వైఎస్, నేను కలిసి రూ.200 చేశాం కేసీఆర్ అలవికాని హామీలిచ్చారు
ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది పథకాలు పేదలకందే దాకా పోరాటం
శాసనమండలి విపక్ష నేత డి. శ్రీనివాస్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన
నిజామాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, తాను కలిసి టీడీపీ ప్రభుత్వం అందించిన నెలకు రూ. 75 పింఛన్‌ను రూ. 200కు పెంచామని శాసనమండలి విపక్ష నేత,డి. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట నగర కాంగ్రెస్ కమిటీ, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ తెలంగాణ తీసుకువచ్చింది, ఇచ్చింది, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీయేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు అపోహలతో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని పేర్కొన్నారు. నిజానికి కాం గ్రెస్ హయాంలోనే అమ్మహస్తం, బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్, 104, 108లాంటి పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది నిరుపేదలకు సేవ చేసిందన్నారు.
కేసీఆర్ నోట్లో కెళ్లి 'నో' అనే పదం ఎప్పుడు ఎల్లదని అన్నింటికి 'ఎస్' అంటూ ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారన్నారు. 'అన్నది చేసేది లేదు..అడిగిందానికి కాదన్నది లేదన్న' రీతిన కేసీఆర్ పాలసీ ఉందన్నారు.పింఛన్‌లలో చాలా మందికి అన్యాయం జరిగిందని, అర్హులకు కూడా పింఛన్ తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. గతంలో కంటే వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్లు తగ్గాయన్నారు. రేషన్ కార్డులు కూడా తొల గించారన్నారు. వీటన్నింటిపై ఇప్పుడిప్పుడే ప్రజల కు అవగాహన వస్తోందన్నారు. ఈ ప్రభావం తెలంగాణవ్యాప్తంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే దాకా ఊరుకోబోమన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ హామీలపై నిలదీస్తామన్నారు.
పేదింటి గుండెలు ఆగిపోతున్నాయి
పింఛన్ రాక బెంగతో పేదింటి గుండెలు ఆగిపోతున్నాయని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. వట్టి మాటలు చెబుతూ, సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను వంచిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి త్వరలోప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బంగారు తెలంగాణను తీసుకవస్తానన్న కేసీఆర్, ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని నిజామాబాద్ అర్బన్ ఇన్‌చార్జి మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. కూతురు, కుమారుడు, ఆల్లుడు, చుట్టాలందరికీ పదవులు కట్టబెట్టారన్నారు. ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఆయన బాటలో నడిచి ఆస్తులు పెంచుకుంటున్నారన్నారు.
తెలంగాణ ప్రజలు భ్రమలలో పడి టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన మొదలైందన్నారు. పరిపాలన చేతకాకుంటే పక్కకు జరగాలని మాజీ మేయర్ డి.సంజయ్ పేర్కొన్నారు. అర్హుల పేర్లు గల్లంతు చేసి,ఇష్టానుసారంగా పింఛన్లు మంజూరు చేసుకున్నారని విమర్శించారు. పింఛన్,సమయానికి రేషన్ సరుకు లు అందక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా, హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. అనంతరం ఏఓను కలిసి వినతిపత్రం సమర్పించారు.
'పింఛన్లు పెంచిన ఘనత మాదే'
Published Wed, Jan 14 2015 10:29 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement