సాక్షి, మెదక్: జిల్లాలో 20 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018లో జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 92 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోగా, 12 మంది భార్యాభర్తల మధ్య జరిగిన తగాదాలతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆరుగురు ప్రేమ వ్యవహరంలో, 53 మంది వివిధ కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో ఇప్పటి వరకు సుమారు 64కు పైగా ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య అధికమే అని చెప్పవచ్చు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్లే అధికంగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి.
ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతారు.
ఆత్మ విశ్వాసం కోల్పోయినట్లు అనిపించే వ్యక్తులు.
చదువులో వెనుకబడి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చలేక పోతున్నామని భావించే విద్యార్థులు.
మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వ్యక్తులు.
సమాజంలో పరువు పోతుందేమో, ఎదుటి వారు తప్పుగా మాట్లాడుకుంటారేమో అనుకునే వ్యక్తులు.
కుటుంబ, ఆస్థి తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబందాలు, భార్యభర్తల మధ్య ఒకరిపై మరొకరికి నమ్మకం లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు.
ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే..
ఒకచోట కుదురుగా ఉండకుండా అటూ ఇటూ తిరుగుతుండటం.
ఏ పని మీద ఆసక్తి చూపకపోవడం, చేసే పని మీద ఆసక్తి లేకపోవడం.
ప్రతి చిన్న విషయానికి ఎదుటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.
కుటుంబ సభ్యులు, స్నేహితులసై తరుచూ అసహనం వ్యక్తం చేయడం.
చీకటిలో ఎక్కువ సమయం గడపడం. దిగాలుగా, దుఖ:ంతో ఉండటం.
ఎవరిని కలువకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం. అనుకున్నది సాధించలేకపోయామనే నిర్వేదం.
జీవించడం వల్ల ఎవరికి ఉపయోగం లేదనుకోవడం వంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులను అనుమానించాలి.
జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు
నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కొమ్మాట మౌనిక(42) మార్చి 3వ తేదీన అత్తింటి వేదింపులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
వెల్ధుర్థి మండలం శంశిరెడ్డిపల్లి తండాలో కాళ్ల పారాని ఆరకముందే మనస్థాపానికి గురైన అరుణ(19) ఏప్రిల్ 1న ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసకుంది. పెళ్లైన 13 రోజులకే జరిగిన ఈ ఘటన
అందరిని కలచివేసింది.
వెల్ధుర్థి మండలం మానెపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనల్‌ఇయర్ విద్యార్థి సతీష్(22) మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కౌడిపల్లి మండలం శేరి తండాకు చెందిన రమావత్ రూప్ల(53)అనే రైతు పంటలు ఎండిపోగా చేసిన అప్పులు ఎట్లా చెల్లించాలనే బాధతో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు.
రామాయంపేట మండలం గుల్పర్తి గ్రామానికి చెందిన రైతు సాదుల నర్సిలు(35) ఏప్రిల్ 22న అప్పుల భాద తట్టుకోలేక తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు.
చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన కొడదప్ప(55) జీవితం పై విరక్తితో ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు.
పెద్దలు పెళ్లికి నిరాకరించానే కారణంతో మనస్థాపానికి గురైన ప్రేమ జంట ఆత్మహత్య ఫిబ్రవరి 17న జిల్లాలో కలకలం సృష్టించింది. ఝాన్సిలింగాపూర్‌కు చెందిన బాలేష్(21), రాయిలపూర్‌కు చెందిన పర్విన్ (18) రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్ అటవీ ప్రాంతంలో ఆత్మహహ్య చేసుకున్నారు.
ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు
సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కావు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. గతంతో పోలిస్తే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. వ్యక్తుల ప్రవర్తనలో ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ ఇప్పించడం, మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లడం వంటివి చేయాలి.
ప్రేమ విఫలమైందని, మాధకద్రవ్యాలకు భానిసలై విచక్షణ కోల్పోయి, పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనోవేధనతో, భార్యభర్తల మధ్య తగాదాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యక్తుల ప్రవర్తను గుర్తించి సాంత్వన చేకూర్చేలా మాట్లాడితే వారిని కాపాడవచ్చు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని మార్చుకుంటారు.
– రమేశ్‌బాబు, సైకాలజిస్ట్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్, మెదక్
Comments
Please login to add a commentAdd a comment