Pentareddy
-
మళ్లీ మేడిగడ్డ, అన్నారం మునుగుతాయి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌజ్‌లు మళ్లీ నీటమునిగే ప్రమాదముందని రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారులు పెంటారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన జలసౌధలో మీడియాతో మాట్లాడారు. పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను ఎత్తైన సురక్షిత ప్రాంతానికి తరలిస్తేనే మళ్లీ నష్టం జరగకుండా నివారించవచ్చని సూచించారు. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి తొలుత అనుమతిస్తే తర్వాత 120 మీటర్లకు తగ్గించి జెన్కో నుంచి డిజైన్లకు ఆమోదం తీసుకున్నారని ఆరోపించారు. అన్నారం పంప్‌హౌజ్‌ను తొలుత 131 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 125 మీటర్లకు తగ్గించారని తెలిపారు. ఎత్తును తగ్గించడంతోనే పంప్‌హౌజ్‌లు మునిగినట్టు ఆరోపించారు. 2022లో మునిగిన తరహాలోనే మళ్లీ ఈ రెండు పంప్ హౌజ్‌లు మునుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యారేజీల గరిష్ట నిల్వ మట్టం(ఎఫ్ఆర్ఎల్) కంటే ఎక్కువ ఎత్తులో పంప్‌హౌజ్‌లను కట్టాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మించడంతోనే సమస్యలొచ్చాయన్నారు. నాటి మంత్రి ఒత్తిడితో భూగర్భంలో నిర్మించారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా పంప్‌హౌజ్‌లను భూఉపరితలంలో నిర్మించాలని సిఫారసు చేస్తే, నాటి మంత్రి ఒత్తిడితో భూగర్భంలో నిర్మించారని ఆరోపించారు. మోటార్లు ఎఫ్ఆర్ఎల్కి తక్కువ ఎత్తులో పెట్టినా పెద్దగా నష్టం ఉండదని, కంట్రోల్ ప్యానెళ్లు, స్టార్టర్లు మాత్రం ఎత్తులో ఉండాల్సిందేనన్నారు. పటేల్ కంపెనీ తీరుతోనే కల్వకుర్తి లిఫ్టులోని పంప్‌హౌజ్ నీటమునిగి భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. -
ఎత్తిపోతలకు గట్టి మోతలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే ఏటా విద్యుత్ బిల్లులు తడిసి మోపెడు కానున్నాయి. యావత్ రాష్ట్రానికి ఏడాది పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అవుతున్న ప్రస్తుత వ్యయం కన్నా ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లు ల వ్యయం అధికం కానుంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, తుపా కులగూడెం, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు తదితర ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే ఏటా వాటి నిర్వహణకు 38,947.83 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది. ఎత్తిపోతల పథకాల విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.80 ఉండగా, ఏటా 38,947.83 ఎంయూల విద్యుత్ సరఫరా చేస్తే రూ.30,317.43 కోట్ల మేర ఎనర్జీ చార్జీలు కానున్నాయి. దీనికి రూ.2,203.01 కోట్ల డిమాండ్ చార్జీలు కలిపితే మొత్తం రూ.34,723.71 కోట్ల మేర కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఎత్తిపోతల పథకాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, ట్రాన్స్‌కో రిటైర్డు సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.పెంటారెడ్డి స్వయంగా ఈ విషయాన్ని నిర్ధారించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలపై ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని ఇంజనీర్స్ భవనంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కాపీ ‘సాక్షి’చేతికి చిక్కింది. ఎత్తిపోతల పథకాల కరెంటు బిల్లు ఏటా రూ.34,723.71 కోట్లు అవుతుందని ఆయన అంచనా వేయగా.. 2018–19లో తెలంగాణకు విద్యుత్ సరఫరాకు రూ.31,137.99 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) వార్షిక టారిఫ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని కోటీ 49 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, వీధి దీపాలు, హెచ్‌టీ తదితర అన్ని రకాల కేటగిరీల విద్యుత్ సరఫరా వ్యయం కంటే ఎత్తిపోతల పథకాలకు చేసే విద్యుత్ సరఫరా వ్యయమే ఎక్కువన్న మాట. పంపులు నడిచినా, నడవకపోయినా బిల్లులు కృష్ణా, గోదావరి నదుల్లో 60 నుంచి 120 రోజులు మాత్రమే వరద ప్రవాహం ఉంటుంది. గరిష్టంగా 4 నెలల పాటే ఎత్తిపోతల పథకాల పంపులు నడుస్తాయి. మిగతా 8 నెలలు ఖాళీగానే ఉంటాయి. అయితే పంపులు నడిచినా, నడవకపోయినా ఏడాదిపాటు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. ప్రతి నెలా వినియోగించిన విద్యుత్ మొత్తానికి ఎనర్జీ చార్జీలతో పాటు కిలోవాట్‌కు రూ.165 చొప్పున విద్యుత్ లోడ్‌కు డిమాండ్ చార్జీలు కలిపి విద్యుత్ బిల్లులు జారీ కానున్నాయి. ఎత్తిపోతల పథకాల పంపులు నడిచిన కాలంలో రూ.21,731.11 కోట్ల ఎనర్జీ చార్జీలు, డిమాండ్ చార్జీలు రూ.1,756.14 కోట్లు కానున్నాయి. పంపులు నడిచే 4 నెలలకు రూ.23,487.25 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 8 నెలలకు లోడ్ సామర్థ్యంలో 20 శాతం ఎనర్జీ, డిమాండ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, పంపులు నడవకపోయినా రూ.8,586.32 కోట్ల ఎనర్జీ చార్జీలు, రూ.447 కోట్ల డిమాండ్ చార్జీలు కలిపి రూ.9033.32 కోట్లు చెల్లించాల్సిందేనని పెంటారెడ్డి పేర్కొన్నారు. చార్జీలు తగ్గించాలి... రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు పెనుభారంగా మారే పరిస్థితి ఉండటంతో వాటికి తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయాలని పెంటారెడ్డి కోరుతున్నారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.5.80 నుంచి రూ.3.50కు తగ్గించడంతో పాటు లోడ్‌పై వేయాల్సిన డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఎత్తిపోతల పథకాలు 4 నెలలే నడవనున్న నేపథ్యంలో సీజనల్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.4.50 చొప్పున విధిస్తున్న చార్జీలను వర్తింపజేస్తే బాగుంటుందన్నారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలను తగ్గిస్తే ప్రయోజనం ఉండదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. నీటిపారుదల శాఖ చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు మాత్రమే తగ్గుతాయని, తగ్గించిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తున్నారు. -
నమ్మి కొంటే.. నట్టేట ముంచారు!
కందవాడ (చేవెళ్లరూరల్): వె ంచర్ యజమానులు గ్రామస్తులే కదా అని నమ్మి ప్లాట్లు కొన్న ఇద్దరు నట్టేట మునిగిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రియల్ వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా చూస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట వాపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కందవాడ గ్రామంలో సర్వేనెంబర్ 284లో రెండు ఎకరాల భూమిని 2012లో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పెంటారెడ్డి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మల్లేశ్‌తో కలిసి వెంచర్ చేశాడు. సుమారు 50 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. వెంచర్ యజమానులు తమ గ్రామానికి చెందిన వారే కదా అని నమ్మిన కందవాడకు చెందిన కావలి శ్రీశైలం, కావలి శ్రీనివాస్‌లు తమ భార్యల పేరుమీద 150 గజాల చొప్పున రూ. 1.5 లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల వాని ప్లాట్లు ట్రాక్టర్ దున్ని వెంచర్ యజమానులు ఇతర వ్యక్తులకు అమ్మేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు వెంచర్ యజమానులు ప్రశ్నించగా ప్లాట్లతో మీకు ఎలాంటి సంబంధం లేదని బెదిరించారు. దీంతో చేసేదిలేక బాధితులు ఈనెల 19న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చే యలేదు. కాగా తమపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారా..? అంటూ రియల్ వ్యాపారులు తమను బెదిరిస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట సోమవారం వాపోయారు. తాము రెక్కలుముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టుకుంటే ఇలా మోసం చేయడం ఎంతవరకు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ యజమానులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి కొనుగోలు చేశామని.. ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పారు. ఈవిషయమై ఎస్ఐ లక్ష్మీరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగాా.. ఫిర్యాదు అందిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఇరువర్గాల వారు రాజీ కుదుర్చుకుంటామని చెబితే కేసు నమోదు చేయలేదు. బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలతో కేసు నమోదు చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని తెలిపారు. ఈ విషయమై వెంచర్ యజమాని పెంటారెడ్డి మాట్లాడుతూ.. బాధితు లకు తాము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. తాము ఎవరినీ బెదిరించలేదని తెలియ జేశారు. రాజకీయంగా తమను ప్రత్యర్థులు దెబ్బతీసేందుకు యత్నిస్త్త్త్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.