
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో భాగంగా భారత సైన్యం చేసే ప్రతి చర్యకు దేశ ప్రజలంతా మద్దతునిస్తారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కానీ ఆ సైనిక చర్యలను ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రధాని నరేంద్రమోదీ వాడుకోవడం ఆయ న దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైనిక చర్యలను ఆక్షేపిస్తున్నాయని మోదీ పేర్కొనడాన్ని ఖండించారు. ఐదేళ్ల ఎన్‌డీఏ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మోదీ విపక్షాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
శుక్రవారం మఖ్దూంభవన్‌లో జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించిన అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. శాటిలైట్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఇస్రో లేదా డీఆర్‌డీఓనో విడుదల చేయాలని సురవరం చెప్పారు. ప్రధాని మోదీ ఈ అంశాన్ని విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ఐదేళ్లలో మోదీ అన్ని వ్యవస్థల్ని ధ్వం సం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగింట్లో సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేస్తున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందని, ఏయే స్థానాలకు మద్దతిస్తామో త్వరలో ప్రకటిస్తామన్నారు.