
జనమే జనం
- సర్వే చిత్రం
- శివారుల్లో పెరుగుతున్న జనాభా
- వలసలతో పెరుగుతున్న కుటుంబాలు
- విద్యా సంస్థలూ ఓ కారణమే
ఉద్యోగం కోసం...ఉపాధి కోసం వలస వచ్చేవారికి మేమున్నానంటూ గ్రేటర్‌లోని శివారు ప్రాంతాలు ఆశ్రయమిస్తున్నాయి. అక్కునచేర్చుకుంటున్నాయి. గూడు కల్పిస్తున్నాయి... ఫలితంగా ఆ ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది. అదీ మామూలుగా కాదు... జెట్ స్పీడుతో. ఇదేదో అంచనాతో చెబుతున్న మాట కాదు.. సమగ్ర కుటుంబ సర్వే సాక్షిగా వెల్లడైన వాస్తవం. నగరంలో భారమైన అద్దెలు...పెరుగుతున్న కాలుష్యం...వెరసి జనాలను శివారు బాట పట్టిస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో గడచిన మూడేళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో దాదాపు రెండింతలైంది. కోర్ సిటీ కంటే శివార్లలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఎల్‌బీనగర్‌లో మూడేళ్ల క్రితం 1,39,419 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం అవి 2,26,796కు చేరాయి. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిల్లోనూ గణనీయంగా కుటుంబాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్‌లో గతంలో 94,875 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 1.80 లక్షలకు చేరాయి.
అంటే సంఖ్య దాదాపు రెట్టిం పైంది. కూకట్‌పల్లిలో 1,27,655 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 2,10, 343కు పెరిగాయి. సగటున కుటుంబానికి నలుగురిని లెక్కేసుకున్నా నాలుగు లక్షల జనాభా పెరిగింది. ఉప్పల్ సర్కిల్‌లో మాత్రం పెరుగుదల స్వల్పంగా నమోదైంది. గతంలో 41,188 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 6,441 కుటుంబాలు పెరిగి, మొత్తం 47,629కు చేరుకున్నాయి. శేరిలింగంపల్లి-2, మల్కాజిగిరి సర్కిళ్లలో 40 వేలకు పైగా పెరిగాయి. చాలా కుటుంబాల వారు ఉమ్మడిగా ఉంటున్నప్పటికీ.. జనగణనలో విడివిడిగా నమోదు చేయించుకున్నారు.
సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేయించుకోని పక్షంలో భవిష్యత్‌లో గ్యాస్, పాస్‌పోర్టు వంటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయేమోననే తలంపుతో ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. కోర్‌సిటీలోని ఖైరతాబాద్, అబిడ్స్ వంటి సర్కిళ్లలో పెరుగుదల పెద్దగా లేదు. వలస వచ్చే కుటుంబాలు.. జీవనోపాధి కోసం వచ్చేవారు శివారుల్లోనేఎక్కువగా ఉంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
శివార్లలో లెక్కకు మిక్కిలి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు కూడా అక్కడ జనాభా పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. పిల్లల చదువుల కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. కోర్‌సిటీలో అద్దెల భారంతో పాటు కొత్త నిర్మాణాలు లేనందున అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టం కావడంతో నగరానికి వలస వచ్చేవారు శివార్లకే మొగ్గు చూపుతున్నారు.