సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే ఏటా విద్యుత్ బిల్లులు తడిసి మోపెడు కానున్నాయి. యావత్ రాష్ట్రానికి ఏడాది పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అవుతున్న ప్రస్తుత వ్యయం కన్నా ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లు ల వ్యయం అధికం కానుంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, తుపా కులగూడెం, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు తదితర ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే ఏటా వాటి నిర్వహణకు 38,947.83 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది.
ఎత్తిపోతల పథకాల విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.80 ఉండగా, ఏటా 38,947.83 ఎంయూల విద్యుత్ సరఫరా చేస్తే రూ.30,317.43 కోట్ల మేర ఎనర్జీ చార్జీలు కానున్నాయి. దీనికి రూ.2,203.01 కోట్ల డిమాండ్ చార్జీలు కలిపితే మొత్తం రూ.34,723.71 కోట్ల మేర కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఎత్తిపోతల పథకాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, ట్రాన్స్‌కో రిటైర్డు సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.పెంటారెడ్డి స్వయంగా ఈ విషయాన్ని నిర్ధారించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలపై ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని ఇంజనీర్స్ భవనంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కాపీ ‘సాక్షి’చేతికి చిక్కింది. ఎత్తిపోతల పథకాల కరెంటు బిల్లు ఏటా రూ.34,723.71 కోట్లు అవుతుందని ఆయన అంచనా వేయగా.. 2018–19లో తెలంగాణకు విద్యుత్ సరఫరాకు రూ.31,137.99 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) వార్షిక టారిఫ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని కోటీ 49 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, వీధి దీపాలు, హెచ్‌టీ తదితర అన్ని రకాల కేటగిరీల విద్యుత్ సరఫరా వ్యయం కంటే ఎత్తిపోతల పథకాలకు చేసే విద్యుత్ సరఫరా వ్యయమే ఎక్కువన్న మాట.
పంపులు నడిచినా, నడవకపోయినా బిల్లులు
కృష్ణా, గోదావరి నదుల్లో 60 నుంచి 120 రోజులు మాత్రమే వరద ప్రవాహం ఉంటుంది. గరిష్టంగా 4 నెలల పాటే ఎత్తిపోతల పథకాల పంపులు నడుస్తాయి. మిగతా 8 నెలలు ఖాళీగానే ఉంటాయి. అయితే పంపులు నడిచినా, నడవకపోయినా ఏడాదిపాటు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. ప్రతి నెలా వినియోగించిన విద్యుత్ మొత్తానికి ఎనర్జీ చార్జీలతో పాటు కిలోవాట్‌కు రూ.165 చొప్పున విద్యుత్ లోడ్‌కు డిమాండ్ చార్జీలు కలిపి విద్యుత్ బిల్లులు జారీ కానున్నాయి. ఎత్తిపోతల పథకాల పంపులు నడిచిన కాలంలో రూ.21,731.11 కోట్ల ఎనర్జీ చార్జీలు, డిమాండ్ చార్జీలు రూ.1,756.14 కోట్లు కానున్నాయి. పంపులు నడిచే 4 నెలలకు రూ.23,487.25 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 8 నెలలకు లోడ్ సామర్థ్యంలో 20 శాతం ఎనర్జీ, డిమాండ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, పంపులు నడవకపోయినా రూ.8,586.32 కోట్ల ఎనర్జీ చార్జీలు, రూ.447 కోట్ల డిమాండ్ చార్జీలు కలిపి రూ.9033.32 కోట్లు చెల్లించాల్సిందేనని పెంటారెడ్డి పేర్కొన్నారు.
చార్జీలు తగ్గించాలి...
రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు పెనుభారంగా మారే పరిస్థితి ఉండటంతో వాటికి తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయాలని పెంటారెడ్డి కోరుతున్నారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.5.80 నుంచి రూ.3.50కు తగ్గించడంతో పాటు లోడ్‌పై వేయాల్సిన డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఎత్తిపోతల పథకాలు 4 నెలలే నడవనున్న నేపథ్యంలో సీజనల్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.4.50 చొప్పున విధిస్తున్న చార్జీలను వర్తింపజేస్తే బాగుంటుందన్నారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలను తగ్గిస్తే ప్రయోజనం ఉండదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. నీటిపారుదల శాఖ చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు మాత్రమే తగ్గుతాయని, తగ్గించిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment