మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సాక్షి, ఇబ్రహీంపట్నం: ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను గద్దె దించాల్సిందేనని, వారు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇబ్రహీంపట్నంలో బీఎల్‌ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి పగడాల యాదయ్యకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన సభలో ఏచూరి మాట్లాడారు. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తామని చెప్పిన హామీని ప్రధాని మోదీ మరిచిపోయాడన్నారు. ఉన్న ఉద్యోగాలనే తగ్గిస్తున్నారని ఆరోపించారు. 12 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి దేశాన్ని వదిలి విదేశాలకు పారిపోయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సైన్యానికి కావాల్సిన విమానాల కొనుగోలులో 60 వేల రాఫెల్ కుంభకోణం జరిగినా.. విచారణ జరిపేందుకు మోదీ ఒప్పుకోవడంలేదని మండిపడ్డారు. ఆర్థికంగా దేశాన్ని మోదీ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 93 శాతం మైనార్టీలు, దళితులు, గిరిజనులు, బీసీలున్నారని, సామాజిక న్యాయం జరగాలంటే వారు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు.
మతతత్వ శక్తులతో కుమ్మక్కై లౌకికతత్వ రాజ్యాగాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాడని విమర్శించారు. మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ఆరోపించారు. బీఎల్‌ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి యాదయ్యను గెలిపిస్తేనే పేదలకు, బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు.
పేదల బతుకుల్లో మార్పులేదు...
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే పేదల బతుకులు మారిపోతాయనుకుంటే.. అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రమొచ్చి ఐదేళ్లు కావస్తున్నా పేదల బతుకుల్లో మార్పులేదన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ బతుకులు బాగుపడాలంటే ఎలాంటి వారిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాలన్నారు. బలహీన వర్గాల అభ్యర్థి పగడాల యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులే...
ఇబ్రహీంపట్నంరూరల్: దేశంలో నిజమైన దేశభక్తులెవరైనా ఉన్నారంటే అది కమ్యూనిస్టులు మాత్రమేనని బహుజన లెఫ్ట్‌ప్రంట్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ తోడెళ్లలాగా తయారై ప్రజలను పీక్కుతింటున్నాయని చెప్పారు. ఈ తోడెళ్ల నుంచి కాపాడి ప్రజలకు రక్షణ ఉండటానికి బీఎల్‌ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. బహుజన రాజ్యం రావాలంటే యాదన్నను గెలిపించాలని కోరారు. యాదన్న లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు అయితే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చారు. బీఎల్‌ఎఫ్‌లో మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారాజ్యం, బహుజన రాజ్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం బీఎల్‌ఎఫ్ పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయం కోసం గతంలో గద్దర్, ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు మాట్లాడరని, వారి ఆత్మగౌరవాన్ని సోనియా, చంద్రబాబు కాళ్లముందు పెట్టరన్నారు. వామపక్ష ఐక్యత కోసం సీపీఎం కృషి చేస్తే సీపీఐ మాత్రం ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ నాయకులకు వద్ద పార్టీ గౌరవాన్ని తాకట్టు పెట్టారని అక్కడక్కడ సీపీఐ కార్యకర్తలే అంటున్నారని చెప్పారు. ఈ సభ సీపీఎం రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, లెల్లెల బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ, సామేలు, జంగయ్య, మధుసూదన్‌రెడ్డి, జగదీష్, జగన్, మాజీ జడ్‌పీటీసీ కవిత, శ్రీనివాస్‌రెడ్డి, జంగయ్య , రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment