పెనాల్టీ పాయింట్ల విధింపు ప్రారంభమైన తర్వాత అతడికి ఉండే గడువు 24 నెలలు మాత్రమే. ఒకటో పాయింట్ పడిన తర్వాత రెండేళ్లల్లో 12 పాయింట్ల విధింపు పూర్తయితే అతడి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. ఈ భయం నగరవాసులను పట్టుకుంది. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడి.. పెనాల్టీ పాయింట్ పడిన వారు రెండోసారి అలాంటి పొరపాటు చేయడానికి వెనుకాడుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఉల్లంఘనల నమోదు తీరును పరిశీలిస్తే ‘అనుభవం’తర్వాత వాహనచోదకుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అత్యధిక కేసుల్లో ఒక పాయింట్ పడిన తర్వాత గరిష్టంగా రెండో పాయింట్ మాత్రమే పడుతోందని, ఆపై ఉల్లంఘనులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ వీలున్నంత వరకు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
ఉల్లంఘన వారీగా ‘టాప్ సెవెన్’..
ఉల్లంఘన రకం కేసులు
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ 1,05,434
సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ 42,594
సెల్‌ఫోన్ డ్రైవింగ్ 10,890
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ 8,870
డ్రంకన్ డ్రైవ్ 8,760
సిగ్నల్ జంపింగ్ 1,965
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన 1,390
పెనాల్టీ పాయింట్స్ ఇలా.. ఒక పాయింట్ పడిన
వాహనచోదకులు 1,06,285
రెండు పాయింట్లు 11,161
మూడు పాయింట్లు 1,893
నాలుగు పాయింట్లు 566
ఐదు పాయింట్లు 238
ఆరు పాయింట్లు 12
ఏడు పాయింట్లు 3
పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారి వివరాలు ఉల్లంఘనులు
జూన్ ఆగస్టు
జూలైల్లో సెప్టెంబర్‌ల్లో
ఒకసారి 2,29,259 1,13,639
రెండోసారి 22,699 5,884
మూడోసారి 4,667 541
నాలుగోసారి 1,553 78
ఐదోసారి 736 13
ఆరోసారి 441 3
మొత్తం 2,60,319 1,20,158
అమ్మో.. ఒకటో పాయింట్!
Published Mon, Oct 16 2017 5:14 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment