పెండింగ్‌లో మార్కెట్‌ కమిటీ | Pending Market Committee | Sakshi
Sakshi News home page

పెండింగ్‌లో మార్కెట్‌ కమిటీ

Published Thu, Jun 8 2017 5:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

Pending Market Committee

దేవరకొండ : రెండేళ్లుగా ఖాళీగా ఉన్న దేవరకొండ మార్కెట్‌ చైర్మన్‌ పదవికి ఎవరిని నియమించాలన్న అంశం ఇంకా డోలయామానంగా ఉంది. ఈ పదవికి పోటీ ఉండడంతో ఇప్పటికే రెండు కమిటీలు ముగియాల్సి ఉండగా ఇప్పటికీ చైర్మన్‌ సీటు ఖాళీగానే ఉంది. గత ఎన్నికల అనంతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దయిన కమిటీ స్థానంలో మరో నూతన కమిటీని ఎంపిక చేయాల్సి ఉండగా, పదవీ కాలం పొడగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌ కమిటీ కార్యవర్గాలన్నీ కోర్టును ఆశ్రయించాయి.

 దీంతో వారి పదవీ కాలాన్ని ఆరు నెలలకు పొడగించారు. 2015 చివర నుంచి చైర్మన్‌ సీటు ఖాళీగానే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చాలాచోట్ల మార్కెట్‌ కమిటీల ఎంపిక జరిగింది. కానీ దేవరకొండ స్థానంలో ఉన్న పోటీ కారణంగా మార్కెట్‌ కమిటీకి ఎవరిని నియమించాలన్న అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోవడం, రాజకీయ జోక్యం బాగా ఉండడంతో ఈ కమిటీపై తాత్సారం నడుస్తోంది.

ముందు ఇచ్చిన మాటకే..
గతేడాది నుంచి మార్కెట్‌ కమిటీ కోసం చాలా మంది పోటీపడుతూ వచ్చారు. అయితే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స్థానానికి గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరికి మాట ఇచ్చి ఉండడం, స్థానికంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ పేరును ప్రతిపాదించకపోవడంతో కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే స్థానిక నాయకులు ఇప్పటికే మంత్రి, కేసీఆర్‌కు ఈ స్థానంపై తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తుల పేర్లను ప్రతిపాదించారు. కానీ ముందుగానే సీఎం ఒక నిర్ణయానికి రావడంతో ఆ పదవి స్థానిక నేతలు ఆశించిన వారికి దక్కకుండాపోయింది.

దాదాపు ఖరారైన కమిటీ
అయితే దేవరకొండ మార్కెట్‌ కమిటీకి స్థానికంగా హన్మంతు వెంకటేశ్‌గౌడ్, ఏవీ రెడ్డి, బండారు బాలనర్సింహా, గాజుల ఆంజనేయులు, నాయిని మాధవరెడ్డి, రాంబాబు తదితరులు పోటీ పడుతూ వచ్చారు. కానీ ప్రభుత్వం మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న బండారు బాలనర్సింహాకు ఇవ్వడానికి మొగ్గుచూపుతూ వచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లు మాత్రం చెరో వ్యక్తుల పేర్లను మంత్రి, ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు. అయినప్పటికీ ఈ పదవి బండారు బాలనర్సింహాకు ఇవ్వడానికే హైకమాండ్‌ మొగ్గుచూపింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జెడ్పీ చైర్మన్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినహా మిగతా కార్యవర్గాన్ని సూచించాల్సిందిగా కోరడంతో వారిరువురూ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్, డైరెక్టర్లు, ట్రెడర్ల పేర్లను ప్రతిపాదించారు. ఈ క్రమంలో వైస్‌చైర్మన్‌ పదవిని నాయిని మాధవరెడ్డికి, మరో ఆరుగురు డైరెక్టర్లను, ట్రెడర్లను సూచిస్తూ ఏడీఎం కార్యాలయం నుంచి స్థానిక మార్కెట్‌ కార్యదర్శికి ఒక లేఖతో పాటు సదరు వ్యక్తులకు సంబంధించి వ్యవసాయ ధ్రువీకరణ పత్రాలను పంపాల్సిందిగా కోరుతూ రాతపూర్వక ఆదేశాలు పంపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement