సాక్షి, నిజామాబాద్‌అర్బన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతి కోసం అమలు చేసిన సంక్షేమం పథకాలు, నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చేపట్టిన పనులను చూసి నగర వాసులు మరోమారు తనను ఆశీర్వదిస్తారని టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. నగరంలో రూ.850 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం గణేష్‌గుప్త ‘సాక్షి’తో మాట్లాడారు. అడుగడుగునా ప్రజాదరణ లభిస్తుందని, మరో మారు టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు పేర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి ప్రజాస్పందన చూచి ఎంతో ఆనందం కలుగుతోందన్నారు.
ప్రజల ఆదరణ ఎంతో బాగుంది.....
అర్బన్‌లోని ప్రతి గల్లీలో, కాలనీల్లో ప్రజల ఆదరణ ఎంతగానో బాగుంది. టీఆర్‌ఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు ఎంతగానో లబ్ధిచేకూర్చాయి. మళ్లీ టీఆర్‌ఎస్‌నే గెలిపించుకుంటామని అంటున్నారు. పేద, మధ్యతరగతి స్థాయి అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి పథకాలు వరంగా మారాయి. ప్రచారంలో భాగంగా ప్రతి గల్లీలోను ఆదరణ చూపుతున్నారు. అన్ని వర్గాల వారికి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు.
నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి....
నగరంలో రూ.850 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాము. గతంలో ఏ ప్రభుత్వాలు, ఏ పాలకులు చేయని పనులు నాలుగేళ్లలో నేను ఎమ్మెల్యేగా ఉండి చేశాను. పార్క్‌ల నిర్మాణాలు, యూజీడీ పనులు, మిషన్ భగీరథ పనులు పూర్తి అయ్యాయి. అలాగే ఆర్‌యూబీ పనులు కొనసాగుతున్నాయి. కేటీఆర్, ఎంపీ కవిత సహకారంతో నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగం గా జరిగాయి. ఐటీ హబ్ అందుబాటులోకి వ స్తుంది. ఇలా అభివృద్ధి చేసి మరింత సుందరం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. పట్టణం రూ పురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ తరువా త నిజామాబాద్ పట్టణంలో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. రెండవ దఫా మరిన్ని నిధులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తాం.
సంక్షేమ పథకాలు మేలు చేస్తున్నాయి....
పట్టణంలో చాలామంది ప్రజలు సంక్షేమ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని అంటున్నారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, పెన్షన్లు అందిస్తున్నాం. గత ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఎంతగానో ఆసరాగా నిలిచాయి. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్లు పెంచుతున్నాం. దీనిపై కూడా లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు ముఖ్యమంత్రికావాలని కోరుకుంటున్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ పట్టణంలోనే అధిక ఇల్లు ఉన్నాయి. ఆలస్యం అవుతున్నా అందుబాటులోకి ఇళ్లను తీసుకువచ్చి ఇస్తాం. అలాగే సొంత భూమి ఉన్నవారు ఇళ్లు కట్టుకుంటే ఆర్థిక సహాయం చేస్తాం. గురుకుల పాఠశాలల ఏర్పాటు, మైనార్టీ పాఠశాలల ఏర్పాటు , ఆసుపత్రుల అభివృద్ధి ఎంతో జరిగింది.
మహాకూటమి కాదు అవకాశ కూటమి...
మహాకూటమి కాదు అది అవకాశకూటమి.. కేవలం రాజకీయ లబ్ధికోసమే, అవకాశాల కోసం ఏర్పడిన కూటమి. ప్రజలు ఈ మహాకూటమిని విశ్వసించరు. అసలు మహాకూటమికి ప్రజా ఆదరణ లేదు. కూటమితో పోటీ కూడా ఉండదు. ప్రజలందరు టీఆర్‌ఎస్‌వైపు ఉన్నారు. ఇలాంటి అవకాశ వాదులను నమ్మరు. అభివృద్ధిని చూచి టీఆర్‌ఎస్‌కు ఓటువేయనున్నారు.
శివారుప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నగరం రోజు రోజుకూ విస్తరిస్తోంది. శివారు కాలనీలు, ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. ఇదివరకే సగం పనులు పూర్తి అయ్యాయి. వీటిని మరింత అభివృద్ధి చేస్తాం. ఒక ప్రణాళిక ప్రకారం రోడ్లు, డ్రైనేజీలు భవిష్యత్తు రోజుల్లో గుర్తుండిపోయేలా చేపడుతున్నాం. నీటి సౌకర్యం సైతం అందుబాటులో ఉంది. ఆదాయం పెరుగుతుంది కాబట్టి పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాము. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నాం.
ఉపాధి అవకాశాలు కల్పిస్తాం...
పట్టణంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఐటీ హబ్ అందుబాటులోకి తీసుకువచ్చి ఉపాధి అవకాశం కల్పించి అలాగే నిరుద్యోగ భృతి అందిస్తాం. ఐటీ హబ్ అందుబాటులోకి రాగానే పరిశ్రమలు సైతం ఏర్పాటు అవుతాయి. దీని ద్వారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల కల్పన ఏర్పడుతుంది. తద్వారా పట్టణ ప్రజలకు వివిధ ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాము. ఇప్పటికే వివిధ కంపెనీలు నిజామాబాద్‌కు వచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాయి. దీనిని పకడ్బందీగా అమలుచేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment